RTA Nellore
-
అధికార దోపిడీ
ప్రభుత్వ చలానా కంటే అధిక మొత్తం వసూలు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం రవాణా కార్యాలయానికి వెళ్లాలంటే హడలెత్తుతున్న వైనం నెల్లూరు (టౌన్): పెద్ద నోట్లు రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రవాణాశాఖలో మాత్రం పండగ చేసుకుంటున్నారు. ప్రభుత్వ చాలనాలోనే అధిక మొత్తం విధించి కొంతమంది ఉద్యోగులు బహిరంగ వసూళ్లకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై ఉన్నతాధికారికి పలువురు ఫిర్యాదు చేస్తే ఇక్కడ అంతే వసూలు చేస్తారు చెప్పినంత చెల్లించి వెళ్లండంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. నెల్లూరు నేతాజీనగర్‌కు చెందిన రాచమల్లి నాగభూషణం తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయించుకునేందుకు సోమవారం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాడు. రెన్యువల్ సెక్షనులో ఉండే ఉద్యోగికి తనకు సంబంధించిన పత్రాలను అందజేశాడు. రూ.1,060లు ప్రభుత్వ చలానా చెల్లించాలని చెప్పడంతో అడిగిన మొత్తాన్ని ఇచ్చి రశీదు పొందారు. నాగభూషణం డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ 2012 జూలై 12తో ముగిసింది. రెన్యువల్ చేయించుకోవాల్సిన సమయం నాలుగేళ్లు దాటడంతో ప్రభుత్వ చలానా రూ.560తో పాటు మొదటి ఏడాది రూ.100 ఆ తరువాత ఏడాది నుంచి రూ.50లు లెక్కన కట్టించుకుని ఐదేళ్లు గడువు ముగిసేంత వరకు రెన్యువల్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం కలిపి రూ.810లు చలానా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే అతని వద్ద నుంచి రూ.1060లు కట్టించుకోవడం గమనార్హం. కార్యాలయంలో ప్రింటర్లు మరమ్మతులుకు గురవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఆయా సెక్షన్ల ఉద్యోగులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం రూ.810లు మాత్రం కంప్యూటర్లో పొందుబరిచారు. చలనా కంటే మిగిలిన మొత్తం రూ.250ను కలిపి రూ.1060లు చేతితో రాసి వాహన చోదకులకు అందజేస్తున్నారు. ఈ రీతిలో ఒక్కో ఉద్యోగి సుమారు రోజుకు రూ.6 వేల నుంచి రూ.10వేల సంపాదిస్తున్నారని ఆశాఖ ఉద్యోగులే తెలియజేయడం విశేషం. పెరిగిన అవినీతి పెద్దనోట్లు రద్దుతో రవాణాశాఖ కార్యాలయంలో అవినీతికి భారీగా పెరిగిపోయింది. ప్రభుత్వ చలనాల కోసం స్వైపింగ్ మిషన్ ఏర్పాటు చేసినా లంచం ఇవ్వకపోతే పని చేయడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ చలనాలు చెల్లించేందుకు అధికారులు నగదునే డిమాండ్ చేస్తున్నారు. స్వైపింగ్ మిషన్ విషయంపై ఎవరైనా ప్రశిస్తే పని చేయకుండా పలుమార్లు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఽఒక పక్క పెద్దనోట్లు రద్దుతో బ్యాంకుల నుంచి డబ్బులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రవాణాశాఖ ఉద్యోగులుకు మాత్రం అవేమీ పట్టడం లేదు. తాము ఆడిగినంత ఇచ్చుకుని పత్రాలు తీసుకెళ్లాలని, లేకుంటే ఎంతకాలమైన మీ పత్రాలు కార్యాలయంలోనే ఉంటాయని చెబుతున్నారు. రవాణాశాఖ కార్యాలయంలో లంచం డిమాండ్‌తో పనుల మీద కార్యాలయానికి వెళ్లాలంటే వాహనదారులు హడలిపోతున్నారు. రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు చేత విచారణ చేయించి అధిక దోపిడీని అరికట్టాలని వాహనదారులు, వాహన చోదకులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం -ఎన్.శివరాంప్రసాద్, రవాణాశాఖ ఉప కమిషనర్ ప్రభుత్వ చలానా కంటే అధికంగా వసూలు చేయకూడదు. ఆ విధంగా వసూలు చేసిన విషంయపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. -
1 నుంచి నగదు రహిత సేవలు
రవాణా కార్యాలయంలో కలెక్టర్ స్వైప్ మిషన్ ప్రారంభం నెల్లూరు (టౌన్) : జిల్లాలోని అన్ని శాఖలల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి నగదు రహిత సేవలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. స్థానిక రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం స్వైప్ మిషన్‌ను ప్రారంభించారు. స్వైప్ మిషన్ ద్వారా నగరానికి చెందిన గీత కార్మికుడు రిజిస్ట్రేషన్‌కు తొలి చలానా చెల్లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇçప్పటి వరకు 82 స్వైప్ మిషన్లు పంపినట్లు తెలిపారు. జిల్లాలో 1891చౌక దుకాణాదారులతో కరెంట్ అకౌంట్లు తెరిపించి, నగదు రహిత లావాదేవీలు నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 2.44లక్షల మంది పింఛన్ దారులకు 78.5శాతం బ్యాంకు ఖాతాలు ఉన్నందున వారికి నేరుగా ఖాతాలోనే పింఛన్ జమ చేయడం జరుగుతుందన్నారు. మంగళవారం జిల్లాకు రూ.83కోట్లు వచ్చాయని, వాటిని అన్ని బ్యాంకులకు సర్ధుబాటు చేసినట్లు చెప్పారు. వాటిలో 78కోట్లుకు రూ.2వేల నోట్లు వచ్చాయని, మిగిలిన రూ.5కోట్లుకు చిన్న నోట్లు వచ్చాయన్నారు. జిల్లాలో 443 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 190 ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేలు నోట్లుకు అనువుగా ఉన్నాయని తెలిపారు. అంగవైకల్యం గల వారికి బ్యాంకు చెక్కుల ద్వార నగదు చెల్లించడం జరుగుతుందన్నారు. డీటీసీ శివరాంప్రసాద్ మాట్లాడుతూ 13జిల్లాలకు సంబంధించి 43 స్వైప్ మిషన్లు వచ్చాయన్నారు. వాటిలో 3మిషన్లును నెల్లూరు జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన రవాణా కార్యాలయాలకు కూడా త్వరలో మిషన్లు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి ఓఎస్డీ చలపతి, గూడూరు ఆర్టీఓ చందర్, ఎంవీఐలు బాలమురళీకృష్ణ, ఆదినారాయణ, రామకృష్ణారెడ్డి, ఏంవీఐలు రాఘవరావు, ప్రభాకరరావు, రవి, ఏఓలు విజయకుమార్, కిషోర్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
రవాణాలో నకి‘లీలలు’
దొంగ ఇన్సురెన్స్ పత్రాలు సృష్టిస్తున్న వైనం బీమా ఏజెంట్ల చేతివాటం సహకరిస్తున్న కొందరు రవాణాశాఖ ఉద్యోగులు రవాణాశాఖలో నకిలీల దందా జోరుగా సాగుతోంది. కొంతమంది బీమా ఏజెంట్లు, ఆర్టీఓ ఏజెంట్లు ఉద్యోగులతో చేతులు కలిపి దీనిని నడిపిస్తున్నారు. ఇన్సురెన్స్‌ల దగ్గర నుంచి విద్యార్హత సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ, మెడికల్, ఆర్టీఓ సంతకం ఫోర్జరీ వరకు నకిలీలతోనే నడుస్తోంది. నెల్లూరు(టౌన్) : బీమా ఏజెంట్లు నగరంలోని ఆటో, ఎల్‌జీవీ వాహానాల స్డాండ్ల దగ్గరకు వెళ్లి తక్కువ మొత్తంతో ఇన్సురెన్స్ కట్టిస్తామని చెప్పి ఓనర్లను మోసం చేస్తున్నారు. కొన్ని బీమా కంపెనీలకు చెందిన పత్రాలను ముద్రించి ఇన్సురెన్స్‌ల పేరుతో దండుకుంటున్నారు. వాహనాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు తీసుకుంటూ నకిలీ ఇన్సురెన్స్ పత్రాన్ని చేతిలో పెడుతున్నారు. గురువారం రవాణా అధికారులకు పట్టుబడిన వాహనం అదే కోవకు చెందినదే. పరిశీలన కరువు.. రవాణా కార్యాలయంలో సేవల కోసం సంబంధిత వ్యక్తులు తీసుక చ్చే దరఖాస్తులను పరిశీలించే పరిస్థితి లేదు. సాధారణంగా దరఖాస్తుతో జతచేసిన సర్టిఫికెట్లు ఒరిజనల్ లేదా నకిలీవా అని పరిశీలించాలి. ఒరిజనల్ ఇన్సురెన్స్‌లు లేకుండానే జెరాక్స్‌లతో ఉన్న వాటిపై సంతాకాలు చేస్తున్నారు. ముందుగా కుదర్చుకున్న ఒప్పందం మేరకు ఈ విధంగా చేస్తున్నరనే విమర్శలున్నాయి. సేవల కోసం నేరుగా వెళితే ఆ వ్యక్తికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్ని ఒరిజనల్స్ ఉండాలని దబాయిస్తారు. అదే ఏజెంట్లు, అసిస్టెంట్లు ద్వార వెళ్తే జెరాక్స్‌ల తోనే పనికానిచేస్తున్నారు. అసిస్టెంట్లే కీలకం.. రవాణాశాఖలో ఉద్యోగుల కంటే అసిస్టెంట్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు కేవలం చలనా కొట్టేందుకు పరిమితమైతే మిగిలిన పనులు వారివారి వ్యక్తిగత అసిస్టెంట్లు పూర్తి చేస్తున్నారు. వీరి ద్వారానే నకిలీల పత్రాలు వ్యవహారం నడుస్తోంది. ఇలా బయటపడింది.. నగరంలోని జనార్దన్‌రెడ్డి కాలనీకి చెందిన షేక్ మస్తాన్‌బాష ఏపీ26 టీబీ 3173 నంబర్ గల తన వాహనానికి ఇన్సురెన్స్ కోసం శ్రీరామ్ జనరల్ ఇన్సురెన్స్‌కు చెందిన ఏజెంట్‌ను సంప్రదించాడు. అతను రూ.5 వేలు తీసుకుని రూ.17,896 ప్రీమియం చెల్లించినట్లు సర్టిపికెట్‌ను ఇచ్చాడు. దీంతో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు గురువారం రవాణా కార్యాలయానికి మస్తాన్‌బాష వాహనాన్ని తీసుకువచ్చాడు. సంబంధిత పత్రాలను పూరించి రూ.420 చలానా చెల్లించి ఎఫ్‌సీ ట్రాక్ దగ్గరకు వాహనాన్ని తీసుకెళ్లాడు. ఇంతలో గుమస్తాకు అనుమానం రావడంతో ఎంవీఐకి ఫోన్ చేసి ఇన్సురెన్స్ పత్రాలను పరిశీలించాలని కోరాడు. ఎంవీఐ బాషాను నిలదీయగా నకిలీ ఇన్సురెన్స్ అని ఒప్పుకొన్నాడు. దీంతో వాహనాన్ని సీజ్ చేశారు. ఫిర్యాదు చేస్తాం : ఆదినారాయణ, ఇన్చార్జి ఆర్టీఓ వాహనానికి సంబంధించిన నకిలీ ఇన్సురెన్స్‌ను గుర్తించాం. పోలీస్స్లేషనులో ఫిర్యాదు చేస్తాం. వాహన యజమానిపై కేసు పెట్టేందుకు డీటీసీతో మాట్లాడుతాం.