రవాణాలో నకి‘లీలలు’
-
దొంగ ఇన్సురెన్స్ పత్రాలు సృష్టిస్తున్న వైనం
-
బీమా ఏజెంట్ల చేతివాటం
-
సహకరిస్తున్న కొందరు రవాణాశాఖ ఉద్యోగులు
రవాణాశాఖలో నకిలీల దందా జోరుగా సాగుతోంది. కొంతమంది బీమా ఏజెంట్లు, ఆర్టీఓ ఏజెంట్లు ఉద్యోగులతో చేతులు కలిపి దీనిని నడిపిస్తున్నారు. ఇన్సురెన్స్‌ల దగ్గర నుంచి విద్యార్హత సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ, మెడికల్, ఆర్టీఓ సంతకం ఫోర్జరీ వరకు నకిలీలతోనే నడుస్తోంది.
నెల్లూరు(టౌన్) : బీమా ఏజెంట్లు నగరంలోని ఆటో, ఎల్‌జీవీ వాహానాల స్డాండ్‌ల దగ్గరకు వెళ్లి తక్కువ మొత్తంతో ఇన్సురెన్స్ కట్టిస్తామని చెప్పి ఓనర్లను మోసం చేస్తున్నారు. కొన్ని బీమా కంపెనీలకు చెందిన పత్రాలను ముద్రించి ఇన్సురెన్స్‌ల పేరుతో దండుకుంటున్నారు. వాహనాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు తీసుకుంటూ నకిలీ ఇన్సురెన్స్ పత్రాన్ని చేతిలో పెడుతున్నారు. గురువారం రవాణా అధికారులకు పట్టుబడిన వాహనం అదే కోవకు చెందినదే.
పరిశీలన కరువు..
రవాణా కార్యాలయంలో సేవల కోసం సంబంధిత వ్యక్తులు తీసుక చ్చే దరఖాస్తులను పరిశీలించే పరిస్థితి లేదు. సాధారణంగా దరఖాస్తుతో జతచేసిన సర్టిఫికెట్లు ఒరిజనల్ లేదా నకిలీవా అని పరిశీలించాలి. ఒరిజనల్ ఇన్సురెన్స్‌లు లేకుండానే జెరాక్స్‌లతో ఉన్న వాటిపై సంతాకాలు చేస్తున్నారు. ముందుగా కుదర్చుకున్న ఒప్పందం మేరకు ఈ విధంగా చేస్తున్నరనే విమర్శలున్నాయి. సేవల కోసం నేరుగా వెళితే ఆ వ్యక్తికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్ని ఒరిజనల్స్ ఉండాలని దబాయిస్తారు. అదే ఏజెంట్లు, అసిస్టెంట్లు ద్వార వెళ్తే జెరాక్స్‌ల తోనే పనికానిచేస్తున్నారు.
అసిస్టెంట్‌లే కీలకం..
రవాణాశాఖలో ఉద్యోగుల కంటే అసిస్టెంట్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు కేవలం చలనా కొట్టేందుకు పరిమితమైతే మిగిలిన పనులు వారివారి వ్యక్తిగత అసిస్టెంట్లు పూర్తి చేస్తున్నారు. వీరి ద్వారానే నకిలీల పత్రాలు వ్యవహారం నడుస్తోంది.
ఇలా బయటపడింది..
నగరంలోని జనార్దన్‌రెడ్డి కాలనీకి చెందిన షేక్ మస్తాన్‌బాష ఏపీ26 టీబీ 3173 నంబర్ గల తన వాహనానికి ఇన్సురెన్స్ కోసం శ్రీరామ్ జనరల్ ఇన్సురెన్స్‌కు చెందిన ఏజెంట్‌ను సంప్రదించాడు. అతను రూ.5 వేలు తీసుకుని రూ.17,896 ప్రీమియం చెల్లించినట్లు సర్టిపికెట్‌ను ఇచ్చాడు. దీంతో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందేందుకు గురువారం రవాణా కార్యాలయానికి మస్తాన్‌బాష వాహనాన్ని తీసుకువచ్చాడు. సంబంధిత పత్రాలను పూరించి రూ.420 చలానా చెల్లించి ఎఫ్‌సీ ట్రాక్ దగ్గరకు వాహనాన్ని తీసుకెళ్లాడు. ఇంతలో గుమస్తాకు అనుమానం రావడంతో ఎంవీఐకి ఫోన్ చేసి ఇన్సురెన్స్ పత్రాలను పరిశీలించాలని కోరాడు. ఎంవీఐ బాషాను నిలదీయగా నకిలీ ఇన్సురెన్స్ అని ఒప్పుకొన్నాడు. దీంతో వాహనాన్ని సీజ్ చేశారు.
ఫిర్యాదు చేస్తాం : ఆదినారాయణ, ఇన్‌చార్జి ఆర్టీఓ
వాహనానికి సంబంధించిన నకిలీ ఇన్సురెన్స్‌ను గుర్తించాం. పోలీస్‌స్లేషనులో ఫిర్యాదు చేస్తాం. వాహన యజమానిపై కేసు పెట్టేందుకు డీటీసీతో మాట్లాడుతాం.