1 నుంచి నగదు రహిత సేవలు
-
రవాణా కార్యాలయంలో కలెక్టర్ స్వైప్ మిషన్ ప్రారంభం
నెల్లూరు (టౌన్) : జిల్లాలోని అన్ని శాఖలల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి నగదు రహిత సేవలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. స్థానిక రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం స్వైప్ మిషన్‌ను ప్రారంభించారు. స్వైప్ మిషన్ ద్వారా నగరానికి చెందిన గీత కార్మికుడు రిజిస్ట్రేషన్‌కు తొలి చలానా చెల్లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇçప్పటి వరకు 82 స్వైప్ మిషన్లు పంపినట్లు తెలిపారు. జిల్లాలో 1891చౌక దుకాణాదారులతో కరెంట్ అకౌంట్లు తెరిపించి, నగదు రహిత లావాదేవీలు నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 2.44లక్షల మంది పింఛన్ దారులకు 78.5శాతం బ్యాంకు ఖాతాలు ఉన్నందున వారికి నేరుగా ఖాతాలోనే పింఛన్ జమ చేయడం జరుగుతుందన్నారు. మంగళవారం జిల్లాకు రూ.83కోట్లు వచ్చాయని, వాటిని అన్ని బ్యాంకులకు సర్ధుబాటు చేసినట్లు చెప్పారు. వాటిలో 78కోట్లుకు రూ.2వేల నోట్లు వచ్చాయని, మిగిలిన రూ.5కోట్లుకు చిన్న నోట్లు వచ్చాయన్నారు. జిల్లాలో 443 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 190 ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేలు నోట్లుకు అనువుగా ఉన్నాయని తెలిపారు. అంగవైకల్యం గల వారికి బ్యాంకు చెక్కుల ద్వార నగదు చెల్లించడం జరుగుతుందన్నారు. డీటీసీ శివరాంప్రసాద్ మాట్లాడుతూ 13జిల్లాలకు సంబంధించి 43 స్వైప్ మిషన్లు వచ్చాయన్నారు. వాటిలో 3మిషన్లును నెల్లూరు జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన రవాణా కార్యాలయాలకు కూడా త్వరలో మిషన్లు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి ఓఎస్‌డీ చలపతి, గూడూరు ఆర్టీఓ చందర్, ఎంవీఐలు బాలమురళీకృష్ణ, ఆదినారాయణ, రామకృష్ణారెడ్డి, ఏంవీఐలు రాఘవరావు, ప్రభాకరరావు, రవి, ఏఓలు విజయకుమార్, కిషోర్, సాయి తదితరులు పాల్గొన్నారు.