RTC bus drivers
-
భారీ వర్షాలు.. బస్ డ్రైవర్లు, కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ సూచనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని సూచించారు. రాష్ట్రంలో వారం రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా డ్రైవర్లందరూ భద్రత సూచనలు పాటించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలించిందన్నారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకుందని గుర్తుచేశారు. ఆర్టీసీ సంస్థలో సుశిక్షుతులైన డ్రైవర్లు ఉన్నారని, అయినా వర్షాకాలంలో మరోసారి భద్రతా నియమాలను మననం చేసుకుని తూ.చ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరం ఉందన్నారు. జాగ్రత్త సూచనలు 1. వర్షం కురుస్తున్నప్పుడు వేగ నియంత్రణ పాటించాలి 2. మలుపుల వద్ద ఇండికేటర్‌ను ఉపయోగించాలి. 3. ముందు వెళ్ళే వాహనాలతో సురక్షిత దూరాన్ని పాటించాలి. దట్టమైన వర్షం ఉన్నచోట హారన్ ఉపయోగించాలి. 4. వర్షం కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయనపుడు వైపర్ వాడాలి. హెడ్‌లైన్‌ను lowbeamలోఫాగ్ lights తప్పనిసరిగా వాడాలి. వైపర్లను కండిషన్లో ఉంచుకోగలరు. బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లాలి. 5. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. నదులు కల్వర్టులు ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దు. 6. Windscreen గ్లాసులను వైపర్‌తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్‌తో శుభ్రపరచాలి. 7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ళతో ముఖంకాళ్ళు చేతులు శుభ్రపరుచుకోవాలి. 8. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించాలి. డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలి. 9. దట్టమైన వర్షం ఉన్న సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు. 10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. వర్షం పడుతున్నప్పుడు తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి. 11. వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో Wrong Route లో వెళ్లరాదు. 12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు. 13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు. 14. అతివేగంగా బస్సును నడపరాదు. 15. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్ గా ఇండికేటర్ వేయకూడదు. 16. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు అతి వేగం తో డ్రైవింగ్ చేయరాదు. 17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి. 18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడవకూడదు. 19. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. నగరంలో మ్యాన్ హోల్స్ మరియు రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సహాయంతో వాహనాన్ని నడపగలరు. 20. బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ఫుట్ బోర్డు లో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి. 21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కడం జరుగుతుంది. దీని ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారి గమ్య స్థానం లోనే కండక్టర్, డ్రైవర్ గారు ఆపగలరు, బస్సులోకి చేర్చుకోగలరు. 22. ఫోన్ మాట్లాడుతూ, ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు. 23. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు. 24. తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదు. ఎంతో పేరున్న ఆర్టీసీ సంస్థ.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రైవర్లు, కండక్టర్లు సురక్షితంగా బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలు జారీ చేశారు.. -
కండక్టర్లు మర్యాదగా మెలగాలి: సజ్జనార్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులతో బస్సు కండక్టర్లు మర్యాదగా మెలగాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. బస్‌భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ చాలెంజ్ ఫర్ట్రైనింగ్ పేరుతో కండక్టర్లకు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కండక్టర్లతో ఆయన మాట్లాడారు. ప్రయాణికులను బస్సుల్లోకి సాదరంగా ఆహ్వానించాలని, గౌరవంగా సంబోధించాలని సూచించారు. ఆక్యుపెన్సీ రేషియోను 75 శాతానికి చేర్చాలనే సంస్థ లక్ష్యానికి కండక్టర్లు సహకారం అందించాలన్నారు. హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జీపీలు సాక్షి, హైదరాబాద్: హైకోర్టుకు కొత్తగా జీపీ లు, ఏజీపీల నియామకం చేపడుతూ అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సల్వాజి రాజశేఖర్‌రావు, కె.సుధాకర్‌రెడ్డి, ఆర్.మన్మద్‌రెడ్డి, కొండపర్తి శ్రీనివాస్, ఎల్.సు«దీర్, కె.ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించారు. మరో 31 మందిని అసిస్టెంట్ జీపీలుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
దారితప్పిన ప్రగతి రథం
సాక్షి, హైదరాబాద్: ఎర్ర బస్సు అనగానే ఓ అనుబంధం.. ఓ ఆత్మీయత.. అది మన ఇంటి వాహనమన్నంత ప్రేమ.. ఊరికి బస్సు వచ్చిందంటే అదో ఆనందం.. నైట్ హాల్ట్ చేస్తే, ఆ రాత్రికి డ్రైవర్, కం డక్టర్ ఆ ఊరికి అతిథులే.. ఆర్టీసీ బస్సంటే అంత అభిమానం మరి. అందులో ప్రయాణిస్తే హాయిగా గుండె మీద చేయి వేసుకుని నిద్రపోయేంత నమ్మకం. ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని బస్సుపై ఉన్న నినాదం నిజమేన్న విశ్వాసం. మరి.. వాస్తవంగా పరిస్థితి అలాగే ఉందా..? ఆర్టీసీ బస్సు ప్రయా ణం సురక్షితమేనా? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. గత ఐదేళ్లలో ఆర్టీసీ ప్రస్థానం చూశాక, ఆ బస్సెక్కాలంటే కొంచెం ఆందోళన చెం దాల్సిన దుస్థితి. కాలక్రమంలో బస్సు నుంచి ఎర్ర రంగు పోయినా.. వరుస ప్రమాదాలతో మన బస్సు మళ్లీ ‘ఎర్ర’బడుతోంది. మసకబారుతున్న ప్రతిష్ట... దేశంలోనే అతి తక్కువ ప్రమాదాలు నమోదయ్యే రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీకి పేరుంది. కానీ నెమ్మదిగా ఆ ప్రతిష్ట మసకబారుతోంది. గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల తీరు చూస్తే ఆందోళన కలుగుతోంది. 2013–14 నుంచి గతేడాది డిసెంబర్ వరకు ఏకంగా 5వేల రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సు భాగస్వామ్యమైంది. ఈ ప్రమాదాల్లో 2,304 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం.. నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున రాష్ట్ర సరిహద్దు దాటాక బోల్తాపడింది. అందులోని ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలయ్యారు. గతంలో ఈ సర్వీసు గుంటూరు వరకు ఉండగా, అక్కడికి మరో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు వరకు పొడిగించారు. కానీ డ్రైవర్ విశ్రాంతి సమయం మాత్రం పెరగలేదు. సాధారణంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి గమ్యం చేరిన తర్వాత డ్రైవర్‌కు కనీసం 8 గంటల విశ్రాంతి ఉండాలి. కానీ అది 6 గంటలకే పరిమితమవుతోంది. ట్రాఫిక్ జాంలు, రోడ్లు బాగాలేకపోవటం వంటి కారణాలతో అందులో రెండు గంటల సమయం హరించుకుపోతోంది. దీంతో డ్రైవర్‌కు నికరంగా మిగిలే సమయం నాలుగు గంటలు మాత్రమే. తిరుగు ప్రయాణానికి గంట ముందు సన్నద్ధం కావాల్సి ఉంటున్నందున అది మరీ తగ్గుతోంది. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు రెండు మూడు గంటలే పడుకుంటున్నారు. గతంలో దూరప్రాంతాలకు వెళ్లొచ్చాక మధ్యలో ఒకరోజు పూర్తి విశ్రాంతి ఉండేది. ఇప్పుడు డ్రైవర్ల కొరత వల్ల అది ఉండటంలేదు. ఒంగోలు వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడానికి కారణం.. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడమేనని కార్మికులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యం ఉన్నా డ్యూటీకి... రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓ డిపోకు చెందిన డ్రైవర్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. ప్రయాణం మధ్యలో కళ్లు తిరుగుతుండటంతో బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ఓ గంట తర్వాత తేరుకుని బస్సు తీసుకుని డిపోకు వచ్చి, అనారోగ్యంగా ఉన్నందున ఒక్కరోజు సెలవు కావాలని అడిగారు. అయితే, డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉందని డిపో అసిస్టెంట్ మేనేజర్ ఒత్తిడి చేయటంతో డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తోటి కార్మికుల ఆందోళనతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు అనుమతించారు. అలాగే వారం రోజుల క్రితం పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ డ్రైవర్ వీక్లీఆఫ్ రోజున ఇంటిపట్టునే ఉండి మద్యం తాగారు. కానీ, ఇద్దరు డ్రైవర్లు అనుకోకుండా సెలవు పెట్టడంతో వెంటనే డ్యూటీకి రావాల్సిందిగా డిపో నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. తాను బస్సు నడిపే స్థితిలో లేనన్నా సిబ్బంది వినిపించుకోలేదు. డిపోకు వచ్చిన తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశాక, అతిగా మద్యం సేవించినట్టు తేలడంతో తప్పనిసరి పరిస్థితిలో తిరిగి పంపించారు. కానీ ఆ లెవల్స్ తక్కువగా ఉంటే డ్యూటీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కార్మికులు చెబుతున్నారు. ఒత్తిడితో చిత్తు.. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్రమైన డ్రైవర్ల కొరత ఎదుర్కొంటోంది. ఆరేళ్లుగా నియామకాలు లేకపోవటంతో ప్రస్తుతం 1,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పదవీ విరమణ చేస్తుండటం, మృత్యువాత పడుతుండటంతో డ్రైవర్ల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం సంస్థ అవసరాల మేరకు 20,300 డ్రైవర్లు కావాల్సి ఉండగా.. 18,500 మంది మాత్రమే ఉన్నారు. డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో నిత్యం కొన్ని సర్వీసులు డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. అసలే ప్రయాణికుల సంఖ్యకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో కొన్ని సర్వీసులు నిలిపివేయాల్సి రావడం సమస్యను మరింత పెంచుతోంది. దీంతో ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేసి పనిచేయించాల్సి వస్తోంది. దీంతో డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. అసలే డ్రైవింగ్ సవాల్‌తో కూడుకున్న పని కావడం.. దానికి ఒత్తిడి తోడు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ డ్రైవర్లు మంచి నైపుణ్యం ఉన్నవారే కావడంతో జాగ్రత్తగానే డ్రైవింగ్ చేస్తున్నారు. కానీ, ఎదురుగా వచ్చే వాహనదారుల తప్పిదం, చాలా ప్రాంతాల్లో రోడ్లు ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శిక్షణ లేని అద్దె బస్సు డ్రైవర్లు... సొంత బస్సుల నిర్వహణ భారం నుంచి తప్పించుకునేందుకు కొంతకాలంగా ఆర్టీసీ అద్దె బస్సులను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,800 అద్దె బస్సులున్నాయి. వీటి యజమానులే డ్రైవర్లను నియమిస్తారు. వారు ఆర్టీసీ సొంత డ్రైవర్ల తరహాలో శిక్షణ తీసుకున్నవారు కాదు. ఇది కూడా ప్రమాదాలు పెరిగేందుకు కారణమవుతోంది. గతంలో గోదావరిఖని సమీపంలోని బసంత్‌నగర్ వద్ద లోయలో బస్సు పడి ఏడుగురు ప్రాణాలను హరించింది అద్దె బస్సే. ఆ ప్రమాదంలో దాని డ్రైవర్ కూడా చనిపోయాడు. బస్సు రోడ్డెక్కితే చాలు అనుకుంటున్న ఆర్టీసీ.. అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇప్పించాలన్న విషయాన్ని విస్మరిస్తోంది. ఆటోలు నడిపినవారు కూడా అద్దె బస్సు స్టీరింగ్ పట్టుకుని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ జీతంతో అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమిస్తున్నారు. దీనిని సంస్థ పట్టించుకోవడంలేదు. అక్కడలా.. ఇక్కడిలా.. 2013 అక్టోబర్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ఓ ప్రైవేటు వోల్వో బస్సు ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతి కావటంతో 45 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మన రోడ్లకు వోల్వో బస్సు డిజైన్ అనుకూలం కాదన్న వాదన రావడంతో ఆ కంపెనీ దిగొచ్చింది. ఉన్నతస్థాయి బృందాన్ని పంపి బస్సును పరిశీలించి, కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదకరంగా ఉండటంతో జాతీయ రహదారుల విభాగం అధికారులు సర్వే చేసి దానిని సరిచేశారు. అలాంటి లోపాలు మిగతా చోట్ల ఎక్కడున్నాయో పరిశీలించి కొన్ని మరమ్మతులు చేశారు. 2015 జూన్: గజ్వేల్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొనడంతో 17 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. కాపలా లేని లెవల్ క్రాసింగ్స్‌ను యుద్ధప్రాతిపదికన తొలగిస్తామని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ మేరకు రైల్వేశాఖ తగిన చర్యలు కూడా తీసుకుంది. 2018 సెప్టెంబర్ 11: కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్డుపై నుంచి కిందకు దిగుతున్న ఆర్టీసీ బస్సు.. పక్కనే ఉన్న గుంతలో పడిపోయి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏకంగా 67 మంది దుర్మరణం పాలయ్యారు. కానీ తర్వాత ఏం జరిగింది? ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమే అని తేల్చేసి ఆర్టీసీ చేతులు దులుపుకొంది. నిజానికి ఆ బస్సు నడిపింది గతంలో ఉత్తమ డ్రైవర్ పురస్కారం అందుకున్న వ్యక్తే. కానీ, బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ బస్సులో వంద మంది కంటే ఎక్కువ మంది ఎక్కిన విషయాన్నీ విస్మరించారు. డీజిల్ పొదుపు పేరుతో దూరం నుంచి వెళ్లాల్సిన బస్సును ఘాట్ రోడ్డు మీదుగా మళ్లించాలని ఆదేశించిన తీరునూ తొక్కిపెట్టారు. అన్నింటికీ మించి ఆ బస్సు అప్పటికే 13 లక్షల కిలోమీటర్లు తిరిగి పనికిరాకుండా పోయిన డొక్కు బస్సనే సంగతీ పట్టించుకోలేదు. ఇంత భారీ ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీసీలో ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు చేటు చేసుకోకుండా కొత్తగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుతం నడుస్తున్న డొక్కు బస్సులను పక్కన కూడా పెట్టలేదు. ఆర్టీసీలో అంతా గందరగోళం... ఆర్టీసీలో అంతా గందరగోళం రాజ్యమేలుతోంది. గత ఐదేళ్లుగా సంస్థకు పూర్తిస్థాయి ఎండీ లేరు. సాధారణంగా ఆర్టీసీకి ఐపీఎస్ అధికారి ఎండీగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యాక.. ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణరావు ఎండీ అయ్యారు. ఆయన మాటను తోటి ఈడీలు పట్టించుకోలేదు. చైర్మన్‌గా ఉన్న సోమారపు సత్యనారాయణను ఆయన లెక్క చేయలేదు. ఫలితంగా ఆర్టీసీ పతనావస్థకు చేరింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఎండీ లేరు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈడీల మధ్య సఖ్యత లేక అంతర్గత కీచులాటలు పెరిగాయి. ఓ అధికారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి స్థితిలో బస్సు ప్రమాదాల నివారణపై దృష్టి సారించే పరిస్థితే లేకుండా పోయింది. అప్పు తెచ్చి పరిహారం చెల్లింపు ప్రస్తుతం ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రతినెలా జీతాలు చెల్లించేందుకే దిక్కులు చూడాల్సి వస్తోంది. ఈ తరుణంలో జరుగుతున్న ప్రమాదాలు సంస్థను మరింత గుల్ల చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 2018లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.46 కోట్లు, అంతకుముందు సంవత్సరం రూ.45 కోట్లు చెల్లించారు. ఇలా గత ఆరేళ్లలో ఏకంగా రూ.200 కోట్లు చెల్లించింది. ఆర్టీసీ పురోగతి చర్యలకు నిధులు ఉండటంలేదు. దీంతో ప్రతి పనికీ అప్పు తేవాల్సిన దుస్థితి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం గ్రాంటు రూపంలో డబ్బులు ఇవ్వకున్నా, రుణం తీసుకునేందుకు మాత్రం అనుమతి ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పూచీకత్తుపై ఆర్టీసీ అప్పు తెచ్చుకుంటోంది. ఆ అప్పు నుంచే పరిహారం కూడా చెల్లిస్తోంది. బస్సుల సంఖ్య పెంచాలి తెలంగాణలో వెంటనే ఆర్టీసీ బస్సుల సంఖ్య, అందుకు అనుగుణంగా డ్రైవర్ల సంఖ్య పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు పరస్పరం ఢీకొని ఎక్కువ మంది చనిపోతున్నారు. బస్సులు సరిపోకపోవడంతో జనం ఆటోల్లో పది, పదిహేను మంది వరకు ఎక్కుతున్నారు. అనువుగా లేని రోడ్లలో ఇవి ఢీకొంటున్నాయి. ఈ సమస్య పోవాలంటే వెంటనే ఆర్టీసీ కనీసం 2వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిందే. రోడ్లను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. – సుదర్శనం పాదం, మాజీ డైరక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రోడ్ ట్రాన్స్‌పోర్టు ఇప్పటికైనా సంస్థ కళ్లు తెరవాలి తెలంగాణ ఆర్టీసీ బస్సులు సురక్షితమన్న పేరు కొనసాగేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలి. డొక్కు బస్సులు తొలగించటంతోపాటు డ్రైవర్లపై పనిభారాన్ని కూడా తగ్గించాలి. పని ఒత్తిడితో డ్రైవర్లు డ్యూటీలోనే గుండెపోటుతో చనిపోవడం, ప్రమాదాలకు గురికావడం ఇటీవల పెరిగింది. బస్సులో పెద్ద సంఖ్యలో ఉండే ప్రయాణికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని వెంటనే సంస్థ కళ్లు తెరవాలి. డ్రైవరకు విరామం కల్పించటంతోపాటు వారికి వైద్య వసతి పెంచాలి. తరచూ మెడికల్ టెస్టులు నిర్వహించాలి. – నాగేశ్వరరావు, ఎన్ఎంయూ ప్రతి డ్రైవర్ అప్రమత్తంగా ఉండాల్సిందే చాలాచోట్ల రోడ్లు సరిగా లేవు. ట్రాఫిక్ ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రతి ఆర్టీసీ డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు తప్పవు. బస్సులో తాను కాకుండా కనీసం మరో 50 మంది ప్రయాణికులు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుని డ్రైవింగ్ చేయాలి. ఆరోగ్యం సరిగా లేకుంటే డ్రైవింగ్‌కు వెళ్లకపోవడం చాలా ఉత్తమం. ఏవైనా అనుమానాలుంటే శిక్షణకు హాజరు కావాలి. – కంది సురేందర్ రెడ్డి, ఉత్తమ డ్రైవర్ పురస్కార గ్రహీత -
పదే పదే..! అదే అదే..!
పదే పదే అదే తప్పు.. మళ్లీ మళ్లీ అదే ముప్పు.. ఆర్టీసీ బస్సులు అదుపు తప్పుతున్నాయి.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.. బస్సుల్లో వెళుతున్న జనాలను బెంబేలెత్తిస్తున్నాయి.. నేలకొండపల్లి: స్థలం: నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం స్టేజీ. సమయం: మంగళవారం సాయంత్రం 4.00 గంటలు. సందర్భం: రెండు బస్సులకు త్రుటిలో పెద్ద ముప్పు తప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ఖమ్మం వైపు వచ్చిన బస్సు, నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం స్టేజీ వద్ద ఆగింది. ప్రయాణికులు దిగుతున్నారు. దాని వెనుకనే, మణుగూరు వెళ్లాల్సిన బస్సు వేగంగా వచ్చింది. ముందు ఆగిన బస్సును అదే వేగంతో ఓవర్టేక్ చేయబోయింది. సరిగ్గా అదే సమయంలో.. ఎదురుగా ఖమ్మం నుంచి నేలకొండపల్లికి గ్రానైట్ రాళ్ల లారీ ట్రాలీ వస్తోంది. ఎదురుగా దూసుకొస్తున్న బస్సును లారీ డ్రైవర్ గమనించాడు. వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. లారీ అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న బడ్డీ కొట్టును ఢీకొంది. సడన్ బ్రేక్ వేయకపోతే... స్టేజీలో, రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో వణికిపోయారు. ఆ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయకపోయినట్టయితే ఏం జరిగేది..? అక్కడున్న అందరిలోనూ ఇదే ప్రశ్న. లారీ, బస్సు ఢీకొనేవి. పక్కనే ఉన్న మరో బస్సును ఢీకొని ఉండేవి. ఆగిన బస్సు అదుపుతప్పి బోల్తా పడిపోయి ఉండేది. రెండు బస్సుల్లో కలిపి 80మంది ప్రయాణికులు ఉన్నారు. స్టేజీ వద్ద మరికొందరు ఉన్నారు. ‘లారీకి బ్రేక్ వేయకపోతే.. ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో.. ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవో...’ అందరిలోనూ ఇదే భయాందోళన. ఆ బడ్డీ కొట్టు వద్ద నిత్యం కనీసంగా ఐదు నుంచి పదిమంది వరకు ఉంటారు. ఆ బడ్డీని లారీ ఢీకొన్న సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఒకవేళ ఉండి ఉంటే... ఈ నెల 11న... ♦ ఖమ్మం నగర శివారులోగల నాయుడుపేట జంక్షన్ వద్ద, బైక్‌ను హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో వేల్పుల జోషికరుణ్కుమార్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి సాయినితినాధ్ కూడా మరుసటి రోజున ఆస్పత్రిలో మృతిచెందాడు. ♦ జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం–మాచినేనిపేట తండా మధ్య ప్రధాన రహదారిపై బైక్‌ను, ఖమ్మం నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ భద్రాచలం డిపో ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొంది. బైక్ చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. -
డ్రైవర్‌కే కండక్టర్ పని కుదరదు
టిమ్స్‌పై తీర్పు సవరణకు హైకోర్టు నో సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్లు టికెట్ల జారీ యంత్రాల(టిమ్స్)ను వినియోగిస్తూ కండక్టర్ల విధులను కూడా నిర్వర్తించడానికి వీల్లేదంటూ తామిచ్చిన తీర్పును సవరించేందుకు ఉమ్మడి హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. డ్రైవర్లు ఇలా కండక్టర్ విధులను కూడా నిర్వర్తిం చడం మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని మరోసారి గుర్తు చేసింది. ఆర్థిక భారం పేరుతో నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని హితవు పలికింది. కావాలంటే డ్రైవర్లకు టిమ్స్ అప్పగించి కండక్టర్ విధులను నిర్వర్తింప చేసేందుకు వీలుగా చట్టంలో నిర్దిష్ట నిబంధనలు రూపొందించుకోవచ్చునని మరోసారి స్పష్టం చేసింది. డ్రైవర్లతో కండక్టర్ విధులను నిర్వర్తించరాదంటూ గత ఏడాది డిసెంబర్ 1న ఇచ్చిన తీర్పును సవరించాలన్న ఆర్టీసీ యాజమాన్యం అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో సవరణ నిమిత్తం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని యాజమాన్యం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ కోరటంతో కోర్టు ఆమోదించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టాలు చేసేవారే ఉల్లంఘిస్తారా? టిమ్స్ బాధ్యతలు అప్పగించి కండక్టర్ విధులను కూడా నిర్వర్తించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ కొందరు డ్రైవర్లు 2011లో హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. బస్సులను నడిపేటప్పుడు డ్రైవర్లు ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని, అందువల్ల కండక్టర్‌గా కూడా విధులను నిర్వర్తించాలనడం ఎంత మాత్రం సరికాదంటూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. కోర్టు తీర్పుతో కొత్తగా 7,200 మంది కండక్టర్లను నియమించాల్సి ఉంటుందని, ఆర్థిక భారం దృష్ట్యా తీర్పును సవరించాలంటూ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా ధర్మాసనం శుక్రవారం విచారించింది. అయితే ఆర్థిక భారం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్టాలు చేసే అధికారులే వాటిని ఉల్లంఘించడం సరికాదని పేర్కొంది. -
మరికొందరు ‘ఎర్ర’డ్రైవర్లు?
నేడో రేపో వెలుగులోకి... ఎర్రచందనం స్మగ్లర్ల ఎరకు పడిపోరుున ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 11 మంది డ్రైవర్లను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆర్టీసీ విజిలెన్స్ వారు ఈ వ్యవహారంలో దృష్టి సారించారు. తమిళనాడుతో పాటు, బెంగుళూరు వెళ్లే బస్సు సిబ్బందిపై విచారణ చేపట్టారు. స్మగ్లర్లు చూపిన పచ్చనోట్ల ఆశతో లొంగిపోరుున వారు మరికొంత మంది ఉన్నారని తెలుస్తోంది. శుక్ర, శని వారాల్లో మరికొందరి పేర్లు వెలుగుచూసే అవకాశం ఉంది. కడప అర్బన్: ఎర్రచందనం స్మగ్లర్లు జిల్లాలోని అడవులకు తమిళ కూలీలను రప్పించుకునేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇంతకాలం రైలు మార్గం ద్వారా జిల్లాకు చేరుతున్న వీరు ప్రస్తుతం తమ రూటు మార్చారు. రైళ్లను వదిలి బస్సు మార్గం ఎంచుకున్నారు. రైల్వే స్టేషన్లలో పోలీసుల నిఘా తీవ్రం కావడంతో వీరు పథకం మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఎర్రచందనం స్మగ్లర్ల నోట్లకు ఆశపడి కొందరు ఆర్టీసీ డ్రైవర్లు తమ భవితవ్యాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు. ఏకంగా 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను జిల్లా పోలీసులు రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో అరెస్టు చేశారు. వీరంతా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన వారే కావడం గమనార్హం. గత ఏడాది ముందు వరకు చెన్నైనుంచి తమిళ కూలీలు జిల్లాలోకి ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా పదునైన ఆయుధాలతో దిగి అడవుల్లోకి ఎర్రచందనం చెట్ల నరికివేతకు వెళ్లేవారు. అప్పటి జిల్లా ఎస్పీలు మనీష్‌కుమార్‌సిన్హా, అశోక్‌కుమార్‌లు రైళ్ల ద్వారా వస్తున్న తమిళ కూలీలను ఎక్కడికక్కడ కట్టడి చేసి అరెస్టు చేశారు. తర్వాత చెన్నై నుంచి బెంగళూరు, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, కొండాపురం, కడప మీదుగా రూటుమార్చి జిల్లాలోని అడవుల్లోకి వెళ్లేవారు. ఈ స్టేషన్లలో వీరు దిగిన తర్వాత ఒక్కొక్కరుగా బస్సుల్లోగానీ, లారీల్లోగానీ బయలుదేరి ఒకచోట చేరేవారు. అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లేవారు. గత ఏడాది చివరి నుంచి మొన్నటిదాక ఈ విధానాన్ని అనుసరించారు. తర్వాత కడప సబ్ డివిజన్ పరిధిలోని వల్లూరు పోలీసుస్టేషన్ వద్ద ఈఏడాది జూన్ మాసంలో ఓ వాహనంలో వెళ్తున్న 45 మంది కూలీలు ఒకేసారి పట్టుబడ్డారు. వారి వద్దనుంచి ఎర్రచందనాన్ని, పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన బస్సు సర్వీసులలో చెన్నైకి వెళ్లే బస్సు డ్రైవర్లతో అక్కడి వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రయాణికులెవరినీ బస్సుల్లో ఎక్కించుకోకుండా కేవలం తమిళ కూలీలను మాత్రమే కోయంబేడు ప్రాంతం నుంచి ఎక్కించుకుని జిల్లాకు వచ్చేవారు. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా గట్టు రట్టయింది. నంద్యాల డిపోకు చెందిన అక్బర్ హుసేన్ కీలకపాత్ర పోషించి మిగతా డ్రైవర్లకు కూడా స్మగ్లర్ల నుంచి వచ్చే వేలాది రూపాయలను ఎరగా చూపించాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తమిళ కూలీలను ఎర్రచందనం అడవులున్న ప్రాంతాలలోకి చేరవేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం చివరకు వారి భవిష్యత్తునే కాలరాసింది. తేలనున్న మరికొంత మంది డ్రైవర్ల భవితవ్యం! ఇప్పటికే పోలీసు అధికారులు 11 మంది డ్రైవర్లను కూలీలతోసహా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ క్రమంలోనే కడప జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు ఆరు నెలల నుంచి కడప, కర్నూలు జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి చెన్నై, బెంగళూరులకు వెళ్లే బస్సుసర్వీసుల రికార్డులను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అరెస్టయిన 11 మంది డ్రైవర్లపై చర్యలకు నివేదికను తయారు చేశారు. మరో 11 మంది ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కడప జోన్ అధికారి మధుసూదన్‌రావు మాట్లాడుతూ గత ఆరు నెలలునుంచి రికార్డులు తనిఖీ చేస్తున్నామని, ఈనెల 5వ తేదీ సాయంత్రంకల్లా ఎవరెవరి పాత్ర ఉందో తేలవచ్చని స్పష్టం చేశారు. సమగ్రంగా విచారణ చేపట్టిన తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులకు వారిపై చర్యలకు నివేదిక పంపిస్తామన్నారు.