నేడో రేపో వెలుగులోకి...
ఎర్రచందనం స్మగ్లర్ల ఎరకు పడిపోరుున ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 11 మంది డ్రైవర్లను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆర్టీసీ విజిలెన్స్ వారు ఈ వ్యవహారంలో దృష్టి సారించారు. తమిళనాడుతో పాటు, బెంగుళూరు వెళ్లే బస్సు సిబ్బందిపై విచారణ చేపట్టారు. స్మగ్లర్లు చూపిన పచ్చనోట్ల ఆశతో లొంగిపోరుున వారు మరికొంత మంది ఉన్నారని తెలుస్తోంది. శుక్ర, శని వారాల్లో మరికొందరి పేర్లు వెలుగుచూసే అవకాశం ఉంది.
కడప అర్బన్: ఎర్రచందనం స్మగ్లర్లు జిల్లాలోని అడవులకు తమిళ కూలీలను రప్పించుకునేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇంతకాలం రైలు మార్గం ద్వారా జిల్లాకు చేరుతున్న వీరు ప్రస్తుతం తమ రూటు మార్చారు. రైళ్లను వదిలి బస్సు మార్గం ఎంచుకున్నారు. రైల్వే స్టేషన్లలో పోలీసుల నిఘా తీవ్రం కావడంతో వీరు పథకం మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఎర్రచందనం స్మగ్లర్ల నోట్లకు ఆశపడి కొందరు ఆర్టీసీ డ్రైవర్లు తమ భవితవ్యాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు.
ఏకంగా 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను జిల్లా పోలీసులు రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో అరెస్టు చేశారు. వీరంతా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన వారే కావడం గమనార్హం. గత ఏడాది ముందు వరకు చెన్నైనుంచి తమిళ కూలీలు జిల్లాలోకి ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా పదునైన ఆయుధాలతో దిగి అడవుల్లోకి ఎర్రచందనం చెట్ల నరికివేతకు వెళ్లేవారు. అప్పటి జిల్లా ఎస్పీలు మనీష్‌కుమార్‌సిన్హా, అశోక్‌కుమార్‌లు రైళ్ల ద్వారా వస్తున్న తమిళ కూలీలను ఎక్కడికక్కడ కట్టడి చేసి అరెస్టు చేశారు. తర్వాత చెన్నై నుంచి బెంగళూరు, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, కొండాపురం, కడప మీదుగా రూటుమార్చి జిల్లాలోని అడవుల్లోకి వెళ్లేవారు. ఈ స్టేషన్లలో వీరు దిగిన తర్వాత ఒక్కొక్కరుగా బస్సుల్లోగానీ, లారీల్లోగానీ బయలుదేరి ఒకచోట చేరేవారు. అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లేవారు. గత ఏడాది చివరి నుంచి మొన్నటిదాక ఈ విధానాన్ని అనుసరించారు. తర్వాత కడప సబ్ డివిజన్ పరిధిలోని వల్లూరు పోలీసుస్టేషన్ వద్ద ఈఏడాది జూన్ మాసంలో ఓ వాహనంలో వెళ్తున్న 45 మంది కూలీలు ఒకేసారి పట్టుబడ్డారు. వారి వద్దనుంచి ఎర్రచందనాన్ని, పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన బస్సు సర్వీసులలో చెన్నైకి వెళ్లే బస్సు డ్రైవర్లతో అక్కడి వారు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ప్రయాణికులెవరినీ బస్సుల్లో ఎక్కించుకోకుండా కేవలం తమిళ కూలీలను మాత్రమే కోయంబేడు ప్రాంతం నుంచి ఎక్కించుకుని జిల్లాకు వచ్చేవారు. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా గట్టు రట్టయింది. నంద్యాల డిపోకు చెందిన అక్బర్ హుసేన్ కీలకపాత్ర పోషించి మిగతా డ్రైవర్లకు కూడా స్మగ్లర్ల నుంచి వచ్చే వేలాది రూపాయలను ఎరగా చూపించాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తమిళ కూలీలను ఎర్రచందనం అడవులున్న ప్రాంతాలలోకి చేరవేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం చివరకు వారి భవిష్యత్తునే కాలరాసింది.
తేలనున్న మరికొంత మంది
డ్రైవర్ల భవితవ్యం!
ఇప్పటికే పోలీసు అధికారులు 11 మంది డ్రైవర్లను కూలీలతోసహా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ క్రమంలోనే కడప జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు ఆరు నెలల నుంచి కడప, కర్నూలు జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి చెన్నై, బెంగళూరులకు వెళ్లే బస్సుసర్వీసుల రికార్డులను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అరెస్టయిన 11 మంది డ్రైవర్లపై చర్యలకు నివేదికను తయారు చేశారు. మరో 11 మంది ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కడప జోన్ అధికారి మధుసూదన్‌రావు మాట్లాడుతూ గత ఆరు నెలలునుంచి రికార్డులు తనిఖీ చేస్తున్నామని, ఈనెల 5వ తేదీ సాయంత్రంకల్లా ఎవరెవరి పాత్ర ఉందో తేలవచ్చని స్పష్టం చేశారు. సమగ్రంగా విచారణ చేపట్టిన తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులకు వారిపై చర్యలకు నివేదిక పంపిస్తామన్నారు.
మరికొందరు ‘ఎర్ర’డ్రైవర్లు?
Published Fri, Dec 5 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM
Advertisement