red wood smaglars
-
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సాక్షి, బద్వేలు: బద్వేలు ఫారెస్టు రేంజ్ పరిధిలోని పెనుశిల అభయారణ్యంలోని బ్రాహ్మణపల్లె సెక్షన్ ఓబుళం బీటులోని మల్లెంకొండేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 9 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు బద్వేలు ఎఫ్ఆర్ఓ పీ.సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం ఫారెస్టు బంగ్లా ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఓబుళం బీటు సమీపంలోని పోతురాజుకట్టవ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించగా తమిళకూలీలు తారసపడ్డారన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడులోని విల్లుపురంజిల్లా తజవెన్నియుర్ ప్రాంతానికి చెందిన గోవిందరాజ్, అల్లిముత్తు, తనబాల్, అన్నామలైగోవిందన్, పజానికుల్లన్, రామచంద్రన్, విన్నుస్వామి, రాజేంద్రయన్గోవిందన్లతో పాటు అదే జిల్లాలోని తోరణన్గట్టివలపు ప్రాంతానికి చెందిన ముత్తుస్వామిపెరుమాల్, కారువెలంపడి ప్రాంతానికి చెందిన దేవరాజ్‌లుగా గుర్తించామన్నారు. వీరంతా తమిళనాడుకు చెందిన పళని అనే స్మగ్లర్ సూచనల మేరకు నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు రేంజ్ పరిధిలో గల కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలోని గుడిగుంట బీటు నుంచి ఓబుళం బీటులోకి ప్రవేశించి ఎర్రచందనం వృక్షాలను నరికినట్లు విచారణలో తేలిందన్నారు. స్వాధీనం చేసుకున్న 622 కేజీల దుంగలు సుమారు రూ.3 లక్షలు విలువ చేస్తాయని తెలిపారు. నిందితులను పూర్తిస్థాయిలో విచారించి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. ఈ దాడుల్లో సెక్షన్ ఆఫీసర్ ఎం.వి.రమణ, ఎఫ్‌బీఓలు రామసుబ్బారెడ్డి, నారాయణస్వామి, సుధాకర్, ఏబీఓ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం సిద్దవటం: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని భాకరాపేట, వాటర్ గండి ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు ఒంటిమిట్ట సీఐ హనుమంత్‌నాయక్, ఎస్ఐ కృష్ణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ బి.వి.ప్రతాప్, పోలీసు సిబ్బంది శుక్రవారం తెల్లవారు జామున సిద్దవటం మండలం ఏపీఎస్పీ 11వ బెటాలియన్ సమీపంలోని బండారు కోన అటవీ ప్రాంతంలో తమ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారన్నారు. అటవీ ప్రాంతంలోని వంక చెక్‌డ్యాం వద్ద ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచారన్నారు. వాహనం కోసం ఎదురు చూస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, అక్కడ ఉన్న 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు. పట్టుబడిన వారు సిద్దవటం మండలం లోని భాకరాపేట గ్రామానికి చెందిన పొంతగిరి నాగరాజు అలియాస్ రాజ, పెద్దపల్లె వేణుగోపాల్ అలియాస్ వేణు, కడప వాటర్ గండి సమీపంలో ఉన్న వెంకటేశ్వరాపురంకు చెందిన ఉమ్మడి అన్నయ్యలుగా గుర్తించామన్నారు. అయితే నాగరాజుపై 2014లో కడప రేంజిలో కేసులు ఉండగా అతను పీడీయాక్టు కేసులో జైలుకు వెళ్లి వచ్చారన్నారు. పట్టుబడిన ఎర్రచదంనం దుంగలు 380 కిలో బరువు ఉన్నాయన్నారు. వీటి విలువ దాదాపు రూ. 5లక్షలు చేస్తుందని ఆయన వెల్లడించారు. అనంతరం అరెస్టు చేసిన వారిని శుక్రవారం సాయంత్ర సిద్దవటం కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ వివరించారు. -
తిరగబడ్డ ఎర్ర కూలీలు
భాకరాపేట : శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్ర కూలీలు దాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఐజీ కాంతారావు సోమవారం భాకరాపేట ఘాట్ రోడ్డులో మయూరి వనం అటవీ ప్రాంతంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. శేషాచలంలోని భాకరాపేట ఘాట్ రోడ్డు, చంద్రగిరి మండలం భీమవరం అటవీ ప్రాంతంలో ఎర్రకూలీలు ఉన్నట్లు సమాచారం అంద డంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున భాకరాపేట ఘాట్ రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రకూలీలను పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. కూలీలు రాళ్లు, కొడవళ్లు, గొడ్డళ్లతో ఎదురుదాడికి దిగారు. పోలీసులు ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో కూలీలు పారిపోయారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం జవ్వాదిమలై కొండలకు చెందిన కూలీని అదుపులోకి తీసుకున్నారు. కూలీలు పడేసి వెళ్లిన 13 దుంగలను, గొడ్డళ్లు, కొడవళ్లు, రంపాలు, తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కొనసాగుతున్న కూంబింగ్: టాస్క్‌ఫోర్స్ బృందాలతో శేషాచలం అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నట్టు ఐజీ తెలిపారు. శ్రీవారిమెట్టు, భాకరాపేట ఘాట్, కళ్యాణి డ్యాం, పులిబోను, దేవరకొండ, చింతగుంట, తలకోన అటవీ ప్రాంతాలతోపాటు రాజంపేట, మామండూరు, శ్రీకాళహస్తి గొల్లపల్లె, నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతం వరకు ఏకధాటిగా కూంబింగ్ చేపడతామన్నారు. దాడులకు దిగితే కాల్పులు: ఎర్రకూలీలు దాడులకు దిగితే కాల్పులకు సైతం వెనకాడబోమని ఐజీ కాంతా రావు హెచ్చరించారు. ఎర్రచందనం రక్షణే ద్యేయంగా పని చేస్తున్న సిబ్బందికి చిన్నహాని తలపెట్టడానికి ప్రయత్నించినా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్, టాస్క్‌ఫోర్స్ సీఐ మధుబాబు, ఆర్ఎస్ఐ భాస్కర్, చందు, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అశోక్‌కుమార్, ఏడీవో కోదండం, భాకరాపేట ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మరికొందరు ‘ఎర్ర’డ్రైవర్లు?
నేడో రేపో వెలుగులోకి... ఎర్రచందనం స్మగ్లర్ల ఎరకు పడిపోరుున ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 11 మంది డ్రైవర్లను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆర్టీసీ విజిలెన్స్ వారు ఈ వ్యవహారంలో దృష్టి సారించారు. తమిళనాడుతో పాటు, బెంగుళూరు వెళ్లే బస్సు సిబ్బందిపై విచారణ చేపట్టారు. స్మగ్లర్లు చూపిన పచ్చనోట్ల ఆశతో లొంగిపోరుున వారు మరికొంత మంది ఉన్నారని తెలుస్తోంది. శుక్ర, శని వారాల్లో మరికొందరి పేర్లు వెలుగుచూసే అవకాశం ఉంది. కడప అర్బన్: ఎర్రచందనం స్మగ్లర్లు జిల్లాలోని అడవులకు తమిళ కూలీలను రప్పించుకునేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇంతకాలం రైలు మార్గం ద్వారా జిల్లాకు చేరుతున్న వీరు ప్రస్తుతం తమ రూటు మార్చారు. రైళ్లను వదిలి బస్సు మార్గం ఎంచుకున్నారు. రైల్వే స్టేషన్లలో పోలీసుల నిఘా తీవ్రం కావడంతో వీరు పథకం మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఎర్రచందనం స్మగ్లర్ల నోట్లకు ఆశపడి కొందరు ఆర్టీసీ డ్రైవర్లు తమ భవితవ్యాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు. ఏకంగా 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను జిల్లా పోలీసులు రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో అరెస్టు చేశారు. వీరంతా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన వారే కావడం గమనార్హం. గత ఏడాది ముందు వరకు చెన్నైనుంచి తమిళ కూలీలు జిల్లాలోకి ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా పదునైన ఆయుధాలతో దిగి అడవుల్లోకి ఎర్రచందనం చెట్ల నరికివేతకు వెళ్లేవారు. అప్పటి జిల్లా ఎస్పీలు మనీష్‌కుమార్‌సిన్హా, అశోక్‌కుమార్‌లు రైళ్ల ద్వారా వస్తున్న తమిళ కూలీలను ఎక్కడికక్కడ కట్టడి చేసి అరెస్టు చేశారు. తర్వాత చెన్నై నుంచి బెంగళూరు, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, కొండాపురం, కడప మీదుగా రూటుమార్చి జిల్లాలోని అడవుల్లోకి వెళ్లేవారు. ఈ స్టేషన్లలో వీరు దిగిన తర్వాత ఒక్కొక్కరుగా బస్సుల్లోగానీ, లారీల్లోగానీ బయలుదేరి ఒకచోట చేరేవారు. అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లేవారు. గత ఏడాది చివరి నుంచి మొన్నటిదాక ఈ విధానాన్ని అనుసరించారు. తర్వాత కడప సబ్ డివిజన్ పరిధిలోని వల్లూరు పోలీసుస్టేషన్ వద్ద ఈఏడాది జూన్ మాసంలో ఓ వాహనంలో వెళ్తున్న 45 మంది కూలీలు ఒకేసారి పట్టుబడ్డారు. వారి వద్దనుంచి ఎర్రచందనాన్ని, పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన బస్సు సర్వీసులలో చెన్నైకి వెళ్లే బస్సు డ్రైవర్లతో అక్కడి వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రయాణికులెవరినీ బస్సుల్లో ఎక్కించుకోకుండా కేవలం తమిళ కూలీలను మాత్రమే కోయంబేడు ప్రాంతం నుంచి ఎక్కించుకుని జిల్లాకు వచ్చేవారు. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా గట్టు రట్టయింది. నంద్యాల డిపోకు చెందిన అక్బర్ హుసేన్ కీలకపాత్ర పోషించి మిగతా డ్రైవర్లకు కూడా స్మగ్లర్ల నుంచి వచ్చే వేలాది రూపాయలను ఎరగా చూపించాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తమిళ కూలీలను ఎర్రచందనం అడవులున్న ప్రాంతాలలోకి చేరవేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం చివరకు వారి భవిష్యత్తునే కాలరాసింది. తేలనున్న మరికొంత మంది డ్రైవర్ల భవితవ్యం! ఇప్పటికే పోలీసు అధికారులు 11 మంది డ్రైవర్లను కూలీలతోసహా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ క్రమంలోనే కడప జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు ఆరు నెలల నుంచి కడప, కర్నూలు జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి చెన్నై, బెంగళూరులకు వెళ్లే బస్సుసర్వీసుల రికార్డులను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అరెస్టయిన 11 మంది డ్రైవర్లపై చర్యలకు నివేదికను తయారు చేశారు. మరో 11 మంది ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కడప జోన్ అధికారి మధుసూదన్‌రావు మాట్లాడుతూ గత ఆరు నెలలునుంచి రికార్డులు తనిఖీ చేస్తున్నామని, ఈనెల 5వ తేదీ సాయంత్రంకల్లా ఎవరెవరి పాత్ర ఉందో తేలవచ్చని స్పష్టం చేశారు. సమగ్రంగా విచారణ చేపట్టిన తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులకు వారిపై చర్యలకు నివేదిక పంపిస్తామన్నారు. -
కొనసాగుతున్న‘ఎర్ర’దొంగల వేట
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారుల తో కలిసి అన్ని వైపుల నుంచి పట్టుబిగిస్తున్నా రు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని పోలీసు బాస్ నుంచి ఉత్తర్వులు రా వడంతో రాయలసీమ జోన్ ఐజీ నవీన్‌చంద్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌తోపాటు పోలీసు సర్కిల్స్ పరిధిలోని సీఐలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. తిరుపతి అర్బన్, చిత్తూరు, వైఎస్సార్ జిల్లా పోలీసులు ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రేణిగుంట, మదనపల్లె సబ్ డివిజన్ల పరిధిలోని వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వైఎస్సా ర్ జిల్లాలోని శేషన్ అనే ఎర్రచందనం స్మగ్లర్ ఇంటిపై రేణిగుంట పోలీసులు దాడులు నిర్వహించి లక్షల్లో సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. సీక్రెట్ ఆపరేషన్ టాస్క్‌ఫోర్స్ వద్దనున్న సమాచారంతో తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లా పోలీసులు కూడా ఎర్రదొంగలవేటలో పడ్డారు. చిత్తూరు జిల్లా పోలీసు నుంచి ఏడుగురు సీఐలను రహస్య ఆపరేషన్ కోసం రంగంలోకి దించారు. వీరు ఈ పనిలోనే ఉన్నట్లు పోలీసు డిపార్టుమెంట్‌లోని కిందిస్థా యి సిబ్బందికి కూడా తెలియదు. ఎర్రచందనం ్మగ్లింగ్ దర్యాపునకు సంబంధించి శాఖాపరమైన సమాచారం బయటకు పొక్కకుండా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లోని పెద్దస్థాయి స్మగ్లర్లు, జిల్లాలోని రెండో శ్రేణి స్మగ్లర్లు, మధ్యవర్తులు, రవాణా సౌకర్యాలు సమకూరుస్తున్న, కూలీలను ఏర్పాటు చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. రహస్య విచారణ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అరెస్టుల సమాచారాన్ని వెంటనే వెల్లడించకుండా వారి నుంచి వివరాలు రాబట్టేందుకు రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ అధికారులతోపాటు రేణిగుంట, తిరుపతి సబ్ డివిజన్లోని కొందరు అనుభవమున్న పోలీసు అధికారులను ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖతో సంబంధం లేకుండా పోలీసులు తమకున్న సమాచారం మేరకు పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దు వైఎస్సార్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎర్రచందనం స్మగ్లర్లలో ఇద్దరు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం నిధులు మంచి నీళ్లలా ఖర్చుచేశారు. వీరిలో ఒకరు ఏకంగా ఎన్నికల సభలో చంద్రబాబు పక్కన కూర్చుని ఉండగా పత్రికల్లో ఫొటో ప్రచురితం కావడం గమనార్హం. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో ఉన్న స్మగ్లర్లను పోలీసులు ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది