ఎర్రకూలీలు వదలి వెళ్లిన ఆయుధాలు
భాకరాపేట : శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్ర కూలీలు దాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఐజీ కాంతారావు సోమవారం భాకరాపేట ఘాట్ రోడ్డులో మయూరి వనం అటవీ ప్రాంతంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. శేషాచలంలోని భాకరాపేట ఘాట్ రోడ్డు, చంద్రగిరి మండలం భీమవరం అటవీ ప్రాంతంలో ఎర్రకూలీలు ఉన్నట్లు సమాచారం అంద డంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున భాకరాపేట ఘాట్ రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రకూలీలను పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. కూలీలు రాళ్లు, కొడవళ్లు, గొడ్డళ్లతో ఎదురుదాడికి దిగారు. పోలీసులు ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో కూలీలు పారిపోయారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం జవ్వాదిమలై కొండలకు చెందిన కూలీని అదుపులోకి తీసుకున్నారు. కూలీలు పడేసి వెళ్లిన 13 దుంగలను, గొడ్డళ్లు, కొడవళ్లు, రంపాలు, తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న కూంబింగ్: టాస్క్‌ఫోర్స్ బృందాలతో శేషాచలం అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నట్టు ఐజీ తెలిపారు. శ్రీవారిమెట్టు, భాకరాపేట ఘాట్, కళ్యాణి డ్యాం, పులిబోను, దేవరకొండ, చింతగుంట, తలకోన అటవీ ప్రాంతాలతోపాటు రాజంపేట, మామండూరు, శ్రీకాళహస్తి గొల్లపల్లె, నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతం వరకు ఏకధాటిగా కూంబింగ్ చేపడతామన్నారు.
దాడులకు దిగితే కాల్పులు: ఎర్రకూలీలు దాడులకు దిగితే కాల్పులకు సైతం వెనకాడబోమని ఐజీ కాంతా రావు హెచ్చరించారు. ఎర్రచందనం రక్షణే ద్యేయంగా పని చేస్తున్న సిబ్బందికి చిన్నహాని తలపెట్టడానికి ప్రయత్నించినా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్, టాస్క్‌ఫోర్స్ సీఐ మధుబాబు, ఆర్‌ఎస్‌ఐ భాస్కర్, చందు, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ అశోక్‌కుమార్, ఏడీవో కోదండం, భాకరాపేట ఎస్‌ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment