ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Police Possession Redwood In Kadapa | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Sat, Aug 17 2019 7:51 AM | Last Updated on Sat, Aug 17 2019 7:51 AM

Police Possession Redwood In Kadapa - Sakshi

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎఫ్‌ఆర్‌ఓ  

సాక్షి, బద్వేలు: బద్వేలు ఫారెస్టు రేంజ్‌ పరిధిలోని పెనుశిల అభయారణ్యంలోని బ్రాహ్మణపల్లె సెక్షన్‌ ఓబుళం బీటులోని మల్లెంకొండేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 9 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు బద్వేలు ఎఫ్‌ఆర్‌ఓ పీ.సుభాష్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఫారెస్టు బంగ్లా ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఓబుళం బీటు సమీపంలోని పోతురాజుకట్టవ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించగా తమిళకూలీలు తారసపడ్డారన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడులోని విల్లుపురంజిల్లా తజవెన్నియుర్‌ ప్రాంతానికి చెందిన గోవిందరాజ్, అల్లిముత్తు, తనబాల్, అన్నామలైగోవిందన్, పజానికుల్లన్, రామచంద్రన్, విన్నుస్వామి, రాజేంద్రయన్‌గోవిందన్‌లతో పాటు అదే జిల్లాలోని తోరణన్‌గట్టివలపు ప్రాంతానికి చెందిన ముత్తుస్వామిపెరుమాల్, కారువెలంపడి ప్రాంతానికి చెందిన దేవరాజ్‌లుగా గుర్తించామన్నారు.

వీరంతా తమిళనాడుకు చెందిన పళని అనే స్మగ్లర్‌ సూచనల మేరకు నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు రేంజ్‌ పరిధిలో గల కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలోని గుడిగుంట బీటు నుంచి ఓబుళం బీటులోకి ప్రవేశించి ఎర్రచందనం వృక్షాలను నరికినట్లు విచారణలో తేలిందన్నారు. స్వాధీనం చేసుకున్న 622 కేజీల దుంగలు సుమారు రూ.3 లక్షలు విలువ చేస్తాయని తెలిపారు. నిందితులను పూర్తిస్థాయిలో విచారించి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. ఈ దాడుల్లో సెక్షన్‌ ఆఫీసర్‌ ఎం.వి.రమణ, ఎఫ్‌బీఓలు రామసుబ్బారెడ్డి, నారాయణస్వామి, సుధాకర్, ఏబీఓ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రొటెక్షన్‌ వాచర్లు పాల్గొన్నారు.

16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం:  అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని భాకరాపేట, వాటర్‌ గండి ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు ఒంటిమిట్ట సీఐ హనుమంత్‌నాయక్, ఎస్‌ఐ కృష్ణమూర్తి, హెడ్‌ కానిస్టేబుల్‌ బి.వి.ప్రతాప్, పోలీసు సిబ్బంది శుక్రవారం తెల్లవారు జామున సిద్దవటం మండలం ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌ సమీపంలోని బండారు కోన  అటవీ ప్రాంతంలో తమ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారన్నారు. అటవీ ప్రాంతంలోని వంక చెక్‌డ్యాం వద్ద ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచారన్నారు.  వాహనం కోసం ఎదురు చూస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, అక్కడ ఉన్న 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు.  

పట్టుబడిన వారు సిద్దవటం మండలం లోని భాకరాపేట గ్రామానికి చెందిన పొంతగిరి నాగరాజు అలియాస్‌ రాజ, పెద్దపల్లె వేణుగోపాల్‌ అలియాస్‌ వేణు, కడప వాటర్‌ గండి సమీపంలో ఉన్న వెంకటేశ్వరాపురంకు చెందిన ఉమ్మడి అన్నయ్యలుగా గుర్తించామన్నారు. అయితే నాగరాజుపై 2014లో కడప రేంజిలో కేసులు ఉండగా అతను పీడీయాక్టు కేసులో జైలుకు వెళ్లి వచ్చారన్నారు.  పట్టుబడిన ఎర్రచదంనం దుంగలు 380 కిలో బరువు ఉన్నాయన్నారు.  వీటి విలువ దాదాపు రూ. 5లక్షలు చేస్తుందని ఆయన వెల్లడించారు. అనంతరం అరెస్టు చేసిన వారిని శుక్రవారం సాయంత్ర సిద్దవటం కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement