సాక్షి, కడప : రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రత్యేక కసరత్తు చేస్తున్నాయి. పోలీస్‌శాఖ ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది. సమస్యలు తలెత్తే పోలింగ్ కేంద్రాలను కేటగిరి వారిగా వర్గీకరించినట్టు తెలుస్తోంది.
ఈ జాబితా ఉన్నతాధికారులకు చేరినట్టు సమాచారం. ఈనెల 31లోగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని రెవెన్యూ శాఖకు గడువు విధించారు. అయితే ఆ శాఖాధికారులు ఇంకా పోలింగ్ స్టేషన్లను గుర్తించే పనిలో ఉండటంతో ఈ జాబితా తయారు చేయలేదు. ఇప్పటికే పలు మండలాల్లో తహశీల్దార్లు, పోలీసులు సమావేశమై శాంతి భద్రతల గురించి సంయుక్తంగా చర్చిస్తున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత, సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించేవారు.
తాజాగా ఈసారి రెండు కేటగిరిల్లో పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను కేటగిరి వారిగా జాబితాను రూపొందించారు. దీంతో పాటు కులాలవారీగా ఓటర్లను భయభ్రాంతులు చేయడం, పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చే వారిని రాకుండా అడ్డుకోవడం వంటి సమస్యలపై దృష్టిసారించారు.
జిల్లాలోని సమస్యాత్మక
నియోజకవర్గాలు
జిల్లాలో ముఖ్యంగా జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించారు. వీటిపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిసారించింది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి పోలీస్, రెవెన్యూ శాఖలు వేరువేరుగా పంపిన జాబితాలను ఎన్నికల సంఘం క్రోడీకరించుకొని తుది జాబితాను రూపొందించనుంది. ప్రస్తుతం పోలీసు శాఖ రూపొందించిన అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక జాబితా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేనాటికి అప్పుడున్న తాజా రాజకీయాల ఆధారంగా వీటి సంఖ్య పెరగడం, తగ్గడం వంటి మార్పులు చోటుచేసుకోవచ్చు.
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
గ్రామాల్లో పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జీవీజీ ఆశోక్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండే రౌడీషీటర్లను, సమస్యలు సృష్టించేవారిని పిలిపించి డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మీ కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ప్రవర్తనలో మార్పు వస్తే రౌడీషీట్‌లు ఎత్తివేస్తామని వారిలో మార్పుతెచ్చే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా అల్లర్లకు పాల్పడే వారిపై కన్నేసి జాబితాను రూపొందిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లాగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
సమరానికి సన్నాహం
Published Wed, Jan 29 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement