జీవితాంతం తోడునీడగా ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త చీటికీమాటికీ అనుమానించడంతోపాటు అత్త వేధిం పులు తాళలేక వివాహమైన ఆరు నెలలకే నిండు జీవితాన్ని బలి తీసుకుంది. సమాజంలో ప్రజలకష్టాలు, కన్నీళ్లను దూరంచేసే పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వేమశాంతికి కూడా అత్తింటి ఆరళ్లు తప్పలేదు. భర్త, అత్త వేధింపులకు తన నిండుజీవితాన్ని ఆత్మార్పణం చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం కడపలో చోటు చేసుకుంది. బంధువులు, సహచర కానిస్టేబుళ్ల కథనం మేరకు...
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వి.వేమశాంతి (24, పీసీ నెంబరు 2148) స్వగ్రామం ముద్దనూరు. తన బంధువుల సహాయంతో జమ్మలమడుగుకు చెందిన జగదీశ్వరరెడ్డిని 2013 ఆగస్టు 11న కన్యతీర్థంలో వివాహం చేసుకుంది. జగదీశ్వరరెడ్డి ముద్దనూరు గృహ నిర్మాణశాఖ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
వీరు రాజారెడ్డివీధి రామాలయం సమీపంలోని ఓ ఇంటిలో నివసిస్తున్నారు. తన భర్త అనుమానించేవాడని, అత్త వేధించేదని తోటి సిబ్బంది వద్ద ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో సంసారంలో చిన్నచిన్న గొడవలు మామూలే అని సర్దుకుపోవాలని చెబుతుండేవారు. మంగళవారం ఉదయం డ్యూటీ కోసం ఇంటి నుంచి బయలుదేరి ఏమైందో ఏమోకానీ తిరిగీ ఇంటికి వెళ్లింది. అత్త రామసుబ్బమ్మతో జరిగిన వాదోపవాదాలు, మనస్పర్థలతో శాంతి తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కల వారు గమనించి తలుపులు పగులగొట్టడంతో ఫ్యానుకు వేలాడుతోంది.
సమీపంలోని వైద్యులు వచ్చి పరీక్షించి మృతి చెందిందని నిర్దారించారు. సంఘటన జరిగిన సమయానికి భర్త జగదీశ్వరరెడ్డి ముద్దనూరులో ఉన్నట్లు సమాచారం. మృతురాలి సోదరి జ్యోతి చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సీఐ షౌకత్ అలీ, ఎస్‌ఐ రంగనాయకులు, సహచర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహచర మహిళా కానిస్టేబుళ్లు, కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు.
వేధింపులతోనే ఆత్మహత్య: డీఎస్పీ
వేమశాంతి ఆత్మహత్య చేసుకున్న ఇంటిని కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. భర్త, అత్త వేధింపుల వల్లనే మృతి చెందిందని ప్రాథమిక విచారణలో తెలిసిందని, ఈ మేరకు కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. సిబ్బంది కి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Published Wed, Jan 22 2014 2:53 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement