
పి.ఈశ్వరరావు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా హోంగార్డ్స్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న రిజర్వు ఇన్‌స్పెక్టర్ పి.ఈశ్వరరావు (34) పోలీసు క్వార్టర్స్‌లో తన నివాసంలోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కాల్చుకున్నారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయన భార్య హరిప్రియ కేకలు వేయడంతో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
తక్షణమే ఆయన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఎస్పీ ఎం.దీపిక ఆస్పత్రి మార్చురీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం సమీపంలోని వెదురుపాక సావరంకు చెందిన ఈశ్వరరావు 2011లో ఆర్‌ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరారు. 2018లో ఆర్‌ఐగా ఉద్యోగోన్నతి పొందారు. 2020 నుంచి జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో హోంగార్డ్స్ ఆర్‌ఐగా పనిచేస్తున్నారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకు నాలుగేళ్ల కిందట హరిప్రియతో వివాహమైంది. వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. హరిప్రియ ప్రస్తుతం ఏడునెలల గర్భవతి. ఆర్‌ఐ ఈశ్వరరావు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.