reserve inspector
-
రివాల్వర్‌తో కాల్చుకుని ఆర్ఐ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా హోంగార్డ్స్ ఇన్చార్జిగా పనిచేస్తున్న రిజర్వు ఇన్స్పెక్టర్ పి.ఈశ్వరరావు (34) పోలీసు క్వార్టర్స్‌లో తన నివాసంలోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కాల్చుకున్నారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయన భార్య హరిప్రియ కేకలు వేయడంతో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తక్షణమే ఆయన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఎస్పీ ఎం.దీపిక ఆస్పత్రి మార్చురీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం సమీపంలోని వెదురుపాక సావరంకు చెందిన ఈశ్వరరావు 2011లో ఆర్ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. 2018లో ఆర్ఐగా ఉద్యోగోన్నతి పొందారు. 2020 నుంచి జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్‌లో హోంగార్డ్స్ ఆర్ఐగా పనిచేస్తున్నారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకు నాలుగేళ్ల కిందట హరిప్రియతో వివాహమైంది. వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. హరిప్రియ ప్రస్తుతం ఏడునెలల గర్భవతి. ఆర్ఐ ఈశ్వరరావు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. -
తుపాకీ మిస్‌ఫైర్.. ఆర్ఎస్ఐ మృతి
చర్ల: తుపాకీ మిస్‌ఫైర్ అయి రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా బుధవారం చోటుచేసుకుంది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఆర్ఎస్ఐ ఆదిత్య సాయికుమార్ (25) చేతిలో ఉన్న ఏకే 47 తుపాకీ పేలి బుల్లెట్లు తొడలోకి దూసుకుపోయాయి. సహచర జవాన్లు సాయికుమార్‌ను తిప్పాపురం తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. మృతదేహానికి భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అతడి స్వస్థలమైన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు తరలించారు. మరో రెండు నెలల్లో గ్రేహౌండ్స్ ఆర్ఐగా పదోన్నతి పొందాల్సిన సాయికుమార్ మృతి పట్లకుటుంబ సభ్యులు, సహచర జవాన్లు ఆవేదన చెందుతున్నారు. -
ఎస్సైపై కోడలి ఫిర్యాదు
హైదరాబాద్: కొడుకు నుంచి విడిపోవాలని వేధిస్తున్నారంటూ ఓ ఉన్నతాధికారిపై ఫిర్యాదు చేసింది కోడలు. పోలీస్ శాఖలో రిజర్వ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆ అధికారి పేరు మంచు మోషేస్ బాబు. గత కొంత కాలంగా అత్తమామలు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ బాధిత కోడలు సోమవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. నిందితులపై సెక్షన్ 498ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆ అధికారిని అదుపులోకి తీసుకునేందుకు మాత్రం వెనకాడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.