పదే పదే అదే తప్పు.. మళ్లీ మళ్లీ అదే ముప్పు.. ఆర్టీసీ బస్సులు అదుపు తప్పుతున్నాయి.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.. బస్సుల్లో వెళుతున్న జనాలను బెంబేలెత్తిస్తున్నాయి..
నేలకొండపల్లి:
స్థలం: నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం స్టేజీ.
సమయం: మంగళవారం సాయంత్రం 4.00 గంటలు.
సందర్భం: రెండు బస్సులకు త్రుటిలో పెద్ద ముప్పు తప్పింది.
సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ఖమ్మం వైపు వచ్చిన బస్సు, నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం స్టేజీ వద్ద ఆగింది. ప్రయాణికులు దిగుతున్నారు. దాని వెనుకనే, మణుగూరు వెళ్లాల్సిన బస్సు వేగంగా వచ్చింది. ముందు ఆగిన బస్సును అదే వేగంతో ఓవర్‌టేక్ చేయబోయింది. సరిగ్గా అదే సమయంలో.. ఎదురుగా ఖమ్మం నుంచి నేలకొండపల్లికి గ్రానైట్ రాళ్ల లారీ ట్రాలీ వస్తోంది. ఎదురుగా దూసుకొస్తున్న బస్సును లారీ డ్రైవర్ గమనించాడు. వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. లారీ అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న బడ్డీ కొట్టును ఢీకొంది.
సడన్ బ్రేక్ వేయకపోతే...
స్టేజీలో, రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో వణికిపోయారు. ఆ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయకపోయినట్టయితే ఏం జరిగేది..? అక్కడున్న అందరిలోనూ ఇదే ప్రశ్న. లారీ, బస్సు ఢీకొనేవి. పక్కనే ఉన్న మరో బస్సును ఢీకొని ఉండేవి. ఆగిన బస్సు అదుపుతప్పి బోల్తా పడిపోయి ఉండేది. రెండు బస్సుల్లో కలిపి 80మంది ప్రయాణికులు ఉన్నారు. స్టేజీ వద్ద మరికొందరు ఉన్నారు. ‘లారీకి బ్రేక్ వేయకపోతే.. ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో.. ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవో...’ అందరిలోనూ ఇదే భయాందోళన. ఆ బడ్డీ కొట్టు వద్ద నిత్యం కనీసంగా ఐదు నుంచి పదిమంది వరకు ఉంటారు. ఆ బడ్డీని లారీ ఢీకొన్న సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఒకవేళ ఉండి ఉంటే...
ఈ నెల 11న...
♦ ఖమ్మం నగర శివారులోగల నాయుడుపేట జంక్షన్ వద్ద, బైక్‌ను హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో వేల్పుల జోషికరుణ్‌కుమార్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి సాయినితినాధ్ కూడా మరుసటి రోజున ఆస్పత్రిలో మృతిచెందాడు.
♦ జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం–మాచినేనిపేట తండా మధ్య ప్రధాన రహదారిపై బైక్‌ను, ఖమ్మం నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ భద్రాచలం డిపో ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొంది. బైక్ చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment