ఆర్టీసీపై తేల్చేది కేంద్రమే
విభజనపై ఇరు రాష్ట్రాల మధ్యా తీవ్ర విభేదాలు
రేపు ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీ వద్ద కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి సంస్థగా ఉన్న ఆర్టీసీ విభజన విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తులు, అప్పుల విభజన, ఉద్యోగుల పంపిణీ, బస్ము పర్మిట్లు వంటి అన్ని విషయాల్లోనూ విభేదాలే. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతున్నారు. చిక్కుముడిగా మారిన ఆర్టీసీ విభజనలో ఈ సమావేశం అత్యంత కీలకమైనది.
అయితే ఇంతటి ప్రాధాన్యమున్న భేటీకి ముందు ప్రాథమిక స్థాయిలో రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ అలాంటి కసరత్తేమీ లేకుండానే ఇద్దరు సీఎస్‌లు ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధాన కార్యదర్శులే కాదు, కనీసం యూనియన్ నేతల మధ్య కూడా ఇప్పటివరకు ఒక్కసారైనా చర్చలు జరగకపోవడం గమనార్హం. నిజానికి ఆర్టీసీలో ఆస్తులు, అప్పుల విభజనే పెద్ద సమస్యగా మారింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని ఆస్తుల విషయంలో పేచీ నెలకొంది.
ప్రధాన పరిపాలన భవనం బస్‌భవన్, ఆర్టీసీ ఆసుపత్రి, బస్‌బాడీ వర్క్‌షాప్ వంటి వాటి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలున్నాయి. దీనిపై అధికారికంగా ఏ స్థాయిలోనూ చర్చలు జరగలేదు. ఉమ్మడి సంస్థల విభజనకు కేంద్రం నియమించిన షీలాభిడే కమిటీ ఇప్పటికే దీనిపై ఓ నివేదికను సిద్ధం చేసింది. దానిపైనా ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీకి ఇద్దరు సీఎస్‌లు విడివిడిగా నివేదికలు అందజేయబోతున్నారు. పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలతో కూడిన ఈ నివేదికలను వారు వెంట తీసుకెళ్తున్నారు.
కాగా, గత మే 15న జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయానికే కట్టుబడి ఉండాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్తులను పదేళ్లపాటు ఏపీఎస్ఆర్టీసీ ఉపయోగించుకోవచ్చని, ఆ తర్వాత వాటిపై పూర్తి అధికారాలు తెలంగాణకే ఉంటాయనేది దాని సారాంశం. అయితే దీన్ని ఏపీ ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. షీలాభిడే కమిటీ ఆదేశం మేరకు ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ రూపొందించిన అధ్యయన నివేదిక మేరకు విభజన జరగాలన్నది వారి వాదన. జనాభా ప్రాతిపాదికన ఉమ్మడి ఆస్తుల విలువను పంచాలని సదరు నివేదిక సారాంశం. ఇప్పుడు దీనిపై కేంద్రం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఇది ఇప్పటికిప్పుడు తేలేది కానందున ఉమ్మడి ఆస్తుల అంశాన్ని పెండింగులో ఉంచి రెండు ఆర్టీసీలను అధికారికంగా ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇటీవల ఆర్టీసీ హైలెవల్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు సమాచారం. అయితే దీనికి అనుకూలంగా ఆర్టీసీ బోర్డు తీర్మానం చేయాల్సి ఉంది. ఈ దిశగా గడ్కరీ ఆదేశించే అవకాశముంది.
ఆర్టీసీకి జాతీయ అవార్డు
ఇరురాష్ట్రాల ఉమ్మడి సంస్థ ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డు లభించింది. దేశంలోనే సురక్షితమైన రవాణా సంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2013- 2014కు గాను ప్రతిష్టాత్మకమైన ‘సేఫ్టీఅవార్డు’ను ఏపీఎస్ఆర్టీసీ సొంతంచేసుకుంది. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల ఆధారంగా ఈ అవార్డును అందజేస్తారు. ప్రతి లక్ష కిలోమీటర్లకు గాను జాతీయస్థాయిలో వాహనప్రమాదాలు సగటుగా 0.12శాతం కాగా, ఏపీఎస్ఆర్టీసీలో 0.08గా నమోదైంది. తక్కువ ప్రమాదాలు జరిగిన ఉత్తమ రవాణాసంస్థగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎంపికైంది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేస్తారు.