రేషన్ మేస్తున్నారు..!
ఈ రెండు చిత్రాలు కేవలం ఉడికిన అన్నంలో రెండు మెతుకుల్లాంటివే. జిల్లాలోని ఒక్క మండలంలో రేషన్ సరుకులు అమ్మిన విధానాన్ని తెలియజేసేవే. రేషన్ పంపిణీలో జరిగే అక్రమాలకు నిదర్శనంగా నిలిచేవే...సమాచార హక్కు చట్టం ద్వారా ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ వాస్తవాల వెనుక అంతులేని దోపిడీ ఉంది.
- జిల్లాలో యథేచ్ఛగా నిత్యావసర సరుకుల దోపిడీ
- పౌరసరఫరాల అధికారులు, డీలర్ల కుమ్మక్కు
- పక్కదారి పడుతున్న టన్నుల కొద్దీ బియ్యం
- ఒకే వేలిముద్రలతో రేషన్ సరుకుల పంపిణీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సమాచార హక్కు చట్టం ద్వారా 2013 జనవరి నుంచి 2014 జనవరి వరకు నల్లగొండ మండలంలో రేషన్ పంపిణీకి సంబంధించిన రిజిస్టర్లు, ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి వివరాలు సేకరించారు హక్కు చట్టం కార్యకర్త కొత్తపల్లి శివాజీ. ఈయన వివరాలు సేకరించడానికే చాలా సమయం పట్టింది. వాటిని పరిశీలించి వాస్తవాలు తేల్చేందుకు నెలల సమయమే తీసుకుంది. సమాచార హక్కు చట్టం కింద వెలుగులోనికి వచ్చిన ఈ వాస్తవాలను పరిశీలిస్తే ముక్కు మీద వేలు వేసుకోక తప్పదు. నిజంగా ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల అధికారులు ఏం చేస్తున్నారనే అంశం అంతుపట్టదు. విజిలెన్స్ విభాగాలు, ఆకస్మిక తనిఖీలు వీటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయో అర్థం కాదు. ఒక్కసారి ఆ చిత్ర విచిత్ర రేషన్ పంపిణీ విన్యాసాలను చూద్దామా..!
కొన్ని షాపుల కీ రిజిస్టర్లలో వేలిముద్రలు మొత్తం ఒకే రకంగా ఉన్నాయి. కొన్ని షాపుల కీ రిజిస్టర్లలో కిరోసిన్ అమ్మకాలకు సంబంధించి రేషన్‌కార్డుదారుల సంతకాలు లేవు కానీ, కిరోసిన్ మొత్తం అమ్మినట్టు జీరో బ్యాలెన్స్ మాత్రం చూపించారు.
లబ్ధిదారుల సంతకాలకు సంబంధించి అనేక ఎత్తులు వేశారు రేషన్ డీలర్లు. ఒకే వ్యక్తి పేరు పది చోట్ల సంతకాలుగా ఉపయోగించారు. ఒకరి పేరు కార్డుపై ఉంటే మరో వ్యక్తి పేరిట సంతకం ఉంటుంది. వేలిముద్రలైతే ఎవరూ గుర్తుపట్టలేరు కనుక అద్దుడే అద్దుడు. అడ్డగోలుగా అద్ది, పేర్లు మార్చి సంతకాలు పెట్టి సరుకులను మాయం చేసినట్టు ఆధారాలు చెపుతున్నాయి.
స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలిస్తే సరుకులు 15వ తేదీలోపు అమ్మేసినట్టు ఉంటుంది. అదే కీ రిజిస్టర్‌ను పరిశీలిస్తే నెల మొత్తం సరుకులు అమ్మినట్టు ఉంటుంది. మరి ఆ సరుకులు ఎప్పుడు ఎవరికి అమ్మారో, ఏ రిజస్టర్ సరైందో ఆ రేషన్ డీలర్లు, అధికారులకే తెలియాలి.
లబ్ధిదారులు సంతకాలు పెట్టాల్సిన గడులు మాత్రం చాలా ఖాళీగానే కనిపిస్తాయి. కానీ స్టాక్ ఏమీ లేదని, అంతా అమ్మేశామని స్టాక్ రిజిస్టర్లో కనిపిస్తుంది.
ప్రతి నెలా కీ రిజిస్టర్లను తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించి కొత్త కీ రిజిస్టర్లు పట్టుకె ళ్లాలి. కానీ అదేమీ లేకుండానే కొత్త కీ రిజిస్టర్లను తీసుకెళ్లిపోయారు రేషన్ డీలర్లు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించిన వ్యక్తి సమాచారం ప్రకారం అతనికి కీ రిజిస్టర్లు చూపించేందుకు 20 రోజులకుపైగా పట్టింది. ఎందుకంటే అవి తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో లేవు. డీలర్ల వద్దే ఉండిపోయాయి.
ఇక, స్టాక్ రిజిస్టర్ల విషయానికి వస్తే గోదాము నుంచి వచ్చిన సరుకు, గత నెలలో నిల్వ ఉన్న సరుకు కలిపితే వచ్చిన మొత్తాన్ని ఆ నెలలో అమ్మాలి. కానీ అమ్మింది తక్కువైనా బ్యాలెన్స్ మాత్రం నామమాత్రంగా చూపెడుతున్నారు. ఆ తేడా మొత్తం సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని అర్థమవుతుంది.
కొందరు డీలర్లు మధ్యాహ్న భోజన బియ్యానికి సంబంధించిన స్టాక్‌రిజిస్టర్లు నిర్వహించడం లేదు. అలాట్మెంట్లో, ఆర్వో రిజిస్టర్లలో బియ్యం ఇచ్చినట్టు చూపెడుతున్నారు కానీ తాము ఆ బియ్యాన్ని దిగుమతి చేసుకున్నామని రేషన్ డీలర్లు స్టాక్రిజిస్టర్లలో చూపడం లేదు. పైగా వేసవి సెలవులు ఉండే మే నెలలో కూడా మధ్యాహ్న భోజన బియ్యం ఇచ్చామని చెప్పి పేద విద్యార్థులకందాల్సిన బియ్యాన్ని కూడా పిండుకున్నారని అర్థమవుతుంది.
కొందరు డీలర్లు రాసే స్టాక్రిజిస్టర్లలో రోజువారీ అమ్మకాల్లోనే తేడాలు రాస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
సార్లు ఏం చేస్తున్నారు?
ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు పౌరసరఫరాల అధికారులు మాత్రం మనకెందుకులే అనే రీతిలోనే వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఏడాది పొడవునా అక్రమాలు జరిగాయని సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన సమాచారం చెపుతుంటే దానిని అడ్డుకునే ప్రయత్నం కూడా జరగకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రతి నెలా సివిల్‌సప్లయ్ అధికారులు వారి పరిధిలో ఉన్న రేషన్‌షాపులను సందర్శించి స్టాక్రిజిస్టర్లలో ఉన్న ప్రకారం సరుకులు ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. డీలర్లు సరుకులు ఎలా అమ్ముతున్నారు? పేదలకు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా? లేదా అనే అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. కానీ, మన సార్లు అవేమీ చేసినట్టు కనిపించడం లేదని ఆధారాలు చెపుతున్నాయి.
లెక్క చూస్తే మైండ్ బ్లాకే
సమాచార హక్కు చట్టం ద్వారా నల్లగొండ మండలంలోని రేషన్ షాపుల పనితీరు ఆధారంగా ఒక చిన్న లెక్క చదివితే మీ మతి పోతుంది. ఎందుకో తెలుసా ఉజ్జాయింపుగా కడితేనే ఆ లెక్క దాదాపు రూ.80కోట్ల వరకు వచ్చింది. ఎలానో తెలుసుకుంటారా..? ఎంత లేదన్నా కనీసం నెలకు ఒక్కో రేషన్ షాపులో రూ.15వేల విలువైన సరుకులైనా పక్కదారి పడతాయని అంచనా. నల్లగొండ రూరల్ మండలం, పట్టణంలో ఉన్న రేషన్ షాపులు 75. అంటే నెలకు నల్లగొండ రూరల్ మండలంలోనే 11, 25,000 రూపాయల సరుకులు పక్కదారి పడుతున్నాయన్నమాట. అదే ఏడాదిలెక్క కడితే ఆ విలువ రూ.1.35 కోట్లు. అదే జిల్లా మొత్తానికీ వర్తింపజేస్తే 59 మండలాల్లో కలిపి ఏడాదికి రూ.79.65 కోట్లు. అంటే జిల్లాలో ఉన్న అన్ని రేషన్ షాపుల డీలర్లు అక్రమాలకు పాల్పడతారన్నది వాస్తవం కాదు కానీ.. ఓ చోట ఎక్కువైనా, ఇంకో చోట తక్కువైనా... మరో చోట అసలు లేకపోయినా సగటున అన్ని కోట్ల రూపాయల నిత్యావసరాల సరుకులు పక్కదారి పడుతున్నాయన్నది వాస్తవం.