ఐఏఎస్ రవి మృతిపై అనేక అనుమానాలు...
బెంగళూరు: యువ ఐఏఎస్ అధికారి డీకె రవి అనుమానాస్పద మృతిపై ఆర్టీఐ కార్యకర్త గణేష్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవి నిజాయితీగా పనిచేసే అధికారి. ఆయన లాండ్ మాఫియా భరతం పట్టే క్రమంలో ఉన్నారని... దానికి సంబంధించి కొన్ని ప్రతాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు.
బెంగళూరులో ఓ భూ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలోనే డీకె రవి హత్య జరిగి ఉంటుందని గణేష్ అనుమానపడుతున్నారు. దీని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉండి ఉంటుందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. డీకె రవి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని గణేష్ ఆరోపిస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాల్సిందిగా కోరేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలవనున్నారని సమాచారం. కాగా తమ ప్రాథమిక దర్యాప్తులో డీకె రవి తన అపార్ట్ మెంట్లో ఉరి వేసుకున్నట్టుగా తేలిందని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రతీ కోణాన్ని పరిశీలిస్తున్నామని ... వైద్య నివేదికలు వచ్చేంతవరకు వేచి వుండాలని కోరారు. కాగా కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సభ్యులు ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేయడం, ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.