విమానమే కదా.. ఎవరు చూస్తారులే!
విమానాల్లో ప్రయాణించేటప్పుడు కాస్త సభ్యత పాటించడం సంస్కారం. అయితే కొంతమంది మాత్రం వీటన్నింటినీ గాలికి వదిలేసి తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటుంటారు. సాధారణంగా విమానాల్లో కూర్చోడానికే తప్ప పడుకోడానికి అవకాశం ఉండదు. దూరప్రయాణాలు చేసేవాళ్లు అలా కూర్చునే నిద్రపోతారు. మామూలుగా అయితే మన సీట్లో కూర్చుని, కాస్త వెనక్కి వాలి.. పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించని రీతిలో నిద్రించాలి. కానీ, ఇంతకుముందు చెప్పుకొన్న రకం వాళ్లు మాత్రం.. విమానం ఏదో తమ సొంత ఇల్లన్నట్లుగా భావించి ఎదుటి సీట్ల మీద కాళ్లు పెట్టడం, చొక్కాలు విప్పేసి పడుకోవడం.. ఇలా ప్రవర్తిస్తున్నారు. లోపల తామేం చేసినా బయటి ప్రపంచానికి తెలియదన్న ధైర్యం వాళ్లతో ఇలా చేయిస్తోంది. అయితే.. ఇలాంటివాళ్లను పట్టించడానికి ఇప్పుడు సోషల్ మీడియా ముందుకొచ్చింది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో 'ప్యాసింజర్ షేమింగ్' అనే గ్రూపు ఇప్పుడు బాగా ట్రెండవుతోంది. విమానాల్లో ప్రయాణిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాళ్లు, అమర్యాదగా ఉండేవాళ్లు, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేవాళ్లను అప్పటికప్పుడు తమ స్మార్ట్ఫోన్లతో ఫొటో తీసి.. వాటిని ఈ గ్రూపులలో షేర్ చేస్తున్నారు. తద్వారా వాళ్లు చేసే పనులను ప్రపంచం మొత్తానికి చాటుతున్నారు.