ట్రంప్ తీరుతో ముప్పేనని 8 రోజులకే..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 8 రోజుల్లోనే తాను వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చేశానని మహిళా ఉద్యోగి రుమానా అహ్మద్ తెలిపారు. ఎన్నికల సమయంలోనే ట్రంప్ ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయన అధికారంలోకి వస్తే అంతే సంగతులని తాను అనుకున్నట్లే జరిగిందని ఆమె చెప్పారు. అధికారం చేపట్టగానే ఒబామా కేర్ రద్దు చేసిన ట్రంప్, అమెరికన్ నిరుద్యోగుల కడుపు కొడుతున్న హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతో పాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేశారు. దీంతో తాను ట్రంప్ ప్రభుత్వంలో పనిచేయడం కష్టమేనని, ఎందుకంటే వైట్ హౌస్ లో బురఖాలో కనిపించే ఏకైక ముస్లిం ఉద్యోగిని తానేనని.. అక్కడ సేఫ్ కాదని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు.
'మా పేరేంట్స్ 1978లో బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందాను. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన నేను 2011లో వైట్ హౌస్ లో జాబ్ సంపాదించాను. అదే విధంగా జాతీయ భద్రతా మండలి(ఎన్ఎస్సీ)లోనూ పని చేశాను. ఉద్యోగానికి ఎప్పుడూ నేను బురఖా ధరించే వెళ్లేదాన్ని. ఒబామా ప్రభుత్వంలో నాకెలాంటి ఇబ్బందులు లేదు. అయితే కొత్త అధ్యక్షుడు ట్రంప్ ముస్లింలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఉద్యోగం వదులు కోవాల్సి వచ్చిందని' రుమానా అహ్మద్ చెప్పుకొచ్చారు.
జాబ్ మానేస్తున్నానని ఉన్నతాధికారులకు చెబితే.. జాబ్ ఒక్కటే మానేస్తున్నావా.. దేశం నుంచే వెళ్లిపోతున్నావా అని అడిగారని వెల్లడించారు. గతేడాది ఎన్నికల సమయం నుంచి అమెరికాలోని ముస్లింలు తమ పరిస్థితి ఎలా ఉండబోతుందని ఎంతో ఆందోళన చెందుతున్నారని, ఇప్పుడు మా ఆందోళనే నిజమైందని ఆమె చెప్పారు. ముస్లింలను దేశంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్.. అధ్యక్ష అధికార భవనం శ్వేతసౌధంలో బురఖా ధరించి కనిపించే తనపై తప్పకుండా వేటు వేస్తారని భావించి స్వయంగా రాజీనామా చేశానని రుమానా అహ్మద్ వాపోయారు.