running auto
-
అత్యాచారం చేసేందుకు ఆటోడ్రైవర్ యత్నం
ఆటోలో నుంచి దూకి తప్పించుకున్న యువతి జడ్చర్ల(మహబూబ్ నగర్ జిల్లా): స్థానికంగా ఓ వస్త్ర దుకాణంలో పనిచేసేందుకు ఆటోలో బయలుదేరిన ఓ యువతిని సదరు ఆటోడ్రైవర్ దారి మళ్లించి అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. ఆ యువతి తప్పించుకునేందుకు వేగంగా వెళ్తున్న ఆటోలోనుంచి దూకింది. ఈ ఘటన శుక్రవారం బాదేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మినర్సింహులు కథనం మేరకు..కావేరమ్మపేట పరిధిలోని జయప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ యువతి బాదేపల్లిలోని నేతాజీ చౌరస్తాలో గల ఓ గార్మెంట్ దుకాణంలో పనిచేస్తుంది. రోజులాగానే శుక్రవారం దుకాణానికి వెళ్లేందుకు తమ ఊరు నుంచి ఆటోలో బయలు దేరింది. ఆటోలో ఒంటరిగా ఉన్న యువతిని ఆటో డ్రైవర్ సిగ్నల్‌గడ్డ దగ్గర దారి మళ్లించి కల్వకుర్తి వైపు తీసుకెళ్తుండడంతో యువతి ఆటోడ్రైవర్‌ను ఇటు ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించింది. దీంతో అతను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆటోవేగం పెంచాడు. తనపై ఆఘాయిత్యం చేసేందుకే ఆటోను దారి మళ్లించి తీసుకెళ్తున్నాడని భావించిన యువతి ఆటోలోనుంచి దూకి స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు వల్లూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆటోపై విరిగిపడిన చెట్టు కొమ్మ
వినాయకపురం(ఖమ్మం): ఆటోపై చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఓ యువకుడు మృతిచెందగా.. ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట నుంచి దురదపాడు గ్రామానికి చెందిన ప్రయాణికులతో వెళ్తున్న ఆటో.. వినాయకపురం మలుపు దాటిన(మామిళ్లవారిగూడెం రోడ్) తర్వాత రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మ విరిగి ఆటోపై పడింది. దీంతో సున్నంబట్టి గ్రామానికి చెందిన కుర్సం సాయికుమార్(20) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మామిళ్లవారిగూడెంకు చెందిన అంకత భారతి తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపాకకు చెందిన సోయం వెంకమ్మ ఎడమ కాలు విరిగిపోయి.. తలకు గాయాలయ్యాయి. కొత్తమామిళ్లవారిగూడెంకు చెందిన నీలం అజయ్‌కుమార్, చండ్రుగొండకు చెందిన కర్నాటి పుల్లమ్మ, ఆటో డ్రైవర్ సొడెం నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని ఆటోపై పడిన చెట్టు కొమ్మను తొలగించి.. అందులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. వీరిని వినాయకపురం పీహెచ్సీ.. తర్వాత అశ్వారావుపేట సామాజిక ఆస్పత్రులకు తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు.