ఆన్లైన్లో పోలీసుల డ్యాన్స్ హల్చల్
వెల్లింగ్టన్/న్యూజిలాండ్: ఉరుకులుపరుగులు పోలీసులకు నిత్య కార్యక్రమం. ఎప్పుడు చూసిన కేసుల గొడవ. వారి ముఖంలో చిరునవ్వులు.. ఆనందంతో కనిపించే క్షణాలు అత్యంత అరుదు. కానీ, న్యూజిలాండ్ పోలీసులను చూస్తే మాత్రం వావ్.. పోలీసులు ఇంత ఖుషీగా ఉంటారా.. అమేజిన్ అనుకోవాల్సిందే. ఎంతో హుషారుగా ఓ పదిమంది పోలీసులు కలిసి పరుగెడుతున్నట్లుగా డ్యాన్స్ చేసిన వీడియోను వారు ఫేస్ బుక్లో.. యూట్యూబ్లో పోస్ట్ చేయగా అది పెద్ద వైరల్ గా మారింది. లక్షల్లో లైకులు వచ్చిపడ్డాయి. కనిపించగానే యూజర్లు క్లిక్ మనిపించేస్తున్నారు.
గతంలో న్యూయార్క్ పోలీసులు చేసిన ప్రయోగం మాదిరిగానే తాజా కివీస్ పోలీసులు కూడా 'రన్నింగ్ మ్యాన్' అనే పేరిట ఈ వినూత్న ప్రయోగం చేశారు. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ పెద్ద భవనం అండర్ గ్రౌండ్లోని పార్కింగ్ ప్లేస్కు ఓ పోలీసుల కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరుగా పోలీసులు దిగి ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తారు. ఇందులో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. వారు అలా చేస్తున్న సమయంలోనే మరో పోలీసు అధికారి వచ్చి రన్నింగ్ మేన్ పేరిట అదిరిపోయే స్టెప్పులు నాలుగు దిక్కులు తిరుగుతూ వేస్తాడు. డ్యాన్స్, రన్నింగ్ మిక్స్ చేసి పోలీసులు చేసిన ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. తమలాగా ఇంకెవరైనా చేయగలరా అంటూ వారు సవాల్ చేస్తున్నారు. ఒక్క రోజులేనే ఈ వీడియోను 51 లక్షలమంది చూశారు.