సవాళ్ల..సాగు షురూ..!
ఏరువాక సాగరోరన్నా..రైతన్నా అంటూ పాడుకునే రోజులు పోయి...ఈ పోరు బతుకు ఎన్నాళ్లోరన్నా...పుట్టెడు కష్టం తీర్చేదెవరన్నా అని అన్నదాతలు గగ్గోలు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ బద్ధంగా ఏరువాక పున్నమినాడు పొలంపనులకు చలోచలో అంటూ అరకలతో వారు ఉరకలు పెడుతున్నా పంట చేతికొచ్చే నాటికి ఎలా ఉంటుందోననే బెంగే రైతులను వెన్నాడుతోంది. అయినా వ్యవసాయి..శ్రమసాయి కాబట్టి బాధలను దిగమింగుకొని మరో సాగు ఉద్యమానికి సిద్దపడుతున్నాడు. ఆశల పంటకు ఉపక్రమిస్తున్నాడు.
పాలమూరు : ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే పల్లెల్లో ఏటా అన్నదాతలు ఆనందంగా పండుగ జరుపుకునే వా రు.. పంటల పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఎంతో ఘనంగా నిర్వహించే ఏరువాక ఆనందం ఎక్కడా కనిపించడం లేదు. ప్రతికూల పరిస్థితులతో సతమతమవుతున్న అన్నదాతలను పెనుసవాళ్లతో సమీపిస్తున్న ఖరీఫ్ భయపెడుతోంది. రైతుల ఆశలు అన్ని విధాలా ఆవిరవుతున్నాయి... వారి పట్ల అండగా ఉండాల్సిన పాలకులు.. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తుండటంతో ఏరువాక కాస్తా... పోరు వాకగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరిగిన పంటసాగు వ్యయం.. వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులు వెరసి.. వ్యవసాయానికి ఈ ఏడాది సంకట పరిస్థితులు తెచ్చిపెట్టేలా ఉన్నా యి. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలే కాకుండా పంటల సాగు వ్యయం కూడా పెరగడంతో పంటల సాగుపై జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లు అదనపు భా రం పడనుంది. ఇందులో కేవలం ఎరువుల ధరలపైనే రూ.250 కోట్ల వరకు ఖర్చు కానుంది. సాగు వ్యయంతోపా టు, విత్తనాల ధరలు కూడా పెరగడం వల్ల వీటికోసం రూ.150 కోట్ల వరకు వెచ్చించక తప్పదు.
పస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏరువాకకు ముందే జిల్లాలోని రైతులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అలా అని ఎండలకు కాదు.. పెరిగిన ఎరువుల ధరలను, సాగు నీటి వనరులు కల్పించకపోవడంతో... గతేడాదితో పోల్చితే ప్రస్తుతం ఎరువుల ధరలు రెట్టింపు కాగా సాగునీటిని ఖరీఫ్ నాటికి అందిస్తామని ప్రకంటిచినప్పటికీ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం పనులు వేగవంతం చేయడంలేదు. వెరసి ఖరీఫ్‌ను రైతులు కన్నీటితోనే ప్రారంభించనున్నారనేది స్పష్టమవుతోంది.
సాగునీరు అనుమానమే..?
జిల్లాలో సాగునీరందకపోవడం, వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోత కారణంగా పంటసాగుపై రైతాంగం దృష్టి నిలపడంలేదు. రైతులకు మేలు చేస్తామని, వచ్చే ఖరీఫ్ సీజన్‌కల్లా సాగునీటి ని అందిస్తామని పాలకులు ప్రకటించినప్పటికీ అది మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టుల పనులు ఎక్కడా పూర్తికాలేదు. దీంతో ఖరీఫ్‌సాగుకు నీరందే పరిస్థితులు కనబడటంలేదు. మరోవైపు ఇప్పటికే ఎరువుల ధర లు రెట్టింపు కాగా సీజన్ ముగిసే నాటికి ఎంతమేరకు పెరుగుతాయో చెప్పలేమని వ్యవసాయ శాఖ చెబుతోంది.
రైతు కష్టం వృథా...!
రైతు కష్టం వృథా అవుతోంది. పెట్టిన పెట్టుబడి, తినేందుకు గింజలు దక్కితే చాలని మాత్రమే భావించాల్సి వస్తోంది. పంట పూర్తయ్యే నాలుగు నెలల పాటు రైతుతో పాటు వారి కుటుంబ సభ్యులు పడే శ్రమ ఖర్చు నెలకు రూ.12వేల వంతున పంటకాలంపూర్తయ్యే వరకు రూ.48వేలవుతుంది. ఆ మొత్తం కూడా అందక రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
పంటల సాగు ఖర్చు ఇలా..
వరిసాగు చేసే రైతు ఎకరాకు పొలాన్ని దున్నుకునేందుకు, ట్రాక్టర్, కూలీ ఖర్చు రూ.4500, ఎరువులు, రసాయనిక మందులకు రూ.4వేలు, విత్తనాలకు రూ.1600 నాట్లు, కలుపులు, ఇతర అవసరాలకు రూ.4వేలు, కోతకు, నూర్పిడి, ఇతర అవసరాలకు రూ.రెండువేలు ఖర్చవుతుంది.
వరిపంట దిగుబడి ఎకరాకు 18 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, సరాసరిన 10 నుంచి 14 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. ఈ లెక్కన ఎకరాలకు రూ.10 నుంచి రూ.14వేల వరకు ఆదాయం వస్తోంది.
పత్తి పంట సాగుకోసం.. ఎకరా భూమిని చదును చేసేందుకు రూ. 3000,విత్తనాల ఖర్చు రూ.వెయ్యి, కూలీ లు, కలుపు తీసేందుకు, పత్తిగింజలు తీసేందుకు,ఇతర అవసరాల కోసం పం ట మొత్తానికి రూ.17 నుంచి రూ.20 వేలు వరకు ఖర్చవుతుంది. ఖర్చులు పోను ఎకరాకు ఆదాయం రూ.45 నుంచి రూ.55వేల వరకు వస్తోంది.
వేరుశనగ.. ఎకరా పంటసాగుకు విత్తనాలకు రూ.ఐదువేలు, దున్నేందుకు రూ.3వేలు, కలుపు తీసేందుకు రూ.3వే లు, ఎరువులకు రూ.4వేలు, కోతకు రూ.3వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 18 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా, జిల్లా పరిస్థితుల దృష్ట్యా.. సరాసరిన 10 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది, ఎకరా వేరుశనగ పంటకు వచ్చే ఆదాయం రూ.35వేల నుంచి రూ.42వేల వరకు ఉంటుంది.
మొక్కజొన్న సాగుకోసం.. ఎకరా పొలాన్ని దున్నేందుకు రూ.3వేలు, విత్తనాలు రూ.2500, విత్తేందుకు రూ. మూడు వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మొక్కజొన్న పంటకు ఎకరా ఆదాయం రూ.15వేల వరకు వస్తోంది.