వచ్చే ఏడాది కోసం రూసా ప్రతిపాదనలు
21న అన్ని వర్సిటీల వీసీలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి కావాల్సిన నిధులకు సంబంధించి ప్రణాళికలను ఖరారు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రాష్ట్రంలో రూసా అమలుకు నియమించిన ప్రాజెక్టు డెరైక్టరేట్ అధికారులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ వెంకటాచలం, కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్, వివిధ వర్సిటీల రిజిస్ట్రార్లతో చర్చించారు.
ఈ విద్యా సంవత్సరం కోసం రూసా కింద కేంద్రం కేటాయించిన రూ. 130 కోట్ల ప్రగతిని సమీక్షించారు. వచ్చే ఏడాది (2016-17) యూనివర్సిటీల వారీగాచే పట్టాల్సిన విద్యాభివృద్ధి కార్యక్రమాలు, మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఈ నెల 21న ఇందుకోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో అన్ని వర్సిటీలు తమ ప్రణాళికలను అందజేయాలని సూచించారు. వాటిని క్రోడీకరించి స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తారు. సెప్టెంబర్‌లో ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇందులో ప్రత్యేకంగా మహబూబ్‌నగర్‌లో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించే అవకాశం ఉంది.
‘న్యాక్’ గుర్తింపు లేదు.. నిధులు వచ్చేనా?
రూసా కింద వర్సిటీలు, డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్రం నిధులను ఇవ్వాలంటే న్యాక్ గుర్తింపు తప్పనిసరి. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు వర్సిటీకి తప్ప మరే విద్యా సంస్థకు న్యాక్ గుర్తింపు లేదు. గతంలో ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ వర్సిటీలకు న్యాక్ గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం లేదు. రెగ్యులర్ వైస్ చాన్స్లర్లు లేని కారణంగా న్యాక్ గుర్తింపు ఇవ్వలేదు. వచ్చే ఏడాది మాత్రం న్యాక్ గుర్తింపు లేకుండా రూసా నిధులు వచ్చే పరిస్థితి లేదు. దీనిపై నిధులు వస్తాయో లేదో అని అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది.