ఏసీబీ వలలో అవినీతి చేప
మూల్పూరు (అమృతలూరు), న్యూస్‌లైన్: నూతన సంవత్సరంలో లంచం తీసుకుంటున్న జిల్లాస్థాయి అధికారి ఏసీబీ అధికారుల దాడిలో పట్టుబడ్డాడు. గుంటూరులోని ఫిషరీస్ డీడీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న జి.వెంకట్రావు మూల్పూరులో ఒక ఫిషర్మెన్ సొసైటీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రు.15 వేలు (రూ. వెయ్యినోట్లు) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డిఎస్పీ ఆర్.విజయ్‌పాల్ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమృతలూరులో ఏడు గ్రామాలకు చెందిన ఫిషర్మెన్ సభ్యులు 1986లో సొసైటీగా ఏర్పడ్డారు. కాలక్రమంలో గోవాడ, ఇంటూరు, యలవర్రు గ్రామాల సభ్యులు విడిపోయి వేరే సొసైటీగా రిజిస్టర్ చేయించుకున్నారు. 2011లో మూల్పూరు గ్రామ ఫిషర్మెన్ సభ్యులు కూడా విడిపోయి న్యూ ఫిషర్మెన్ సొసైటీ మూల్పూరు పేరుతో రిజిస్టర్ చేయాలని కోరుతూ అధికారులకు అర్జీ అందజేశారు.
సంబంధిత శాఖ కమిషనర్ విచారణ నిమిత్తం అబ్జర్వర్‌గా గూడూరు ఫిషరీస్ ఏడీ నారాయణను నియమించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి స్థానిక ఫిషరీస్ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి జి.రాధాకృష్ణమూర్తి, ఏడీ వెంకట్రావులు కాలయాపన చేస్తూ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని న్యూ ఫిషర్మెన్ సొసైటీ మూల్పూరు అధ్యక్షుడు తమ్మా సుబ్బారావు ఆవేదన చెందారు. సొసైటీ రిజిస్ట్రేషన్ నిమిత్తం సభ్యులకు స్కిల్ టెస్ట్ నిర్వహించాలని, విచారణ ఎలా ఉన్నా రిజిస్ట్రేషన్ చేయడానికి గత నవంబర్ 28న రు.50 వేల లంచం డిమాండ్ చేయడంతో డిసెంబర్ 31న రు.15 వేలు చెల్లించేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
లంచం ఇవ్వడం ఇష్టంలేక తమ్మా సుబ్బారావు గుంటూరులోని ఏసీబీ అధికారులను కలిసి సమాచారం ఇచ్చారు. ఆ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఫిషర్మెన్ సభ్యులకు మూల్పూరులో స్కిల్ టెస్ట్ నిర్వహించిన అనంతరం ఏడీ వెంకట్రావు రైతు సుబ్బారావు వద్ద 15 వెయ్యి రూపాయల నోట్లు తీసుకుంటుండగా ఏసీబీ సీఐలు రవి, శ్రీనివాస్, నాగరాజు, సీతారాంలు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీజీ అనుమతి వచ్చిన వెంటనే నిందితుడ్ని కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు.