జీవితాన్ని మార్చిన పాఠం!
జ్ఞాపకం
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే మాటను నా చిన్నప్పటి నుంచీ వింటున్నాను. అయితే ఆ వాక్యాన్ని నేను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. బాల్యంలో ‘తెలియని తనం’ వల్ల కావచ్చు, యవ్వనంలో ‘పురుషాహంకారం’ వల్ల కావచ్చు. కారణం ఏదైతేనేం... మగవాడినన్న అహం నాలో ఒక పాలు ఎక్కువగానే ఉండేది. ఆ అహం ఎంత చెడ్డదో తర్వాత నాకు అర్థమైంది.
అయిదు సంవత్సరాల క్రితం... నాకు పెళ్లయింది... సునందతో. బాగా చదువుకున్న అమ్మాయి. చక్కని ఉద్యోగం చేస్తోంది. అందంగా ఉంటుంది. అన్ని రకాలుగానూ నాకు తగిన జోడీ. అందుకే చూడగానే ఓకే అన్నాను. ఆనందంగా తన మెడలో తాళి కట్టాను.
ఓ నెలరోజుల పాటు తనే నా లోకం. మా ఇంట్లో కొన్ని రోజులు, వాళ్లింట్లో కొన్ని రోజులు, హనీ మూన్లో కొన్ని రోజులు... అంతా ఆనందంగా గడిచిపోయింది. అంతలో లీవు అయిపోయింది. ఉద్యోగంలో చేరే రోజు వచ్చింది. ఆ రోజు నేను ఆఫీసుకు బయలు దేరుతుంటే సునంద అంది... ‘‘నేనూ ఇవాళ్టి నుంచి ఆఫీసుకు వెళ్లిపోతానండీ.’’
ఆ మాట సూటిగా నా అహం మీద దెబ్బకొట్టింది. మనసులో చిన్న అలజడి. ‘‘ఇంకా ఉద్యోగం ఎందుకు? మానెయ్’’ అన్నాను.
‘‘ఉద్యోగం చేస్తే తప్పేమిటి?’’ అందామె అమాయకంగా.
‘‘తప్పు కాదు... తప్పున్నర. నువ్వు ఉద్యోగం చేస్తున్నావని తెలిస్తే నా ఫ్రెండ్స సర్కిల్లో నా పరువు పోతుంది. అయినా ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకేమిటి? మనకేం తక్కువని?’’... అలుపు లేకుండా గడగడా అనేశాను.
ఆమె ముఖం చిన్నబోయింది. ‘‘తక్కువయ్యి కాదుగా ఉద్యోగం చేసేది’’ అంది తడబడుతూ.
నా అహం మరోసారి అరిచి గోల చేసింది. ‘‘మా ఇళ్లల్లో ఆడవాళ్లెవరూ ఉద్యోగం చేయరు. అందుకే నువ్వూ చేయకూడదు. ఇక ఆ విషయం వదిలెయ్’’ అనేసి మరో మాటకి చాన్స ఇవ్వకుండా వెళ్లిపోయాను.
బహుశా ఆ రోజు తన కళ్లలో నీళ్లు చిప్పిల్లి ఉండవచ్చు. కానీ అది తెలుసు కోవడానికి నేను వెనక్కి తిరిగి తనవైపు చూడలేదు. ఆరోజే కాదు... ఏ రోజూ నేను తనని నాతో సమానంగా చూడ లేదు. నా రెక్కల వెనుక ఉండి జీవించ డమే నీకున్న ఏకైక హక్కు అన్నట్టుగా ప్రవర్తించాను. కానీ నా అహం విరిగి ముక్కలై, నా కళ్లు నేల మీదికి వచ్చే రోజు రానే వచ్చింది.
ఓరోజు మేడ మెట్లు దిగుతూ కాలు జారి పడ్డాను. వెన్నుపూస విరిగింది. చక్రాల కుర్చీకే జీవితం అంకితమైంది.
చేతకాని వాడిలా, చేవలేని వాడిలా మిగిలిపోయాను. అమ్మానాన్నలు వయసుడిగినవాళ్లు. ఏమీ చేయలేరు. నా వైద్యం కోసం అందినకాడల్లా అప్పుడు చేశారు. అది కాస్తా తడిసి మోపెడయ్యింది. నేను వాటిని తీర్చడం కాదు కదా, వాళ్లకి, నా భార్యకి పట్టెడు మెతుకులు కూడా పెట్టలేని పరిస్థితి.
నాలో నేనే కుమిలి పోయాను. ఆ సమయం లోనే నా భార్య నా దగ్గరకు వచ్చింది. ‘‘ఏమండీ... మీకు అభ్యంతరం లేకపోతే నేను ఉద్యోగం చేస్తాను’’ అంది.
ఏం సమాధానం చెప్పను! తన చేతులు పట్టుకుని ఏడ్చేశాను. నా అహం కరిగి కన్నీటితో పాటు జారిపోయింది. ‘ఇందులో మీరు తక్కువగా ఫీలవ్వాల్సిందేం లేదండీ. మీరు బాగున్నప్పుడు నన్ను చూసుకున్నారు. నేను బాగున్నప్పుడు మిమ్మల్ని చూసుకుంటాను. నేను మీలో సగమే కదా’ అంది తను.
అవును. తను నాలో సగమే. కానీ అలా నేను ఎప్పుడూ ఆలోచించలేదే. నేను ఎక్కువ, తను తక్కువ... నాతోడిదే తన బతుకు అనుకున్నాను. కానీ ఆ రోజు తన తోడు లేకుండా నాకు బతుకే లేదని తెలుసుకున్నాను. అహాన్ని వీడి నేడు ఆమె నీడలో హాయిగా జీవిస్తున్నాను.
- ఆర్.వి.సాగర్, విజయనగరం