పునరావాసానికి ఏం చర్యలు చేపట్టారు?
* ఆలూరును సందర్శించి వీడియో రికార్డు సమర్పించండి
* మహబూబ్నగర్ కలెక్టర్, భూసేకరణ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ర్యాలంపాడు రిజర్వాయర్లో భాగంగా నిర్వాసితులవుతున్న మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామస్తుల పునరావాసానికి సంబంధించి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. దాదాపు 1,500 కుటుంబాల పునరావాసం, పరిహారం పంపిణీకి సంబంధించిన రికార్డులతో గురువారం ప్రత్యక్షంగా హాజరుకావాలని కలెక్టర్, స్పెషల్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించింది. అలాగే ఈ ముగ్గురు అధికారులు ఆలూరు గ్రామాన్ని సందర్శించి నిర్వాసితులకు కల్పించిన సౌకర్యాలకు సంబంధించిన వీడియో రికార్డులను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.
పూర్తి పరిహారం చెల్లించకుండా తమను చట్టవిరుద్ధంగా ఊరి నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ హరిజన నాగేష్తోపాటు మరో 224 మంది దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సురేష్కుమార్ ఖైత్ మంగళవారం విచారించారు. నిర్వాసితుల్లో దాదాపు 35 మందికి ఇప్పటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఇతరులకు ప్లాట్లు ఇచ్చిన పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదని, దీంతో వారు ఇళ్లు నిర్మించుకోలేకపోయారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ నివేదించారు. 2005లో ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పుడు పరిహారం ఇస్తున్నారని, ఇప్పుడు ఇస్తున్న డబ్బుతో కనీసం వారు ఇటుకలు కూడా కొనలేని పరిస్థితి ఉందని తెలిపారు.
స్థానిక రెవెన్యూ అధికారులు రూపొందించిన జాబితా ప్రకారం 1450 కుటుంబాలకుగాను 94 గహాల నిర్మాణం మాత్రమే పూర్తయ్యిందని, 150 నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా గ్రామంలోకి నీళ్లు వదిలారని, దీంతో వందలాది కుటుంబాలు రోడ్డునపడాల్సి వచ్చిందని మరో పిటిషనర్ హరిజన్ మల్దకల్ తరఫు న్యాయవాది ఎన్ఎస్.అర్జున్ పేర్కొన్నారు. నిర్వాసితులపట్ల స్థానిక తహసీల్దార్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని, వారి బాధలు చెప్పుకునేందుకు వెళ్తే హైకోర్టు వెళ్లారు కదా.. అక్కడి నుంచే ఆదేశాలు తెచ్చుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని పేర్కొన్నారు.