అప్పుడు అబద్ధం.. ఇప్పుడు ఓటమి.. కన్నీళ్లతో గుడ్‌బై!
తప్పులు.. చేసిన పాపాలు దాగవు. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలూ సాగవు. ఏదో ఒక నాటికి శిక్ష అనుభవించాల్సిందే. అమెరికన్ స్విమ్మర్ ర్యాన్ లోక్టి విషయంలో ఇదే జరిగింది. ఒలింపిక్స్‌లో పన్నెండు మెడల్స్.. 27 ప్రపంచ ఛాంపియన్‌షిష్ టోర్నీలో గెలిచిన ఘనత ఈయనది. కానీ, వరుస విజయాల ట్రాక్ నుంచి పక్కకు తప్పి.. అబద్ధం, తప్పులు, అవమానాల మీదుగా సాగి చివరికి ఓటమితో ఈ దిగ్గజం కెరీర్ ముగింపు దశకు చేరింది.
ర్యాన్ స్టీవెన్ లోక్టి.. అమెరికన్ స్విమ్మర్. ఒకప్పుడు ఛాంపియన్, స్విమ్మింగ్ హీరో. కానీ, తనను తానే పాతాళానికి తొక్కేసుకున్నాడు. తాజాగా టోక్యో ఒలంపిక్స్ కోసం జరిగిన 200 మీటర్ల క్వాలిఫైయింగ్ పోటీల్లో ఏడో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా ఒలంపిక్స్ అర్హతను కోల్పోయాడాయన(తొలి ఇద్దరికి మాత్రమే అవకాశం). ఈ ఓటమి తర్వాత లోక్టి మీడియా ముందుకొచ్చాడు. ఐదు నిమిషాలపాటు ఏకబిగిన కన్నీళ్లు పెట్టుకుని.. మౌనంగా కుటుంబ సభ్యులతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న మరో దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్.. లోక్టిని అడ్డుకుని హత్తుకుని సాగనంపాడు. ఇక లోక్టి ఒలింపిక్స్ కెరీర్ ఇక ముగిసినట్లేనని యూఎస్ స్విమ్మింగ్ అసోషియేషన్ ప్రకటించింది. అయితే ఆయన ఇక మీదట ఏ పోటీల్లోనూ కనిపించకపోవచ్చని అతని గర్ల్‌ఫ్రెండ్ కయ్లా ప్రకటించింది.
తప్పతాగి.. అబద్ధం
2004 ఒలింపిక్స్ ట్రయల్స్‌లో మైకేల్ ఫెల్ప్స్ తర్వాతి ప్లేస్‌లో నిలిచి.. ఏథెన్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో ర్యాన్ లోక్టి పేరు మారుమోగింది. అప్పటి నుంచే ఫెల్ప్స్తో లోక్టి మధ్య ప్రొఫెషనల్ శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాత మెడల్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ విజయాలతో నడుమ లోక్టి కెరీర్ దిగ్విజయంగా సాగింది. ఈత కొట్టే టైంలో ‘యే’ అంటూ అతను అరిచే అరుపు అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే 2016 రియో ఒలింపిక్స్ టైంలో జరిగిన ఘటన అతని ప్రతిష్టను దారుణంగా తొక్కొపడేసింది.
తోటి ప్లేయర్లతో తప్పతాగి ఓ గ్యాస్ స్టేషన్‌కు వెళ్లిన లోక్టి.. అక్కడి సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ఆ స్టేషన్ బయట మూత్రం పోసి, అక్కడి బాత్రూంని ధ్వంసం చేశాడు. ఆ తర్వాతి ఉదయం తుపాకులతో వచ్చిన దుండగులు కొందరు తమను బెదిరించి.. దోపిడీకి పాల్పడ్డారని అబద్ధం చెప్పాడు. దీంతో లోక్టి మీద అందరికీ సానుభూతి మొదలైంది. అయితే ఆటగాళ్ల భద్రత గురించి పలు దేశాలు ఒలింపిక్స్ నిర్వాహకులను ప్రశ్నించాయి. దీంతో కొన్నాళ్లపాటు నిర్వాహకులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తీవ్ర ఎత్తున విమర్శలు రావడంతో అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టగా.. చివరికి లోచ్టె చెప్పిందంతా అబద్ధం అని తేలింది.
వరుస నిషేధాలు
రియో ఘటనలో సెక్యూరిటీ గార్డులకు డబ్బులిచ్చి ఈ వ్యవహారాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు లోక్టిపై వచ్చాయి. ఈ నేరం రుజువు కావడంతో అతని నుంచి పరువు నష్టం దావా కింద భారీ ఫైన్ రాబట్టింది ఒలింపిక్స్ కమిటీ. అంతేకాదు యూఎస్ స్విమ్మింగ్ అసోషియేషన్ 10 నెలల నిషేధం విధించింది. ఇక ఈ వివాదం చల్లారకముందే 2018లో మోతాదుకు మించి డ్రగ్స్ ఉపయోగించాడని ఆంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్ధారించగా.. ఆ కేసులో 14 నెలలపాటు నిషేధానికి గురయ్యాడు.
ఈ వివాదాలన్నింటి తర్వాత రిహాబ్ సెంటర్లో కొన్నాళ్లపాటు గడిపిన లోక్టి.. ఇంకొన్నాళ్లు కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తిరిగి కిందటి ఏడాది మళ్లీ స్విమ్మింగ్ ట్రాక్‌లోకి దిగినప్పటికీ.. మునుపటిలా ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యువ స్విమ్మర్ల మధ్య పోటీలో ఓడిపోయి.. ఆ అవమానాన్ని దిగమింగుకోలేక భావోద్వేగపు పశ్చాత్తాపంతో కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు ఒకప్పటి స్విమ్మింగ్ ఛాంపియన్.