S. Iswaran
-
బాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌కు మరో షాక్.. జీతంలో భారీ కోత
చంద్రబాబు స్నేహితుడు, భారతీయ మూలాలున్న సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఉచ్చులో చిక్కుకున్న ఈశ్వరన్ జీతంలో కోత విధిస్తున్నట్లు తాజాగా సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈశ్వరన్ అవినీతి, అక్రమాస్తులపై దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ ప్రధాని లీసీన్ లూంట్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈశ్వరన్ జీతంలో 82 శాతం కోత విధించినట్లు పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎస్ ఈశ్వరన్ జీతం నెలకు 8,500 డాలర్లకు పరిమితం చేసినట్లు తెలిపారు. బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉంటూ అవినీతికి పాల్పడ్డారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేకపోతున్నానని తెలిపారు. చదవండి: ఇంటిదొంగ – ఈశ్వరన్! ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందేవారిలో సింగపూర్ రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉంటారు. సింగపూర్ ప్రజా సేవల విభాగం 2023 ఏడాది గణాంకాల ప్రకారం ఒక మంత్రికి జీతభత్యంగా నెలకు 41వేల డాలర్లు(సుమారు రూ.34 లక్షలు) చెల్లిస్తారు. అంటే సంవత్సరానికి 8,20,000 డాలర్లు(సుమారు రూ.6.8 కోట్లు) జీతంగా పొందుతారు. ఈశ్వరన్ వేతనం 46,750 సింగపూర్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 29 లక్షలు) కాగా.. 82% తగ్గిన తర్వాత 8,500 సింగపూర్ డాలర్లకు(రూ. 5,24,338) పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణల కేసులో జూలై 11న ఈశ్వరన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సింగపూర్ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఎస్. ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సీపీఐబీ గుర్తించింది. అనంతరం మంత్రి పదవి బాధ్యతల నుంచి ఆయన్ను సింగపూర్ ప్రధాని తప్పించారు. దీంతో బెయిల్‌పై ఉంటూ విచారణకు హాజరవుతున్నారు. అయితే 650 మిలియన్ డాలర్ల కుంభకోణంలో ఈశ్వరన్ ప్రధాన పాత్ర వహించారని విపక్షాల ఆరోపిస్తున్నాయి. చదవండి: ఈశ్వరన్.. అమరావతి స్టార్టప్ ఏరియాలో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ -
చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ‘ఈశ్వరన్’ ఔట్
సాక్షి, అమరావతి: పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సింగపూర్ సీనియర్ మంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్నేహితుడు ఎస్.ఈశ్వరన్‌పై అక్కడి అత్యున్నత దర్యాప్తు సంస్థ సీపీఐబీ (కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) విచారణ ప్రారంభించింది. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సీపీఐబీ గుర్తించింది. అత్యంత తీవ్రమైన అవినీతికి పాల్పడిన మంత్రి ఈశ్వరన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సింగపూర్ ప్రధాని లీని సీపీఐబీ డైరెక్టర్ డెనిస్ టాంగ్ ఈనెల 5న కోరారు. దీనిపై తక్షణమే స్పందించిన సింగపూర్ ప్రధాని ఈనెల 6న అనుమతిచ్చారు. ఈనెల 11న సీపీఐబీ విచారణ ప్రారంభించడంతో ఈశ్వరన్‌ను తాజాగా మంత్రి పదవి నుంచి సింగపూర్ ప్రధాని తప్పించారు. అమరావతి పేరుతో అంతర్జాతీయ నాటకం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాటి సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని సింగపూర్ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై వందిమాగధులకు లీకులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేశారు. ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను ముందు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ అందరినీ మభ్యపుచ్చారు. ఈ క్రమంలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిపి రూ.లక్ష కోట్లు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు. సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం అన్నట్లుగా.. రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టులో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గ్రాస్ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని నాటి చంద్రబాబు కేబినెట్ అంగీకరించింది. ఈ ముసుగులో రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అక్రమాల ఒప్పందం రద్దు.. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ ఒప్పందం రద్దు అయింది. -
మాస్టర్‌ప్లాన్ బాధ్యతలు ప్రైవేటుకే
ఏపీ రాజధానిపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సింగపూర్ ప్రైవేటు కన్సల్టెన్సీలు జురాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా ఇంటర్నేషనల్‌కు బాధ్యతలు ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం రాజధాని తదుపరి మాస్టర్ ప్లాన్ తయారీలో జపాన్ భాగస్వామ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు 3,900 ఎకరాల సమీకరణ.. రాజధాని నిర్మాణ వ్యయంపై స్పష్టమైన అంచనా లేదు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను తమ దేశానికి చెందిన రెండు ప్రైవేటు కన్సల్టింగ్ కంపెనీలకు అప్పగించినట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వెల్లడించారు. జురాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీలు మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తాయని చెప్పారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం మేరకు మాస్టర్ ప్లాన్ తయారీలో ఇంటర్నేషనల్ ఎంటర్ప్రజైస్కు సింగపూర్ ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణం మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధించి సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఈశ్వరన్ మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్ రెండు భాగాలుగా ఉంటుందన్నారు. రాజధాని ప్రాంతం విస్తృతస్థాయి అభివృద్ధి, ప్రాధాన్యతా ప్రాంత అభివృద్ధి అనే రెండు భాగాలు ఉంటాయని చెప్పారు. భారతదేశాన్ని మార్కెట్‌గా చూస్తే.. ఇక్కడ పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున సింగపూర్‌కు ఇదో మంచి అవకాశమని ఈశ్వరన్ పేర్కొన్నారు. తాజా పరిణామ క్రమంలో మరిన్ని సింగపూర్ కంపెనీలు రావడానికి, ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మార్గం ఏర్పడుతుందని అన్నారు. నేడోరేపో తాత్కాలిక రాజధాని ప్రాంతం పేరు ప్రకటన: సీఎం ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని ప్రాంతం పేరును ఒకటీ రెండురోజుల్లో వెల్లడిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాంతంలో మూడు నుంచి మూడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో తాత్కాలిక భవనాలను నిర్మించి నాలుగైదు నెలల్లోనే కొన్ని ముఖ్య కార్యాలయాలను హైదరాబాద్ నుంచి తరలించనున్నట్టు తెలిపారు. అయితే ప్రభుత్వ కీలక శాఖలన్నీ హైదరాబాద్ నుంచే పనిచేస్తాయన్నారు. తాత్కాలికంగా నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో తన కార్యాలయం కూడా ఉంటుందన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌తో సంబంధం లేకుండా తాత్కాలిక పాలన ఏర్పాట్ల కోసం నిర్మించే భవనాల నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం జరిగిన ఒప్పందం రెండు సంస్థల మధ్య కాదని, రెండు ప్రభుత్వాల మధ్యే జరిగిందంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు బాబు జవాబిచ్చారు. ఇప్పటివరకు 3,900 ఎకరాలు సమీకరణ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పుటివరకు 1,799 మంది రైతులు 3,900 ఎకరాలను ప్రభుత్వానికి అప్పజెప్పారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర కొత్త రాజధాని కీలక ప్రాంతం (నగరం) 8 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ జూన్ మొదటి వారానికల్లా పూర్తి చేస్తామని సమీక్షా సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అంగీకరించినట్టు తెలిపారు. మొదటి దశలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించిన ప్రణాళిక ఫిబ్రవరి 15 కల్లా పూర్తవుతుందని, ఏప్రిల్ నెలాఖరుకు కీలక రాజధాని ప్రాంతంగా ఉండే 8 చదర పు కిలోమీటర్ల పరిధిలోని 30 వేల ఎకరాలు గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. జూన్ మొదటి వారానికల్లా ఈ ప్రాంతానికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారవుతుందని చెప్పారు. రాజధానికి సంబంధించిన మిగిలిన ప్రాంత మాస్లర్‌ప్లాన్ తయారీలో భాగం పంచుకునేందుకు జపాన్ ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని చంద్రబాబు వెల్లడించారు. సింగపూర్, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులకు తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ ప్రక్రియ పూర్తి చేస్తాయన్నారు. తెలుగువారి అభీష్టం, ఆకాంక్ష మేర కు ప్రజా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇరువర్గాల ప్రతినిధుల మధ్య ఇది తొలి సమీక్ష సమావేశం మాత్రమేనని, ఇంకా చాలా మేధోమధన సమావేశాలు జరగాల్సి ఉందని చెప్పారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారిస్తామన్నారు. ‘పెట్టుబడులకు జపాన్ సూచనలు, సలహాలు అందజేస్తుంది. సింగపూర్, జపాన్ సలహాలను కలగలిపి ఒక ప్రణాళికతో ముందుకు సాగుతాం. అందరం కలిసి కొత్త రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తయారు చేస్తాం..’ అని చంద్రబాబు వివరించారు. రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టమైన అంచనా లేదని, ప్రస్తుతం ప్లాన్ తయారీ ప్రక్రియలో ఉన్నామని చంద్రబాబు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. మీడియా సమావేశంలో మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు. నేడు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం సాక్షి, విజయవాడ బ్యూరో : కొత్త పరిశ్రమల స్థాపనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం పారిశ్రామికవేత్తలతో విజయవాడలో సమావేశం కానున్నారు. ఇందులో సింగపూర్ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు, విశాఖ-చెన్నై కోస్తా కారిడార్ పరిధిలో పరిశ్రమల స్థాపనకు ముందకొచ్చే వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలు స్థాపించడం ద్వారా సర్కారుకి ఆదాయం, ప్రజలకు ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది.