ఈశ్వరన్ తో కలిసి మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు
ఏపీ రాజధానిపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్
సింగపూర్ ప్రైవేటు కన్సల్టెన్సీలు జురాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా ఇంటర్నేషనల్‌కు బాధ్యతలు
ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం
రాజధాని తదుపరి మాస్టర్ ప్లాన్ తయారీలో జపాన్ భాగస్వామ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఇప్పటివరకు 3,900 ఎకరాల సమీకరణ.. రాజధాని నిర్మాణ వ్యయంపై స్పష్టమైన అంచనా లేదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను తమ దేశానికి చెందిన రెండు ప్రైవేటు కన్సల్టింగ్ కంపెనీలకు అప్పగించినట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వెల్లడించారు. జురాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీలు మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తాయని చెప్పారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం మేరకు మాస్టర్ ప్లాన్ తయారీలో ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్‌కు సింగపూర్ ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.
కొత్త రాజధాని నిర్మాణం మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధించి సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఈశ్వరన్ మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్ రెండు భాగాలుగా ఉంటుందన్నారు. రాజధాని ప్రాంతం విస్తృతస్థాయి అభివృద్ధి, ప్రాధాన్యతా ప్రాంత అభివృద్ధి అనే రెండు భాగాలు ఉంటాయని చెప్పారు. భారతదేశాన్ని మార్కెట్‌గా చూస్తే.. ఇక్కడ పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున సింగపూర్‌కు ఇదో మంచి అవకాశమని ఈశ్వరన్ పేర్కొన్నారు. తాజా పరిణామ క్రమంలో మరిన్ని సింగపూర్ కంపెనీలు రావడానికి, ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మార్గం ఏర్పడుతుందని అన్నారు.
నేడోరేపో తాత్కాలిక రాజధాని ప్రాంతం పేరు ప్రకటన: సీఎం
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని ప్రాంతం పేరును ఒకటీ రెండురోజుల్లో వెల్లడిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాంతంలో మూడు నుంచి మూడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో తాత్కాలిక భవనాలను నిర్మించి నాలుగైదు నెలల్లోనే కొన్ని ముఖ్య కార్యాలయాలను హైదరాబాద్ నుంచి తరలించనున్నట్టు తెలిపారు. అయితే ప్రభుత్వ కీలక శాఖలన్నీ హైదరాబాద్ నుంచే పనిచేస్తాయన్నారు. తాత్కాలికంగా నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో తన కార్యాలయం కూడా ఉంటుందన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌తో సంబంధం లేకుండా తాత్కాలిక పాలన ఏర్పాట్ల కోసం నిర్మించే భవనాల నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం జరిగిన ఒప్పందం రెండు సంస్థల మధ్య కాదని, రెండు ప్రభుత్వాల మధ్యే జరిగిందంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు బాబు జవాబిచ్చారు.
ఇప్పటివరకు 3,900 ఎకరాలు సమీకరణ
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పుటివరకు 1,799 మంది రైతులు 3,900 ఎకరాలను ప్రభుత్వానికి అప్పజెప్పారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర కొత్త రాజధాని కీలక ప్రాంతం (నగరం) 8 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ జూన్ మొదటి వారానికల్లా పూర్తి చేస్తామని సమీక్షా సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అంగీకరించినట్టు తెలిపారు.
మొదటి దశలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించిన ప్రణాళిక ఫిబ్రవరి 15 కల్లా పూర్తవుతుందని, ఏప్రిల్ నెలాఖరుకు కీలక రాజధాని ప్రాంతంగా ఉండే 8 చదర పు కిలోమీటర్ల పరిధిలోని 30 వేల ఎకరాలు గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. జూన్ మొదటి వారానికల్లా ఈ ప్రాంతానికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారవుతుందని చెప్పారు. రాజధానికి సంబంధించిన మిగిలిన ప్రాంత మాస్లర్‌ప్లాన్ తయారీలో భాగం పంచుకునేందుకు జపాన్ ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని చంద్రబాబు వెల్లడించారు.
సింగపూర్, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులకు తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ ప్రక్రియ పూర్తి చేస్తాయన్నారు. తెలుగువారి అభీష్టం, ఆకాంక్ష మేర కు ప్రజా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇరువర్గాల ప్రతినిధుల మధ్య ఇది తొలి సమీక్ష సమావేశం మాత్రమేనని, ఇంకా చాలా మేధోమధన సమావేశాలు జరగాల్సి ఉందని చెప్పారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారిస్తామన్నారు.
‘పెట్టుబడులకు జపాన్ సూచనలు, సలహాలు అందజేస్తుంది. సింగపూర్, జపాన్ సలహాలను కలగలిపి ఒక ప్రణాళికతో ముందుకు సాగుతాం. అందరం కలిసి కొత్త రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తయారు చేస్తాం..’ అని చంద్రబాబు వివరించారు. రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టమైన అంచనా లేదని, ప్రస్తుతం ప్లాన్ తయారీ ప్రక్రియలో ఉన్నామని చంద్రబాబు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. మీడియా సమావేశంలో మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు.
నేడు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం
సాక్షి, విజయవాడ బ్యూరో : కొత్త పరిశ్రమల స్థాపనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం పారిశ్రామికవేత్తలతో విజయవాడలో సమావేశం కానున్నారు. ఇందులో సింగపూర్ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు, విశాఖ-చెన్నై కోస్తా కారిడార్ పరిధిలో పరిశ్రమల స్థాపనకు ముందకొచ్చే వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలు స్థాపించడం ద్వారా సర్కారుకి ఆదాయం, ప్రజలకు ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది.