తిట్టు కాదు వ్యంగ్యమే.. జైపాల్‌రెడ్డి
‘శుంఠ’ వ్యాఖ్యలపై జైపాల్ వివరణ
ఆ పదాన్ని ఉపసంహరించుకుంటున్నా
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర నేతలను ‘శుంఠ’లుగా అభివర్ణిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘ప్రకాశం పంతులు అపార దేశభక్తిని, పట్టాభి సీతారామయ్య పాండిత్యాన్నీ శ్లాఘిస్తూ.. పండిత పుత్ర పరమ శుంఠ అనే సామెతను దృష్టిలో పెట్టుకొని వ్యంగ్య ధోరణిలో మాత్రమే నేను శుంఠ అనే పదం వాడాను. నేటి సీమాంధ్ర నాయకులు తెలంగాణ చారిత్రక అనివార్యతను గుర్తించలేకపోతున్నారనేదే నా ఆవేదన. ఆ వ్యంగ్యాన్ని తిట్టుగా చిత్రీకరించారు. ఆ పదాన్ని ఉపసంహరించుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారంటూ తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి ఈ నెల 11న హైదరాబాద్‌లో జరిగిన ఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై సీమాంధ్ర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ మేరకు ఆయన సోమవారమిక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు.