అవి‘నీటి’ జలగలు
అన్ని మాఫియాల్లాగే నీటి మాఫియా కూడా తెలంగాణ రాజధానిలో మూడు పూవులు ఆరుకాయలుగా విస్తరించినా అధికారులు మాత్రం మత్తులో జోగుతూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఈ అవి‘నీటి’ వ్యాపారం విలువ అక్షరాలా 300 కోట్ల రూపాయలు. రాజధానిలో ఎక్కడ పడితే అక్కడ యథేచ్చగా బోర్లు వేసి అక్రమంగా నీటిని అమ్మేసుకుంటున్నారు. వేసవి వచ్చిందంటే వాళ్లకు పండుగలాగా అవు తోంది. ఒక చట్టం అంటూ లేనేలేదు. నియమనిబంధనలు గాలికి వదిలి జంటనగరాల్లో సామాన్య ప్రజల నీటి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఈ నీటి వ్యాపారం జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే జలమం డలిలోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకునే నాధుడే లేకపోవడం గమనార్హం. కొంత మంది ఎందుకొచ్చిన తంటా అని ఎక్కువ రేటుకు కొనుక్కుంటూ అలాగే ఇబ్బందిపడుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా ఈ అక్రమ నీటి వ్యాపారాన్ని మాత్రం అరికట్టలేకపోవడంతో, అటు జలమండలి అధికారులు ఇటు ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యా యి. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం అక్రమ నీటి మాఫియాపై ఉక్కు పాదం మోపి నీటి వ్యాపారానికి పూర్తిగా అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎస్. పద్మావతి వివేక్‌నగర్, హైదరాబాద్