ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించండి
హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాథమికోన్నత పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండితులు, పీఈటీలకు ఓటు హక్కు కల్పించాలని మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి జే.రమేష్‌లు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉన్నత పాఠశాలలో పనిచేసే వారికి ఓటుహక్కు కల్పించిన ప్రభుత్వం ఒకే డీఎస్సీ, ఒకే విద్యార్హతతో నియమితులైన ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లకు ఓటు హక్కు కల్పించకపోవడం సమంజసం కాదన్నారు. వీరికి కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాల్సిందిగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వీరు విజ్ఞప్తి చేశారు.