ఎస్4ఏ స్కీము నిబంధనలు సడలించండి
మొండిబాకీలపై ఆర్బీఐని కోరిన బ్యాంకులు
ముంబై: మొండి బాకీల సత్వర పరిష్కారానికి ఉద్దేశించిన ఎస్4ఏ స్కీములో కొన్ని నిబంధనలు సడలించాలని రిజర్వు బ్యాంకును పలు బ్యాంకులు కోరాయి. ప్రమోటర్ల వ్యక్తిగత పూచీకత్తు వంటి నిబంధనల నుంచి మినహాయింపునివ్వాలని అభ్యర్థించాయి. అలాగే రీపేమెంట్ షెడ్యూల్‌ను పొడిగించేందుకు, స్కీము కింద వడ్డీ రేటును తగ్గించేందుకు అనుమతించాలని కోరాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఆచరణీయ పథకం (ఎస్4ఏ) మార్గదర్శకాల్లో ఇలాంటి వెసులుబాటు లేదు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ స్కీమును అమలు చేయదల్చుకున్న పక్షంలో బ్యాంకర్ల ఫోరం ప్రమోటర్ల నుంచి వ్యక్తిగత పూచీ తీసుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్‌తో జరిగిన సమావేశంలో బ్యాంకర్లు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మంగళవారం జరిగిన సమావేశంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యాంకుల అధిపతులు పాల్గొన్నారు. ‘‘ఆయా సంస్థలపై ఒత్తిడి పెరగడానికి గల కారణాలు ప్రమోటర్ల పరిధిలో లేనివి, అలాంటప్పుడు వారి వ్యక్తిగత పూచీకత్తు డిమాండ్ చేయడం సాధ్యపడదు. ముఖ్యంగా లిస్టెడ్ కంపెనీల విషయంలో అస్సలు కుదరదు. కాబట్టి ఈ నిబంధనను తొలగించాలి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.