SAARC conference
-
ఆ విందులో పాల్గొనకుండానే భారత్‌కు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ హోంమంత్రి చౌదరి నిస్సార్ ఆలీఖాన్ ఏర్పాటుచేసిన విందులో పాల్గొనకుండానే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ తిరిగి వచ్చారు. ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన 7వ సార్క్ హోంమంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజ్‌నాథ్.. ఈ విందుకు హాజరుకాలేదు. సార్క్ సదస్సులో పాల్గొంటున్న విదేశీ అతిథుల గౌరవార్థం నిస్సార్ ఆలీఖాన్ ఈ విందును ఏర్పాటుచేశారు. అయితే, ఆయనే స్వయంగా ఈ విందులో పాల్గొనకుండా.. సార్క్ సమావేశం ముగిసిన వెంటనే వెళ్లిపోయారు. ఆతిధ్యం ఇస్తున్న వ్యక్తే లేకపోవడంతో రాజ్‌నాథ్ ఈ విందులో పాల్గొనరాదని నిర్ణయించారు. అనంతరం నేరుగా హోటల్‌కు వెళ్లి అక్కడ భారతీయ ప్రతినిధులతో కలిసి రాజ్‌నాథ్ భోజనం చేశారు. అనంతరం నేరుగా ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. సార్క్ సమావేశంలో రాజ్‌నాథ్ ప్రసంగం ప్రసారం చేయకుండా పాక్ దుందుడుకుగా వ్యవహరించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, భారత్ మాత్రం ఇస్లామాబాద్‌లో రాజ్‌నాథ్ ప్రసంగం ప్రసారం కాకుండా అడ్డుకున్నారని వచ్చిన కథనాలను తోసిపుచ్చింది. -
పాకిస్తాన్ పర్యటనకు రాజ్ నాథ్
ఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉగ్రవాదుల హెచ్చరికలు, నిరసనలను బేఖాతరు చేస్తూ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్తాన్లో జరిగే సార్క్ సమావేశాల్లో రాజ్‌నాథ్ పాల్గొంటారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ సాయం, భారత నకిలీ కరెన్సీ నియంత్రణ తదితర విషయాలను ఈ సదస్సులో లేవనెత్తనున్నారు. కాగా రాజ్ నాథ్ పాక్ పర్యటనను ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. పాక్‌లో రాజ్‌నాథ్ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాయి. రాజ్ నాథ్ పర్యటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని జమాత్-ఉద్-దావా చిఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో రాజనాథ్ పర్యటన టెన్షన్‌గా మారింది. కాగా రాజ్‌నాథ్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత పాక్ ప్రభుత్వానిదేనని హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఇటీవల రాజ్యసభలో చెప్పారు.