రాజ్ నాథ్ స్పీచ్ ప్రసారానికి పాక్ బ్రేక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: సార్క్ సమావేశాల్లో హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగం ప్రసారం కాకుండా పాకిస్తాన్ అడ్డుకుంది. ఆయన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి పాకిస్తాన్ ప్రైవేటు మీడియా, భారత్ మీడియాకు కూడా అనుమతినివ్వలేదు. సార్క్ సమావేశాల్లో రాజ్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై గట్టి వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి మద్దతుగా ఉన్న దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
టెర్రిరిస్టులను అమరవీరులుగా పేర్కొనకూడదని రాజ్ నాథ్ సూచించారు. మంచి టెర్రరిజం, చెడు టెర్రరిజం అనే భేదాలు లేవని.. టెర్రరిజం టెర్రరిజమేనని అన్నారు. డిజిటల్ టెక్నాలజీని సరిగా ఉపయోగించలేకపోవడం వల్లే టెర్రరిజం పెరుగుతూ పోతోందని వ్యాఖ్యానించారు. కాగా, సార్క్ సమావేశానికి హజరైన పాకిస్తాన్ మంత్రి చౌదరి నసీర్ అలీ ఖాన్ తో రాజ్నాథ్ కరచాలనం మాత్రమే చేశారు.
అంతకుముందు ఇస్లామాబాద్ లో సెరెనా హోటల్ జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మంత్రులను ఆహ్వానించేందుకు ఖాన్ గుమ్మం బయట నిలబడ్డారు. రాజ్ నాథ్ హోటల్ లోకి వెళ్లేటప్పుడు ఆయన కరచాలనంతో సరిపెట్టారు. మధ్యాహ్నం జరిగిన విందుకు కూడా ఇద్దరు నేతలు హాజరుకాలేదు. సార్క్ సమావేశం పూర్తి కావడంతో రాజ్ నాథ్ తిరిగి భారత్ కు పయనమయ్యారు. సార్క్ సమావేశంలో రాజ్ నాథ్ ప్రసంగాన్ని ప్రసారం చేసేందుకు వెళ్లిన మీడియాను అడ్డుకోవడంతోనే పాకిస్తాన్ ఎంతటి ప్రజాస్వామ్య దేశమో అర్ధమవుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.