శక్తిని తగ్గనివ్వదు... ఏజ్‌ని పెరగనివ్వదు!
కొబ్బరిలో కొవ్వు ఎక్కువే. నెయ్యిలో ఉన్నట్లుగా దీనిలోనూ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కానీ సాధారణంగా శాచ్యురేటెడ్ చేసినంత హానిని కొబ్బరిలోని కొవ్వులు చెయ్యవు. కొబ్బరిలో 61 శాతం డైటరీ ఫైబర్ ఉంటుంది. అది ఒంట్లోకి చక్కెరను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. కాబట్టి కొబ్బరి డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని కొందరు న్యూట్రిషన్ నిపుణులు చెబుతుంటారు. పైగా చక్కెరనూ, తియ్యదనాన్ని ఆస్వాదించాలనే భావనను (గ్లైసిమిక్ క్రేవింగ్‌ను) కొబ్బరి తగ్గిస్తుంది. కొబ్బరి తినడం వల్ల మరింత తీపి తినాలనే భావన తగ్గుతుంది కాబట్టి కొబ్బరి డయాబెటిస్ ముప్పును తప్పిస్తుందన్నది న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ.
కొబ్బరిలోని సైటోకైనిన్స్, కైనెటిన్, ట్రాన్స్ జీటిన్ అనే అంశాలు వయసును తగ్గిస్తాయి. దీర్ఘకాలం యౌవనంగా ఉండాలంటే కొబ్బరి తినడం మేలు. కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలం. కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది. కొబ్బరిని ఎక్కువగా వాడేవారికి గొంతు ఇన్ఫెక్షన్లు, బ్రాంకైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన రావు. కొబ్బరి తిన్నప్పుడు ఆ కొవ్వుల వల్ల ఆకలి అంతగా అనిపించదు. అందుకే కొబ్బరి తినే వారిలో ఆకలి తగ్గడంతోపాటు తినే కోరిక కూడా తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఆరోగ్యవంతమైన మార్గం.