Sad atmosphere
-
‘బతుకమ్మ’... బలిగొంది..
బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని, బతుకమ్మ చీరలే బలిగొన్నాయా...? ఆ చీరెలకు, ఈ ప్రమాదానికి సంబంధమేమిటి..? అసలేం జరిగిందంటే.... సాక్షి, పెనుబల్లి: మహిళలను ట్రక్కులో ఎక్కించుకొని వెళ్ళుతున్న బొలేరో వ్యాను అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా , ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన పెనుబల్లి మండల పరిధిలోని మండాలపాడు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన ఎనిమిదిమంది మహిళలు సత్తుపల్లి వెళ్లేందుకని బుధవారం ఉదయం విఎంబంజర్ వచ్చారు. అంతలోనే, హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లావైపు బొలేరో వెళుతోంది. హైదరాబాద్‌లో కొబ్బరి బోండాలను అన్లోడ్ చేసి వస్తున్న ఈ వాహనంలో ఆ ఎనిమిదిమంది మహిళలు ఎక్కారు. పెనుబల్లి మండలంలోని మండాలపాడు వద్ద, వ్యాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో, ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న భూక్యా రాంలీ(35), తేజావత్ రుక్మిణి(50) అక్కడికక్కడే మృతిచెందారు. దారవత్ లక్ష్మి, తేజావత్ అరుణ్, అజ్మీర పద్మ, తేజావత్ లలిత, తేళ్ళూరి వరలక్ష్మి, తోట అంజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆటోలలో పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. సత్తుపల్లి ఎందుకు వెళుతున్నారంటే... ఈ ఎనిమిదిమంది మహిళలు నిరుపేదలు. బతుకమ్మ పండగ సందర్భంగా వీరికి ప్రభుత్వం చీరెలు పంపిణీ చేసింది. ఇవి నాసిరకంగా ఉండడంతో అనేకమంది ఇష్టపడలేదు. కొందరు మాత్రం.. పట్టరాని కోపంతో ఆ చీరెలను 2017, సెప్టెంబర్ 18న రోడ్డుపై వేసి నిప్పంటించారు. వియంబంజర్ పోలీసులకు ఇది ‘నేరం’గా, ‘ఘోరం’గా అనిపించింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సత్తుపల్లి కోర్టులో విచారణ సాగుతోంది. బుధవారం రోజున కోర్టు వాయిదా ఉండటంతో, కేసుతో సంబంధమున్న ఈ ఎనిమిదిమంది మహిళలు సత్తుపల్లికి బొలేరో వాహనంలో బయల్దేరారు. ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే సండ్ర చొరవ... ప్రమాద వార్త తెలియగానే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పందించారు. క్షతగాత్రులను పెనుబల్లి ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం వైద్యశాలకు తరలించేంత వరకు పోలీసులతో, పెనుబల్లి వైద్యులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఖమ్మం ఆసుపత్రికి క్షతగాత్రులు చేరుకున్న తరువాత, అక్కడి వైద్యులతోనూ ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాద స్థలాన్ని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, సత్తుపల్లి రూరల్ సీఐ టి.రవికుమార్, వియంబంజర్ ఎస్సై తోట నాగరాజు పరిశీలించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసును ఎస్సై తోట నాగరాజు నమోదు చేశారు. ఊపిరందిస్తా... కాపాడుకుంటా... పెనుబల్లి: ఈ ప్రమాదంలో, తలకు తీవ్ర గాయాలవడంతో భూక్యా రామ్లీ(35) అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాద వార్త చెవిన పడడంతోనే ఆమె భర్త భూక్యా రాము, పరుగు పరుగున ప్రమాద స్థలానికి వచ్చాడు. రోడ్డు పక్కన అచేతనంగా పడిపోయిన తన భార్య రామ్లీని చూసి చలించాడు. ఆమెకు ఊపిరి అందడం లేదనుకున్నాడేమో...! ఆమెను తన ఒడిలోకి తీసుకుని, తన నోటితో ఊదుతూ శ్వాసను అందించేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని అక్కడున్న పోలీసులు, స్థానికులు చెప్పినప్పటికీ నమ్మలేకపోయాడు. కొద్దిసేపటి వరకు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఆ తరువాత కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ దృశ్యం... చూపరులకు కూడా కంట తడి పెట్టించింది. -
తప్పిన ముప్పు
విజయవాడ(లబ్బీపేట) : సమయం : మధ్యాహ్నం 12.40 గంటలు...ఆస్పత్రిలోని వైద్యులు తమ విధుల్లో బిజీగా ఉన్నారు. వార్డుల్లోని రోగులు భోజనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆస్పత్రిలో జరుగుతున్న అగ్ని ప్రమాదంపై సిబ్బందిని హెచ్చరిస్తూ ఫైర్(స్మోక్) అలారం మోగింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్ నుంచి దట్టమైన పొగ వ్యాపిస్తూ ఆస్పత్రి భవనాన్ని కమ్మేసింది. ఫైర్ ఫైటింగ్లో శిక్షణ పొందిన సిబ్బంది అప్రమత్తమై నిమిషాల వ్యవధిలో నాలుగో అంతస్తులోని ఐసీయూ, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో ఉన్న రోగులకు బయటకు తీసుకువచ్చారు. వారికి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తమ వంతు సహకారం అందించారు. అంతా అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇవీ మంగళవారం మధ్యాహ్నం విజయవాడ సెంటినీ ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాద ఘట్టాలు.. ఈ ఆస్పత్రికి ఎన్ఏబీహెచ్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పటల్స్) గుర్తింపు ఉండడంతో ఫైర్ఫైటింగ్లో శిక్షణ పొందిన సిబ్బంది అక్కడే ఉంటారు. ఫైర్ అలారం హెచ్చరికతో ఫైర్‌ఫైటింగ్ సిబ్బంది, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో 51 మంది ఇన్‌పేషెంట్స్ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 51 మంది ఇన్‌పేషెంట్స్ ఉన్నారు. మరో వంద మందికిపైగా అవుట్‌పేషెంట్స్ ఉన్నారు. ప్రమాదం విషయం తెలి సిన వెంటనే ఐసీయూ నుంచి రోగులను బయటకు తీసుకు రాగా, రూమ్‌లలో ఉన్న రోగులు తమంతటా తాముగా బయటకు వచ్చేశారు. ఆస్పత్రి బయట రోగులు, వారి బంధువులతో విషాద వాతావరణం నెలకొంది. రోగులు అగ్నిప్రమాదం సమాచారాన్ని తమ బంధువులకు తెలియజేయగా, ఏం జరిగిందోనని ఆతృతగా పలువురు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వేర్వేరు ఆస్పత్రులకు తరలింపు ... ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్స్‌గా చికిత్స పొందుతున్న రోగులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆయుష్, రమేష్ హాస్పటల్స్‌కు తరలించారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి వైద్యులు సైతం వారి వెంట ఆయా ఆస్పత్రులకు వెళ్లారు. ఆస్పత్రి అద్దాలు పగలగొట్టి..... విద్యుత్‌షార్ట్ సరŠుక్యట్ కారణంగా ఆస్పత్రి భవనం అంతా దట్టమైన పొగ వ్యాప్తి చెందడంతో భవనం లోపలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయానికే రోగులంతా బయటకు వచ్చేశారు. దీంతో పలువురు పోలీసులు, ఫైర్ సిబ్బంది వెనుక వైపున ఉన్న మెట్ల ద్వారా వెళ్లి అద్దాలను పగలగొట్టారు. దీంతో పొగబయటకు రావడంతో కొంత మేర పరిస్థితి చక్కబడింది. అనంతరం ఆస్పత్రిలోని వార్డులన్నీ కలయతిరిగి రోగులు ఎవరైనా ఉన్నారేమోనని పరిశీలించారు. ఎవరూ లేక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదంపై మంత్రి ఆరా సెంటినీ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా తీసినట్లు తెలిసింది. ఆ సంఘటనపై వివరాలు సేకరించాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా ఆస్పత్రి అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గద్దే రామ్మోహన్ ఆస్పత్రికి వచ్చి రోగుల గురించి ఆరా తీశారు. అందరినీ క్షేమంగా తరలించినట్లు అక్కడి అధికారులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. పెనుప్రమాదం తప్పింది ఆస్పత్రిలోని ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్ వెనుక విద్యుత్ షార్ట్ సరŠుక్యట్ కారణంగా దట్టమైన పొగవ్యాప్తి చెంది నట్లు గుర్తించాం. ఎలాంటి మంటలు వ్యాప్తి చెందకుండా పొగమాత్రమే వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో అప్రమత్తమై రోగులను బయటకు తరలించడంతో ప్రమాదం తప్పింది. – ఎ. శ్రీనివాసరెడ్డి,అగ్నిమాపక అధికారి వెంటనే అప్రమత్తమయ్యాం అందరం పనిలో బిజీగా ఉండగా, ఆస్పత్రి ఫైర్ అలారం మోగింది. గదిలో నుంచి బయటకు వచ్చేసరికి పొగ వ్యాపిస్తోంది. దీంతో వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాం. తొలుత ఐసీయూలో, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో ఉన్న వారిని బయటకు తీసుకు వచ్చాం. కొందరు రోగులు తమంతట తాముగా వచ్చేశారు. అంబులెన్స్‌లలో వేర్వేరు ఆస్పత్రులకు తరలించగలిగాం. రోగులకు ఎలాంటి హాని జరగకుండా చూడగలిగాం. – మధుసూదన్,ఆస్పత్రి హెచ్ఆర్ మేనేజర్ -
అస్త్రమై...అగ్నివై!
తమ స్ఫూర్తి ప్రదాత కలాం ఇకలేరని తెలిసి... కలత చెందిన హృదయాలు కన్నీటిని వర్షించాయి. కోటి ఆశలతో రేపటి వైపు నడిపిస్తూ...మాటల స్ఫూర్తి మంత్రాలను గుండెలపై చెక్కి... ఆత్మస్థైర్యమనే అస్త్రాన్ని అందించిన గురుదేవుడు మరి రాడని తెలిసి యువతరం విషాదంలో మునిగిపోయింది. ఆ మహనీయుడి కలల సాకారానికి కృషి చేస్తామని ప్రతిన బూనింది. ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతుల కాంతిలో ముందుకు సాగుతామని దీక్షబూనింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు భాగ్యనగరి ఘన నివాళులర్పించింది. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంది. విజయ కాంక్ష రగిల్చే ‘అగ్ని’లా యువ హృదయాల్లో ఆయన స్థానం సుస్థిరమని శ్లాఘించింది. - నగరమంతటా విషాద వాతావరణం - అబ్దుల్ కలాంకు నివాళులర్పించిన జనావళి - విద్యా సంస్థలకు సెలవు - డీఆర్డీఎల్లో సైంటిస్టుల నివాళులు సాక్షి, సిటీబ్యూరో/సంతోష్ నగర్: మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మరణ వార్తతో మంగళవారం నగరమంతటా విషాద వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు, అభిమానులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో నగరంలోని అన్ని స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు సైతం తెరచుకోలేదు. కోట్లాది మంది విద్యార్థులు, యువతపై కలాం చూపిన ప్రభావాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. నగరంలోని అన్ని ప్రధాన కూడ ళ్లలో ఆ దార్శనికుడి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలాంకు నివాళులర్పించాయి. సెంట్రల్ యూనివ ర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర మహిళా సభ తదితర విద్యాసంస్థల ప్రాంగణాలు కలాం జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాయి. విద్యార్థి లోకం దుఃఖ సాగరమైంది. అంతటా ఆయనే... వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లోనూ కలాంకు నివాళులర్పించారు. నాంపల్లి, బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రుల్లో వైద్యులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అబిడ్స్, బొల్లారం, బోయిన్పల్లి, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఇందిరా పార్కు, బాగ్‌లింగంపల్లి, చిక్కడపల్లి, తార్నాక, ఈసీఐఎల్, చాంద్రాయణగుట్ట, అమీర్‌పేట్, పంజగుట్ట, కూకట్పల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, లాల్‌దర్వాజ, తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ఆస్పత్రుల సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఈ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కలాంకు నివాళులర్పించారు. సాంస్కృతిక శాఖ నివాళి... సాక్షి, సిటీబ్యూరో: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు భాషా సాంస్కృతిక శాఖ, రవీంద్రభారతి సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కార్యాలయం ప్రారంభ సమయంలో అబ్దుల్ కలాంకు నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ భారతదేశం ఆదర్శవంతమైన మేధావిని కోల్పోయిందన్నారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. భారతీయత అంటే కలాం గుర్తుకు వస్తారన్నారు. దేశం కోసం జీవితం అంకితం చేసిన మహోన్నత మూర్తి ఇకలేరనే విషయం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. కలాం జీవనశైలి నేటి తరం యువతకి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన ఆశయాలు నేటి తరం కొనసాగించాలని చెప్పారు. ఆదర్శనీయుడు అబ్దుల్ కలాం: ఫ్రొ.కోదండరాం అమీర్‌పేట: సాధారణ కుటుంబంలో పుట్టి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం మరణం దురదృష్టకరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సనత్‌నగర్ హిందూ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన అబ్దుల్ కలాం సంతాపసభకు ఆయన హాజరై మాట్లాడారు. పేపర్‌బాయ్‌గా పనిచేసి, వీధి దీపాల కింద చదువుకుని పైకి వచ్చిన అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయుడన్నారు. చాలామంది శాస్త్రవేత్తలు తనకు పేరు రావాలని కోరుకుంటారని, కానీ అబ్దుల్‌కలాం మాత్రం తనతోపాటు టీంకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఆకాంక్షించే వారని చెప్పారు. అబ్దుల్‌కలాం చనిపోయారంటే కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినంత బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్ ద్వారకానాథ్, స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్ బి.శ్యాంసుందర్‌గౌడ్, ఉపాధ్యక్షులు చంద్రకళాయాదవ్, సభ్యులు త్రిపాఠి, హిందూ కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌రావు, రాధిక అధ్యాపక సిబ్బంధి పాల్గొన్నారు. చిరస్మరణీయుడు కంచన్‌బాగ్‌లోని కేంద్ర రక్షణ సంస్థ డీఆర్డీఎల్లో సంతాప సభ నిర్వహించారు. డీఆర్డీఎల్ డెరైక్టర్ డాక్టర్ జయరామన్, రిటైర్డ్ డెరైక్టర్లు, శాస్త్రవేత్తలు సిబ్బంది కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. డీఆర్డీఎల్ డెరైక్టర్‌గా పని చేసిన అబ్దుల్ కలాంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. అబ్దుల్ కలాం డీఆర్డీఎల్కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడని డెరైక్టర్ జయరామన్ కొనియాడారు. డీఆర్డీఓ టౌన్‌షిప్‌ను ఉద్యోగులు కలిసి ఉండేలా ఏర్పాటు చేసిన ఘతన ఆయనకే దక్కుతుందన్నారు. పాఠశాల విద్యార్థులు, పచ్చదనం అంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. డీఆర్డీఓ ఆస్పత్రి స్థల సేకరణకు ఎంతో కృషి చేశారని ఉద్యోగులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఎల్ రిటైర్డ్ డెరైక్టర్లు డాక్టర్ ఎ.కె. చక్రవర్తి, డాక్టర్ పన్నీర్ సెల్వం, ఉద్యోగులు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరితో కలివిడిగా... కార్మికులందరితో కలిసి మెలిసి ఉంటూ పని చేసేవారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. నా వివాహానికి ఆహ్వానించాను. తప్పకుండా వస్తానని తెలిపారు. అనంతరం వివాహం రోజు రాలేకపోయానని టెలిగ్రాం పంపించారు. నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. - కె.శివకుమార్, డీఆర్డీఎల్ ఫైర్ ఆఫీసర్ క్షిపణి రూపకల్పనలో ఆయనతో పని చేశా 1991లో అగ్ని క్షి పణి రూపకల్పనలో ఆయనతో పాటు పని చేశాను. అంధులు, వికలాంగులపై దయతో ఉండేవారు. డీఆర్డీఎల్లో పచ్చదనం కోసం పాటు పడేవారు. - నూరుద్దీన్ అహ్మద్, డీఆర్డీఎల్ టెక్నికల్ ఆఫీసర్ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు డీఆర్డీఎల్ డెరైక్టర్‌గా పని చేసే సమయంలో ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి ఆయన ఎంతగానో కృషి చేసేవారు. ఉద్యోగుల యోగ క్షేమాలను తెలుసుకునేవారు. యూనియన్ నాయకులతో స్నేహపూర్వకంగా ఉండేవారు. - సురేష్ బాబు, డీఆర్డీఎల్ ఏఐడీఈఎఫ్ అధ్యక్షులు