అస్త్రమై...అగ్నివై!
తమ స్ఫూర్తి ప్రదాత కలాం ఇకలేరని తెలిసి... కలత చెందిన హృదయాలు కన్నీటిని వర్షించాయి. కోటి ఆశలతో రేపటి వైపు నడిపిస్తూ...మాటల స్ఫూర్తి మంత్రాలను గుండెలపై చెక్కి... ఆత్మస్థైర్యమనే అస్త్రాన్ని అందించిన గురుదేవుడు మరి రాడని తెలిసి యువతరం విషాదంలో మునిగిపోయింది. ఆ మహనీయుడి కలల సాకారానికి కృషి చేస్తామని ప్రతిన బూనింది. ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతుల కాంతిలో ముందుకు సాగుతామని దీక్షబూనింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు భాగ్యనగరి ఘన నివాళులర్పించింది. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంది. విజయ కాంక్ష రగిల్చే ‘అగ్ని’లా యువ హృదయాల్లో ఆయన స్థానం సుస్థిరమని శ్లాఘించింది.
- నగరమంతటా విషాద వాతావరణం
- అబ్దుల్ కలాంకు నివాళులర్పించిన జనావళి
- విద్యా సంస్థలకు సెలవు
- డీఆర్‌డీఎల్‌లో సైంటిస్టుల నివాళులు
సాక్షి, సిటీబ్యూరో/సంతోష్ నగర్: మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మరణ వార్తతో మంగళవారం నగరమంతటా విషాద వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు, అభిమానులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో నగరంలోని అన్ని స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు సైతం తెరచుకోలేదు.
కోట్లాది మంది విద్యార్థులు, యువతపై కలాం చూపిన ప్రభావాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. నగరంలోని అన్ని ప్రధాన కూడ ళ్లలో ఆ దార్శనికుడి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలాంకు నివాళులర్పించాయి. సెంట్రల్ యూనివ ర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర మహిళా సభ తదితర విద్యాసంస్థల ప్రాంగణాలు కలాం జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాయి. విద్యార్థి లోకం దుఃఖ సాగరమైంది.
అంతటా ఆయనే...
వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లోనూ కలాంకు నివాళులర్పించారు. నాంపల్లి, బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రుల్లో వైద్యులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అబిడ్స్, బొల్లారం, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఇందిరా పార్కు, బాగ్‌లింగంపల్లి, చిక్కడపల్లి, తార్నాక, ఈసీఐఎల్, చాంద్రాయణగుట్ట, అమీర్‌పేట్, పంజగుట్ట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, లాల్‌దర్వాజ, తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ఆస్పత్రుల సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఈ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కలాంకు నివాళులర్పించారు.
సాంస్కృతిక శాఖ నివాళి...
సాక్షి, సిటీబ్యూరో: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు భాషా సాంస్కృతిక శాఖ, రవీంద్రభారతి సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కార్యాలయం ప్రారంభ సమయంలో అబ్దుల్ కలాంకు నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ భారతదేశం ఆదర్శవంతమైన మేధావిని కోల్పోయిందన్నారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. భారతీయత అంటే కలాం గుర్తుకు వస్తారన్నారు. దేశం కోసం జీవితం అంకితం చేసిన మహోన్నత మూర్తి ఇకలేరనే విషయం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. కలాం జీవనశైలి నేటి తరం యువతకి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన ఆశయాలు నేటి తరం కొనసాగించాలని చెప్పారు.
ఆదర్శనీయుడు అబ్దుల్ కలాం: ఫ్రొ.కోదండరాం
అమీర్‌పేట: సాధారణ కుటుంబంలో పుట్టి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం మరణం దురదృష్టకరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సనత్‌నగర్ హిందూ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన అబ్దుల్ కలాం సంతాపసభకు ఆయన హాజరై మాట్లాడారు. పేపర్‌బాయ్‌గా పనిచేసి, వీధి దీపాల కింద చదువుకుని పైకి వచ్చిన అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయుడన్నారు.
చాలామంది శాస్త్రవేత్తలు తనకు పేరు రావాలని కోరుకుంటారని, కానీ అబ్దుల్‌కలాం మాత్రం తనతోపాటు టీంకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఆకాంక్షించే వారని చెప్పారు. అబ్దుల్‌కలాం చనిపోయారంటే కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినంత బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్ ద్వారకానాథ్, స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్ బి.శ్యాంసుందర్‌గౌడ్, ఉపాధ్యక్షులు చంద్రకళాయాదవ్, సభ్యులు త్రిపాఠి, హిందూ కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌రావు, రాధిక అధ్యాపక సిబ్బంధి పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు
కంచన్‌బాగ్‌లోని కేంద్ర రక్షణ సంస్థ డీఆర్‌డీఎల్‌లో సంతాప సభ నిర్వహించారు. డీఆర్‌డీఎల్ డెరైక్టర్ డాక్టర్ జయరామన్, రిటైర్డ్ డెరైక్టర్లు, శాస్త్రవేత్తలు సిబ్బంది కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. డీఆర్‌డీఎల్ డెరైక్టర్‌గా పని చేసిన అబ్దుల్ కలాంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. అబ్దుల్ కలాం డీఆర్‌డీఎల్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడని డెరైక్టర్ జయరామన్ కొనియాడారు. డీఆర్‌డీఓ టౌన్‌షిప్‌ను ఉద్యోగులు కలిసి ఉండేలా ఏర్పాటు చేసిన ఘతన ఆయనకే దక్కుతుందన్నారు. పాఠశాల విద్యార్థులు, పచ్చదనం అంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. డీఆర్‌డీఓ ఆస్పత్రి స్థల సేకరణకు ఎంతో కృషి చేశారని ఉద్యోగులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఎల్ రిటైర్డ్ డెరైక్టర్లు డాక్టర్ ఎ.కె. చక్రవర్తి, డాక్టర్ పన్నీర్ సెల్వం, ఉద్యోగులు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అందరితో కలివిడిగా...
కార్మికులందరితో కలిసి మెలిసి ఉంటూ పని చేసేవారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. నా వివాహానికి ఆహ్వానించాను. తప్పకుండా వస్తానని తెలిపారు. అనంతరం వివాహం రోజు రాలేకపోయానని టెలిగ్రాం పంపించారు. నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
- కె.శివకుమార్, డీఆర్‌డీఎల్ ఫైర్ ఆఫీసర్
క్షిపణి రూపకల్పనలో ఆయనతో పని చేశా
1991లో అగ్ని క్షి పణి రూపకల్పనలో ఆయనతో పాటు పని చేశాను. అంధులు, వికలాంగులపై దయతో ఉండేవారు. డీఆర్‌డీఎల్‌లో పచ్చదనం కోసం పాటు పడేవారు.
- నూరుద్దీన్ అహ్మద్, డీఆర్‌డీఎల్ టెక్నికల్ ఆఫీసర్
సమస్యల పరిష్కారానికి కృషి చేశారు
డీఆర్‌డీఎల్ డెరైక్టర్‌గా పని చేసే సమయంలో ఉద్యోగుల సమస్యల పరి
ష్కారానికి ఆయన ఎంతగానో కృషి చేసేవారు. ఉద్యోగుల యోగ క్షేమాలను తెలుసుకునేవారు. యూనియన్ నాయకులతో స్నేహపూర్వకంగా ఉండేవారు.
- సురేష్ బాబు, డీఆర్‌డీఎల్ ఏఐడీఈఎఫ్ అధ్యక్షులు