తప్పిన ముప్పు
విజయవాడ(లబ్బీపేట) : సమయం : మధ్యాహ్నం 12.40 గంటలు...ఆస్పత్రిలోని వైద్యులు తమ విధుల్లో బిజీగా ఉన్నారు. వార్డుల్లోని రోగులు భోజనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆస్పత్రిలో జరుగుతున్న అగ్ని ప్రమాదంపై సిబ్బందిని హెచ్చరిస్తూ ఫైర్(స్మోక్) అలారం మోగింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు ఎంఆర్‌ఐ స్కానింగ్ రూమ్ నుంచి దట్టమైన పొగ వ్యాపిస్తూ ఆస్పత్రి భవనాన్ని కమ్మేసింది. ఫైర్ ఫైటింగ్‌లో శిక్షణ పొందిన సిబ్బంది అప్రమత్తమై నిమిషాల వ్యవధిలో నాలుగో అంతస్తులోని ఐసీయూ, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో ఉన్న రోగులకు బయటకు తీసుకువచ్చారు. వారికి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తమ వంతు సహకారం అందించారు. అంతా అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇవీ మంగళవారం మధ్యాహ్నం విజయవాడ సెంటినీ ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాద ఘట్టాలు.. ఈ ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పటల్స్) గుర్తింపు ఉండడంతో ఫైర్‌ఫైటింగ్‌లో శిక్షణ పొందిన సిబ్బంది అక్కడే ఉంటారు. ఫైర్ అలారం హెచ్చరికతో ఫైర్‌ఫైటింగ్ సిబ్బంది, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఆ సమయంలో 51 మంది ఇన్‌పేషెంట్స్
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 51 మంది ఇన్‌పేషెంట్స్ ఉన్నారు. మరో వంద మందికిపైగా అవుట్‌పేషెంట్స్ ఉన్నారు. ప్రమాదం విషయం తెలి సిన వెంటనే ఐసీయూ నుంచి రోగులను బయటకు తీసుకు రాగా, రూమ్‌లలో ఉన్న రోగులు తమంతటా తాముగా బయటకు వచ్చేశారు. ఆస్పత్రి బయట రోగులు, వారి బంధువులతో విషాద వాతావరణం నెలకొంది. రోగులు అగ్నిప్రమాదం సమాచారాన్ని తమ బంధువులకు తెలియజేయగా, ఏం జరిగిందోనని ఆతృతగా పలువురు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
వేర్వేరు ఆస్పత్రులకు తరలింపు ...
ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్స్‌గా చికిత్స పొందుతున్న రోగులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆయుష్, రమేష్ హాస్పటల్స్‌కు తరలించారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి వైద్యులు సైతం వారి వెంట ఆయా ఆస్పత్రులకు వెళ్లారు.
ఆస్పత్రి అద్దాలు పగలగొట్టి.....
విద్యుత్‌షార్ట్ సరŠుక్యట్ కారణంగా ఆస్పత్రి భవనం అంతా దట్టమైన పొగ వ్యాప్తి చెందడంతో భవనం లోపలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయానికే రోగులంతా బయటకు వచ్చేశారు. దీంతో పలువురు పోలీసులు, ఫైర్ సిబ్బంది వెనుక వైపున ఉన్న మెట్ల ద్వారా వెళ్లి అద్దాలను పగలగొట్టారు. దీంతో పొగబయటకు రావడంతో కొంత మేర పరిస్థితి చక్కబడింది. అనంతరం ఆస్పత్రిలోని వార్డులన్నీ కలయతిరిగి రోగులు ఎవరైనా ఉన్నారేమోనని పరిశీలించారు. ఎవరూ లేక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అగ్నిప్రమాదంపై మంత్రి ఆరా
సెంటినీ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా తీసినట్లు తెలిసింది. ఆ సంఘటనపై వివరాలు సేకరించాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా ఆస్పత్రి అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గద్దే రామ్మోహన్ ఆస్పత్రికి వచ్చి రోగుల గురించి ఆరా తీశారు. అందరినీ క్షేమంగా తరలించినట్లు అక్కడి అధికారులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు.
పెనుప్రమాదం తప్పింది
ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐ స్కానింగ్ రూమ్ వెనుక విద్యుత్ షార్ట్ సరŠుక్యట్ కారణంగా దట్టమైన పొగవ్యాప్తి చెంది నట్లు గుర్తించాం. ఎలాంటి మంటలు వ్యాప్తి చెందకుండా పొగమాత్రమే వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో అప్రమత్తమై రోగులను బయటకు తరలించడంతో ప్రమాదం తప్పింది.
– ఎ. శ్రీనివాసరెడ్డి,అగ్నిమాపక అధికారి
వెంటనే అప్రమత్తమయ్యాం
అందరం పనిలో బిజీగా ఉండగా, ఆస్పత్రి ఫైర్ అలారం మోగింది. గదిలో నుంచి బయటకు వచ్చేసరికి పొగ వ్యాపిస్తోంది. దీంతో వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాం. తొలుత ఐసీయూలో, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో ఉన్న వారిని బయటకు తీసుకు వచ్చాం. కొందరు రోగులు తమంతట తాముగా వచ్చేశారు. అంబులెన్స్‌లలో వేర్వేరు ఆస్పత్రులకు తరలించగలిగాం. రోగులకు ఎలాంటి హాని జరగకుండా చూడగలిగాం.
– మధుసూదన్,ఆస్పత్రి హెచ్‌ఆర్ మేనేజర్