నాలుగుకు చేరిన మృతులు
- ఆచూకీ లేని వ్యక్తి మృతి?
-12 మంది పరిస్థితి విషమం
- ఐసీయూలో చికిత్స
నెల్లూరు (క్రైమ్) : నెల్లూరులోని పెన్నా పొర్లుకట్ట వద్ద బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రుల మృత్యుఘోష కొనసాగుతుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఆదివారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. శనివారం బాణసంచా తయారీ, నిల్వ కేంద్రంలో భారీ విస్ఫోటనం తర్వాత అక్కడ పనికి వెళ్లిన రమేష్ సైతం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నాగరాజు, లక్ష్మయ్య మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వీరందరూ నారాయణ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం తెల్లవారు జామున చౌటూరు శ్రీకాంత్ (20), మ«ధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కాకి పోలయ్య (35) మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాగా, ఆచూకీ లేని రమేష్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరు మినహా మిగిలినందరూ 80 శాతం కాలినగాయాలతో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు వైద్యులు భావిస్తున్నారు. వైద్యు లు మాత్రం శక్తివంచన లేకుండా చికిత్సను అందిస్తున్నామని రోజుగడిస్తే కాని పరిస్థితి చెప్పలేమని చెబుతున్నారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి మార్చురీకి తరలించారు. నగర డీఎస్పీ జి. వెంకటరాముడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కడుపుకోత..
పేలుడు ధాటికి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీహెచ్ శ్రీకాంత్ (19) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. చేతికందివచ్చిన కుమారుడు విగతజీవిగా మారడంతో వారికి కడుపు కోతను మిగిల్చింది. పెన్నా పొర్లుకట్ట సుందరయ్యనగర్‌కు చెందిన సన్యాసి, సంపూర్ణమ్మ దంపతులు. వారు కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లయిన చాలా కాలం తర్వాత వారికి శ్రీకాంత్ జన్మించాడు. సన్యాసి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రోజువారి కూలీకి రెండేళ్లుగా భాస్కరయ్య వద్ద పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం పనికి వెళ్లిన శ్రీకాంత్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో బాధిత తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తమకు దికెవ్వరంటూ రోదించారు. శ్రీకాంత్ మృతితో అతని కుటుంబం రోడ్డుపై పడింది.
అనాథలైన భార్య, పిల్లలు
ఇంటి యజమానిని మృత్యువు కబళించడంతో అతని భార్య, కుమార్తెలు అనాథలయ్యారు. పొర్లుకట్ట సుందరయ్యనగర్‌కు చెందిన కాకి పోలయ్య(35), కృష్ణమ్మతో వివాహమైంది. వారికి నాగమణి, శశి కుమార్తెలు ఉన్నారు. పోలయ్య బాణసంచా తయారీ కేంద్రంలో పని చేస్తుండగా, కృష్ణమ్మ పాచిపనులకు వెళ్లేది. ఉన్నంతోనే పిల్లలను చదవించుకుంటున్నారు. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో కుమార్తెలు ఇంటి వద్దనే ఉంటున్నారు. శనివారం పేలుడు ఘటనలో తీవ్రగాయాల పోలయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో అతని భార్య, పిల్లలు అనాథలయ్యారు.
కొనసాగుతున్న మృత్యుఘోష
Published Mon, Jan 2 2017 11:22 PM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
Advertisement
Advertisement