‘బతుకమ్మ’... బలిగొంది.. | Accident In Khammam | Sakshi
Sakshi News home page

‘బతుకమ్మ’... బలిగొంది..

Published Thu, Mar 7 2019 10:59 AM | Last Updated on Thu, Mar 7 2019 10:59 AM

Accident In Khammam - Sakshi

ప్రమాద స్థలంలో చెల్లాచెదరుగా పడిన క్షతగాత్రులు, మృతదేహాలు

బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని, బతుకమ్మ చీరలే బలిగొన్నాయా...? ఆ చీరెలకు, ఈ ప్రమాదానికి సంబంధమేమిటి..? అసలేం జరిగిందంటే.... 
సాక్షి, పెనుబల్లి: మహిళలను ట్రక్కులో ఎక్కించుకొని వెళ్ళుతున్న బొలేరో వ్యాను అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా , ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన పెనుబల్లి మండల పరిధిలోని మండాలపాడు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 
పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన ఎనిమిదిమంది మహిళలు సత్తుపల్లి వెళ్లేందుకని బుధవారం ఉదయం విఎంబంజర్‌ వచ్చారు. అంతలోనే,  హైదరాబాద్‌ నుంచి పశ్చిమ గోదావరి జిల్లావైపు బొలేరో వెళుతోంది. హైదరాబాద్‌లో కొబ్బరి బోండాలను అన్‌లోడ్‌ చేసి వస్తున్న ఈ వాహనంలో ఆ ఎనిమిదిమంది మహిళలు ఎక్కారు. పెనుబల్లి మండలంలోని మండాలపాడు వద్ద, వ్యాన్‌ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో, ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న భూక్యా రాంలీ(35), తేజావత్‌ రుక్మిణి(50) అక్కడికక్కడే మృతిచెందారు. దారవత్‌ లక్ష్మి, తేజావత్‌ అరుణ్, అజ్మీర పద్మ, తేజావత్‌ లలిత, తేళ్ళూరి వరలక్ష్మి, తోట అంజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆటోలలో పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వ్యాన్‌ డ్రైవర్‌ పరారయ్యాడు.

సత్తుపల్లి ఎందుకు వెళుతున్నారంటే...

ఈ ఎనిమిదిమంది మహిళలు నిరుపేదలు. బతుకమ్మ పండగ సందర్భంగా వీరికి ప్రభుత్వం చీరెలు పంపిణీ చేసింది. ఇవి నాసిరకంగా ఉండడంతో అనేకమంది ఇష్టపడలేదు. కొందరు మాత్రం.. పట్టరాని కోపంతో ఆ చీరెలను 2017, సెప్టెంబర్‌ 18న రోడ్డుపై వేసి నిప్పంటించారు. వియంబంజర్‌ పోలీసులకు ఇది ‘నేరం’గా, ‘ఘోరం’గా అనిపించింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సత్తుపల్లి కోర్టులో విచారణ సాగుతోంది. బుధవారం రోజున కోర్టు వాయిదా ఉండటంతో, కేసుతో సంబంధమున్న ఈ ఎనిమిదిమంది మహిళలు సత్తుపల్లికి బొలేరో వాహనంలో బయల్దేరారు. ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు.

ఎమ్మెల్యే సండ్ర చొరవ...

ప్రమాద వార్త తెలియగానే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పందించారు. క్షతగాత్రులను పెనుబల్లి ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం వైద్యశాలకు తరలించేంత వరకు పోలీసులతో, పెనుబల్లి వైద్యులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఖమ్మం ఆసుపత్రికి క్షతగాత్రులు చేరుకున్న తరువాత, అక్కడి వైద్యులతోనూ ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. 
ప్రమాద స్థలాన్ని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, సత్తుపల్లి రూరల్‌ సీఐ టి.రవికుమార్, వియంబంజర్‌ ఎస్సై తోట నాగరాజు పరిశీలించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసును ఎస్సై తోట నాగరాజు నమోదు చేశారు.

ఊపిరందిస్తా... కాపాడుకుంటా...

పెనుబల్లి: ఈ ప్రమాదంలో, తలకు తీవ్ర గాయాలవడంతో భూక్యా రామ్‌లీ(35) అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాద వార్త చెవిన పడడంతోనే ఆమె భర్త భూక్యా రాము, పరుగు పరుగున ప్రమాద స్థలానికి వచ్చాడు. రోడ్డు పక్కన అచేతనంగా పడిపోయిన తన భార్య రామ్‌లీని చూసి చలించాడు. ఆమెకు ఊపిరి అందడం లేదనుకున్నాడేమో...! ఆమెను తన ఒడిలోకి తీసుకుని, తన నోటితో ఊదుతూ శ్వాసను అందించేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని అక్కడున్న పోలీసులు, స్థానికులు చెప్పినప్పటికీ నమ్మలేకపోయాడు. కొద్దిసేపటి వరకు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఆ తరువాత కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ దృశ్యం... చూపరులకు కూడా కంట తడి పెట్టించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ప్రమాదానికి కారణమైన బొలేరో వ్యాన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement