'అమిత్ షాకు బ్రెయిన్ లేదు.. ఓ జైలు పక్షి'
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. నువ్వొకటంటే నేను రెండు అంట అన్న చందాన కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు మాటల దాడులు చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో సిద్ద రామయ్య కూడా గట్టిగానే స్పందించారు. అమిత్ షా ఒక బ్రెయిన్ లెస్ మనిషని, ఒకప్పటి జైలు పక్షి అని ఎద్దేవా చేశారు.
'ఒకప్పటి జైలు పక్షి మరో జైలు పక్షిని కర్నాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకుంది' అని ట్విటర్లో పరోక్షంగా అమిత్ షాను కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్పను ఉద్దేశించి విమర్శించారు. అంతేకాకుండా తనపై చేసిన ఆరోపణలు బీజేపీ నేతలు నిరూపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. సోహ్రాబుద్దీన్ హత్య కేసు విషయంలో 2010లో అమిత్ షా మూడు నెలలపాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, సిద్దరామయ్య వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్పై బయట ఉన్నారనే విషయం మర్చిపోవద్దన్నారు. ఇక కేంద్ర మంత్రి సదానంద గౌడ స్పందిస్తూ ఇందిరాగాంధీ 1977లో జైలుకు వెళ్లారు.. ఆమె కుమారుడు బోఫోర్స్ కుంభకోణంలో జైలు కెళ్లారు.. ఇది చాలా ఇంకా జాబితా కావాలా సార్ అంటూ గౌడ విమర్శించారు.