కాగితం వినియోగ రహిత శాఖగా రైల్వే
ఐదేళ్లలోపు తీర్చి దిద్దుతామన్న కేంద్ర మంత్రి సదానంద
సాక్షి, బెంగళూరు : రానున్న ఐదేళ్లలోపు రైల్వే శాఖను పూర్తిగా కాగితం వినియోగ రహిత శాఖగా మార్చలన్నది లక్ష్యమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. బెంగళూరులోని జనతా కో ఆపరేటివ్ బ్యాంక్ సువర్ణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే అక్రమాలను కనిష్ట స్థాయికి నియంత్రించవచ్చునని అన్నారు. ఇకపై రైల్వే శాఖలో రూ. 25 లక్షలకు పైబడిన పనులన్నింటినీ ఈ-టెండర్ ద్వారా కేటాయించనున్నట్లు చెప్పారు.
రైల్వేలో అక్రమాలను పూర్తిగా నియంత్రించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. అంతకు ముందు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... ఆర్థిక సంక్షోభం ప్రభావం మన దేశంపై పడకపోవడానికి సహకార రంగమే కారణమని అన్నారు. వందల ఏళ్లుగా దేశంలో సహకార రంగం పునాదులు గట్టిగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సి.ఎన్.అశ్వత్థనారాయణ, జనతా కో ఆపరేటివ్ బ్యాంక్ డెరైక్టర్ సి.ఎల్.మరిగౌడ, అధ్యక్షుడు పుట్టుస్వామి పాల్గొన్నారు.