‘వేలంపాట డబ్బు వెనక్కి ఇప్పించండి’
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వేలాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. సదావర్తి సత్రం భూములపై తమిళనాడు ప్రభుత్వం వాదనలు విన్న తరువాతే వేలం విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టుకు సుప్రీంకోర్టు నిర్దేశించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చెల్లించిన రూ.27.44 కోట్లను ఆయనకు తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సోమవారం విచారణ జరపనున్నట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని 83 ఎకరాల విలువైన భూమిని ప్రభుత్వం తమకు కావల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీనివల్ల వందల కోట్ల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల హైకోర్టులో పిల్ దాఖలు చేయటం తెలిసిందే.