sadasivapet
-
జిల్లాలో నిరంతరం కార్డన్‌సెర్చ్
సదాశివపేట(సంగారెడ్డి): జిల్లా వ్యాప్తంగా స్థానికేతరులు ఎక్కువగా నివసిస్తున్న పట్టణాల పరిధిలోని కాలనీల్లో నిరంతరం కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పట్టణ పరిధిలోని సిద్దాపూర్ కాలనీలో 150 మంది పోలీసు సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటిలో నివసిస్తున్న ప్రజలను నిద్రలేపి వారి ఆధార్, రేషన్ తదితర వివరాలను తెలుసుకున్నారు. వాహనాలను తనిఖీ చేశారు. ఈ కార్డన్‌సెర్చ్ ఉదయం 7 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానికేతరులు ఎక్కువగా నివసిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిసారించడమే కార్డన్‌సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. స్థాని కేతరులు అద్దె కావాలని వస్తే వారి గుర్తింపుకార్డులతో తెలుసుకుని అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సిద్దాపూర్ కాలనీలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో 53 బైక్‌లు, 6 ఆటోలను సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేశామన్నారు. సరైన ధ్రువపత్రాలు పోలీస్ స్టేషన్లో చూపించి తమ తమ వాహనాలను తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్, ఇన్స్పెక్టర్లు సురేం దర్‌రెడ్డి, నరెందర్, రా మకృష్ణారెడ్డి, తిరుపతిరాజు, 14 మం ది ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం
సదాశివపేట (మెదక్ జిల్లా) : సదాశివపేటలోని శ్రీకృష్ణహోండా షోరూమ్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 45 మోటార్ బైకులు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని సిబ్బంది తెలిపారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే సదాశివపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
పత్తిగోదాములో అగ్నిప్రమాదం
సదాశివపేట (మెదక్): మెదక్ జిల్లా సదాశివపేట మార్కెట్‌యార్డులోని పత్తిగోదాములో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. గోదాములో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోదాములో ఎంతపత్తి ఉంది? నష్టం ఎంత మేరకు సంభవించింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
బడుగుల బాగుకే ప్రాధాన్యం
సదాశివపేట: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగుతుందని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. అందువల్లే నామమాత్రంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లను బలోపేతం చేసేందుకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద విద్యుత్ ఏడీఇ ప్రేమ్‌కుమార్ ఆర్థికసాయంతో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని శనివారం మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. అనంతరం బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగసభలో హ రీష్‌రావు మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టకుండ, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువు అందరు సొత్తు అని చాటిన ఘనత కేవలం జ్యోతిరావు పూలేకే దక్కిందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ కూడా చదువుకు ప్రాధాన్యమిస్తోందన్నారు. అంతేకాకుండా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దశలవారీగా నిధులు మంజూరు చేసి జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే కుల వివక్షకు వ్యతిరేకంగాపోరాటం చేసి అందరు సమానమేనని చాటారన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, అంటరాని తనానికి వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం మరువలేనిదన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే కృషి చేశారన్నారు. ఆ మహనీయుని బాటలోనే సీఎం కేసీఆర్ కూడా అణగారిన వర్గాలను ఆర్థిక అభివృద్ధికోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్నం విజయలక్ష్మి, వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, కోఆప్షన్మెంబర్ కోడూరి అంజయ్య, కౌన్సిలర్ చింతగోపాల్, ఎంపీపీ రవీందర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ లింబాద్రి, తహశీల్దార్ బాలయ్య, ఆర్ఐ దశరథ్, బీసీ కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ పట్నం సుభాష్, విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అశోక్‌గౌడ్, కుమారస్వామి, వెంకన్నగౌడ్, హరివర్ధన్, యాదగిరి, రాములు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెంకటేశం, జావిద్, రాములు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలి: మంజీర రైతు సమాఖ్య వినతి వర్షాభావంతో ఖరీఫ్‌లో దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారని, అందువల్ల చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ మంత్రి హరీష్‌రావును కోరారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. క్వింటాలు పత్తికి రూ. 6 వేలు ఇవ్వాలని, టన్ను చెరకుకు మద్దతు ధర రూ.3,500 నిర్ణయించి రైతులను ఆదుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. -
మరో ఇద్దరు అన్నదాతలు బలి
టేక్మాల్/సదాశివపేట : జిల్లాలో అన్నదాతల మృత్యు పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక పక్క అప్పులు తీర్చేలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరో పక్క వరుణుడు కరుణ చూపకపోవడం తీవ్ర వర్షాభావం కారణంగా ఎండిన పంటలను చూసి అన్నదాతల గుండెలు ఆగుతున్నాయి. జిల్లాలో మూడు రోజులుగా ఇద్దరు నుంచి ముగ్గురు రైతులు ఏదో కారణంతో మృత్యువాత పడుతూనే ఉన్నారు. మంగళవారం కూడా గుండెపోటుతో ఒకరు మృతి చెందగా మరో రైతు విద్యాదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలు ఇలాఉన్నాయి.. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి మదిరా నీలబోయినవాగు తండాకు చెందిన బానోవత్ రవీందర్ (28) తనకున్న ఎకరం భూమితో పాటూ, మరో ఎకరాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో చెరకు తోటకు నీరు పార బెట్టేందుకు పొలానికి వెళ్లాడు. అయితే బోరు నడవక పోవడంతో స్టార్టర్ వద్ద మరమ్మతులు చేపడుతున్నాడు. అయితే అకస్మాత్తుగా కేబుల్ వైర్ రవీందర్ చేయి మీద పడడంతో విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగు పొరుగు రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకుమార్ తెలిపారు. మృతుడికి భార్య బుజ్జి, నాలుగేళ్ల కుమారుడు మాన్సింగ్ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పంటను చూసి దిగులు సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రైతు రాంచందర్‌గౌడ్ (55) గ్రామ శివారులో గల గంగకత్వ వాగు సమీపంలో ఉన్న మూడెకరాల భూమితో పాటు మరో ఎకర భూమిని కౌలుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఇందుకు గాను రూ. లక్ష మేర పంట పెట్టుబడిగా పెట్టాడు. దీనికి తోడు మరో రూ. లక్ష కూడా అప్పు చేశాడు. అయితే చేసిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులకు చెప్పి మదనపడేవారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాంచందర్‌గౌడ్ పత్తిపంట సాగు చేసిన పొలం వద్దకు వెళ్లాడు. అయితే తీవ్ర వర్షాభావం, భూగర్భజలాలు ఎండిపోవడంతో పత్తిపంట ఎండిపోయే స్థితికి చేరుకుంది. ఈ సారి కూడా పంట దిగుబడి వచ్చే అవకాశం లేని గ్రహించి కలత చెందాడు. ఈ నేపథ్యంలో రాంచందర్ గౌడ్ గుండెపోటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. పత్తి చేనుకు వెళ్లిన తండ్రి సోమవారం రాత్రి ఏడు గంటలైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుమారుడు రమేష్‌గౌడ్, కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడి పత్తి పొలంలో రాంచందర్ గౌడ్ విగతజీవిలా పడి ఉన్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి భార్య చంద్రమ్మ, కుమారుడు రమేష్‌గౌడ్‌లు ఉన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు.