టేక్మాల్/సదాశివపేట : జిల్లాలో అన్నదాతల మృత్యు పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక పక్క అప్పులు తీర్చేలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరో పక్క వరుణుడు కరుణ చూపకపోవడం తీవ్ర వర్షాభావం కారణంగా ఎండిన పంటలను చూసి అన్నదాతల గుండెలు ఆగుతున్నాయి. జిల్లాలో మూడు రోజులుగా ఇద్దరు నుంచి ముగ్గురు రైతులు ఏదో కారణంతో మృత్యువాత పడుతూనే ఉన్నారు.
మంగళవారం కూడా గుండెపోటుతో ఒకరు మృతి చెందగా మరో రైతు విద్యాదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలు ఇలాఉన్నాయి.. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి మదిరా నీలబోయినవాగు తండాకు చెందిన బానోవత్ రవీందర్ (28) తనకున్న ఎకరం భూమితో పాటూ, మరో ఎకరాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో చెరకు తోటకు నీరు పార బెట్టేందుకు పొలానికి వెళ్లాడు. అయితే బోరు నడవక పోవడంతో స్టార్టర్ వద్ద మరమ్మతులు చేపడుతున్నాడు.
అయితే అకస్మాత్తుగా కేబుల్ వైర్ రవీందర్ చేయి మీద పడడంతో విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగు పొరుగు రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుకుమార్ తెలిపారు. మృతుడికి భార్య బుజ్జి, నాలుగేళ్ల కుమారుడు మాన్‌సింగ్ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
పంటను చూసి దిగులు
సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రైతు రాంచందర్‌గౌడ్ (55) గ్రామ శివారులో గల గంగకత్వ వాగు సమీపంలో ఉన్న మూడెకరాల భూమితో పాటు మరో ఎకర భూమిని కౌలుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఇందుకు గాను రూ. లక్ష మేర పంట పెట్టుబడిగా పెట్టాడు. దీనికి తోడు మరో రూ. లక్ష కూడా అప్పు చేశాడు. అయితే చేసిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులకు చెప్పి మదనపడేవారు.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాంచందర్‌గౌడ్ పత్తిపంట సాగు చేసిన పొలం వద్దకు వెళ్లాడు. అయితే తీవ్ర వర్షాభావం, భూగర్భజలాలు ఎండిపోవడంతో పత్తిపంట ఎండిపోయే స్థితికి చేరుకుంది. ఈ సారి కూడా పంట దిగుబడి వచ్చే అవకాశం లేని గ్రహించి కలత చెందాడు. ఈ నేపథ్యంలో రాంచందర్ గౌడ్ గుండెపోటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. పత్తి చేనుకు వెళ్లిన తండ్రి సోమవారం రాత్రి ఏడు గంటలైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుమారుడు రమేష్‌గౌడ్, కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు.
అక్కడి పత్తి పొలంలో రాంచందర్ గౌడ్ విగతజీవిలా పడి ఉన్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి భార్య చంద్రమ్మ, కుమారుడు రమేష్‌గౌడ్‌లు ఉన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు.
మరో ఇద్దరు అన్నదాతలు బలి
Published Tue, Nov 11 2014 11:59 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement