బడుగుల బాగుకే ప్రాధాన్యం | the welfare of minorities is main target of government | Sakshi
Sakshi News home page

బడుగుల బాగుకే ప్రాధాన్యం

Published Sat, Nov 15 2014 11:44 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

the welfare of minorities is main target of government

 సదాశివపేట: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ సర్కార్ ముందుకు సాగుతుందని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. అందువల్లే నామమాత్రంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద విద్యుత్ ఏడీఇ  ప్రేమ్‌కుమార్ ఆర్థికసాయంతో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని శనివారం మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు.

అనంతరం బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగసభలో  హ రీష్‌రావు మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టకుండ, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువు అందరు సొత్తు అని చాటిన ఘనత కేవలం జ్యోతిరావు పూలేకే దక్కిందన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ కూడా చదువుకు ప్రాధాన్యమిస్తోందన్నారు. అంతేకాకుండా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దశలవారీగా నిధులు మంజూరు చేసి జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే కుల వివక్షకు వ్యతిరేకంగాపోరాటం చేసి అందరు సమానమేనని చాటారన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, అంటరాని తనానికి వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం మరువలేనిదన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే కృషి చేశారన్నారు.

ఆ మహనీయుని బాటలోనే సీఎం కేసీఆర్ కూడా అణగారిన వర్గాలను ఆర్థిక అభివృద్ధికోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్నం విజయలక్ష్మి, వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, కోఆప్షన్‌మెంబర్ కోడూరి అంజయ్య, కౌన్సిలర్ చింతగోపాల్, ఎంపీపీ రవీందర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ లింబాద్రి, తహశీల్దార్ బాలయ్య, ఆర్‌ఐ దశరథ్, బీసీ కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ పట్నం సుభాష్, విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్  నాయకులు అశోక్‌గౌడ్, కుమారస్వామి, వెంకన్నగౌడ్, హరివర్ధన్, యాదగిరి, రాములు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెంకటేశం, జావిద్, రాములు టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

 గిట్టుబాటు ధర కల్పించాలి: మంజీర రైతు సమాఖ్య వినతి
 వర్షాభావంతో ఖరీఫ్‌లో దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారని, అందువల్ల చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ మంత్రి హరీష్‌రావును కోరారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. క్వింటాలు పత్తికి రూ. 6 వేలు ఇవ్వాలని, టన్ను చెరకుకు మద్దతు ధర రూ.3,500 నిర్ణయించి రైతులను ఆదుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement