సాక్షి, ఖమ్మం: జిల్లా అధికారులకు నూతన పింఛన్ గడువు దడ పుట్టిస్తోంది. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఈనెల 8న అర్హులకు పింఛన్ అందజేయాలని ప్రభుత్వం డెడెలైన్ విధించింది. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 53 శాతం మాత్రమే దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగా, ప్రభుత్వ డెడ్‌లైన్‌తో అధికారులు హైరానా పడుతున్నారు. రేషన్, పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ఆధారంగానే పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తహశీల్దార్ కార్యాలయాలకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని వేరు చేయడం సిబ్బందికి తలనొప్పిగా మారడంతో ప్రభుత్వం తొలుత పింఛన్ దరఖాస్తులనే పరిశీలించాలని ఆదేశించింది.
జిల్లా వ్యాప్తంగా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 3,10,202 పింఛన్ దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 1,66,467 దరఖాస్తుల (53 శాతం) పరిశీలన మాత్రమే పూర్తయింది. ఇంకా 1,43,735 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. ఈనెల 8న వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అసలు పరిశీలన ఎప్పుడు పూర్తి చేయాలోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా ఖమ్మం డివిజన్‌లో 1,59,020 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 85,760 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇంకా 73,260 దరఖాస్తులు పరిశీలించడం సిబ్బందికి కత్తీమీద సాములా మారింది. ఈనెల 5 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి జాబితాలను సిద్ధం చేయాలి. అయితే దరఖాస్తులు భారీగా మిగలడంతో గడువులోపు పరిశీలన పూర్తవుతుందా లేదానని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
అర్హుల్లో ఆందోళన..
గతంలో పింఛన్ తీసుకున్న అర్హులు ఇప్పుడు తమకు పెన్షన్ వస్తుందో..లేదోనని ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల వితంతువుల పింఛన్ అర్హతకు భర్త మరణ ధ్రువీకరణ పత్రాలు అడుగుతుండడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామాల్లో.. గ్రామ కార్యదర్శి వీరిని గురిం్తచి పింఛన్ మంజూరు చేయించారు. ఇప్పుడు పింఛన్ పొందాలంటే ధ్రువీకరణ పత్రం ఎక్కడినుంచి తేవాలని వితంతువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో లబ్ధిదారుల వయసు ఆధార్‌కార్డు, రేషన్ కార్డులో వేర్వేరుగా ఉంది. దీంతో వీరి విషయంలో సిబ్బంది అడుగుతున్న ప్రశ్నలకు లబ్ధిదారులు సమాధానం చెప్పలేక పింఛన్ తమకు రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. పింఛన్ దరఖాస్తులో కూడా వయసు తప్పుగా రాయడంతో అసలు ఏ వయసు వేయాలోనని సిబ్బంది తలపట్టుకుంటున్నారు.
సిబ్బంది కొరతతో సా..గుతున్న పరిశీలన..
పింఛన్ల దరఖాస్తుల పరిశీలన సాగుతుండడానికి ప్రధాన కారణం సిబ్బంది కొరతేనని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో రైతులకు సంబంధించి రుణ అర్హత పరిశీలన జరుగుతుండడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో కొంతమంది సిబ్బంది బిజీగా ఉండడంతో పింఛన్ల దరఖాస్తుల పరిశీలనకు సిబ్బంది కొరత తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన గడువులోపు పరిశీలన పూర్తయి పింఛన్ అందరికీ మంజూరు కావడం సందేహమే. ఇక ఇది ముగిసిన తర్వాత వెంటనే ఆహార భద్రత కార్డుల దరఖాస్తులు పరిశీంచాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం బెంబేలెత్తిపోతోంది.
గడువు.. గండం
Published Sat, Nov 1 2014 4:13 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement