ఆదిలాబాద్ అర్బన్ : ఆహారభద్రత కార్డులు, పింఛన్లు, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీకి దరఖాస్తుల స్వీకరణ సోమవారం ముగిసింది. మంగళవారం నుంచి అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. సంక్షేమ పథకాలకు అర్హులా.. కాదా? తేల్చనున్నారు. ఈ నెల 30 వరకు ఈ విచారణ సాగుతుంది. ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించని వారు సైతం విచారణ అధికారులకు అందజేయవచ్చు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 10 నుంచి జిల్లాలోని గ్రామపంచాయతీల వారీగా ఆహారభద్రత కార్డులు, పింఛన్లు, ధ్రువీకరణ పత్రాల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఆహారభద్రత కార్డులకు జిల్లా వ్యాప్తంగా 7,12,645 దరఖాస్తులు రాగా, పింఛన్లకు 3,19,957 వచ్చాయి. వివిధ రకాల ధ్రువీకరణ లకు 58,877 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14 వరకే అన్న అధికారయంత్రాంగం దరఖాస్తు గడువు చాలకపోవడంతో 20 వరకు పొడిగించింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 10,91,479 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై విచారణ కొనసాగనుంది.
ప్రస్తుత పరిస్థితి..
జిల్లాలో ప్రస్తుతం 2,62,004 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరికి ప్రతి నెల రూ.7,75 కోట్లు డీఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 1,35,750 మంది కాగా, చేనేత 537, వికలాంగ 29,964, వితంతు 79,921, కల్లుగీత 283, అభయహస్తం కింద 18,549 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరు కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలల్లో అధికారులు స్వీకరించిన దరఖాస్తులు సుమారు 55 వేల వరకు ఉన్నాయి. పింఛన్‌కు 65 సంవత్సరాల వయస్సు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక కుటుంబం లో ఎంత మంది అర్హులు ఉన్నా వారందరికీ పింఛన్ ఇస్తామని ఇది వరకే ప్రకటించింది. సదరమ్ క్యాంప్‌ల ద్వారా వికలాంగ సర్టిఫికెట్ పొందిన వారికే వికలాం గుల పింఛన్ అందుతుంది. జిల్లాలో ప్రస్తుతం 6,62,228 రేషన్ కార్డులు ఉన్నాయి. 42 వేల వరకు రచ్చబండ కూపన్‌దారులు ఉన్నారు. వీరందరు ప్రస్తు తం జిల్లాలోని 1617 రేషన్‌షాపుల ద్వారా నెలనెల కోటా సరుకులు తీసుకుంటున్నారు. ఇవీ కాకుండా వివి ధ కార్యక్రమాల ద్వారా రేషన్ కార్డుల కోసం స్వీకరించి న దరఖాస్తులు సుమారు 68 వేల వరకు ఉన్నాయి.
భద్రతకార్డుల బాధ్యత తహశీల్దార్లదే..
ఆహారభద్రత కార్డుల జారీ బాధ్యతను ప్రభుత్వం తహశీల్దార్లకు అప్పగించింది. కార్డుల్లో తప్పులు దొర్లినా.. కుటుంబాల కంటే ఎక్కువ కార్డులు జారీ చేసినా.. బోగస్ కార్డులు మంజూరైనా ఆ బాధ్యత సంబంధిత తహశీల్దార్లదేనని స్పష్టం చేసింది. కాగా గ్రామాల్లో పింఛన్ల బాధ్యత ఎంపీడీవోలకు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది.
గ్రామాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి మంజూరు బాధ్యతను ఆయా మండలాల ఎంపీడీవోలకు ప్రభుత్వం కట్టబెట్టింది. మున్సిపాలిటీల్లో కమిషనర్లను బాధ్యులను చేసింది. దరఖాస్తులపై విచారణ జరిపేందుకు జిల్లాలో 312 మంది అధికారులను నియమించారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, ఎంపీడీవో, రెవెన్యూ అధికారి, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు సహాయకులు ఉంటారు. ప్రతి మండలానికి ఆరుగురు అధికారులను విచారణ అధికారులుగా నియమించి ఒక బృందంగా ఏర్పాటు చేశారు. వీరు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులపై విచారణ జరుపుతారు.
నేటి నుంచి దరఖాస్తులపై విచారణ
Published Tue, Oct 21 2014 2:09 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement