మీ వాకౌట్కు అర్థం లేదు.. విలువ లేదు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వాకౌట్కు అర్థం లేదు.. విలువ లేదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. వాకౌట్ చేసిన సబ్జెక్టు మీద ప్రభుత్వం సమాధానం పూర్తి కాకముందే వాకౌట్ చేసిన సభ్యులు మళ్లీ సభలోకి రావడం సభా మర్యాద కాదని ఆయన చెప్పారు. కార్యకర్తలను పెట్టి సర్వేలు చేయించి కార్డులు ఏరేసిన ఘనత పక్క రాష్ట్రానిదేనని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ లక్షలాది కార్డులు ఎత్తేశారే తప్ప కొత్తగా ఒక్క కార్డు కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీ సభ్యులను చూస్తే జాలి వేస్తోందని ఆయన అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ సభ్యుల అనుబంధం ఈనాటిది కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త కార్డులు ఇస్తున్నామని, ఈ ప్రాతిపదికతో పాటు గతంలో కార్డులు లేనివాళ్లు, కుటుంబాల్లో కొత్త సభ్యులుగా చేరినవాళ్ల పేర్లుకూడా చేర్చి మరీ కార్డులు ఇస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కుటుంబానికి 20 కిలోల సీలింగ్ ఉందని, ఇక్కడ మాత్రం తాము సభ్యుడికి 6 కిలోల చొప్పున ఎంతమంది ఉంటే అన్ని ఆరు కిలోల బియ్యం ఇస్తామని, సీలింగ్ ఎత్తేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు హరీశ్ రావు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 శాతం వైకల్యం ఉంటేనే 1500 పింఛను ఇస్తున్నారని, అదే ఇక్కడ మాత్రం 40 శాతం వైకల్యం ఉంటే పింఛను ఇస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు లాంటివాటిని ప్రతి ఒక్క అర్హుడికి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.