మహిళల రక్షణకు సరికొత్తగా 'సేఫ్టీ పిన్' యాప్
కొత్త కొత్త ఆప్స్ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటివల్ల మొబైల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగం ఉంటోంది. ఇప్పుడు కొత్త మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి రానుంది. ఈ అప్లికేషన్ తన సర్కిల్లో ఉండేవారికి సమాచారాన్ని షేర్ చేస్తుంది. తోటివారి రక్షణ, సేఫ్టీ గురించి, వారు ఉండే చోటు వంటి వాటి గురించి ఆ గ్రూప్‌లో వారికి ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది. ‘సేఫ్టీపిన్’ అనేది మ్యాప్ బేస్డ్ అప్లికేషన్. తమ చుట్టు పక్కన ఉన్నవారితో ఒక సర్కిల్‌గా ఏర్పడి, వారి వివరాలను అందచేసే ఆప్ ఇది. ఈ ఆప్‌లో ఏది పోస్ట్ చేసినా అది ఆ సర్కిల్లో ఉన్నవారి వాల్ ట్యాగ్ మీద కనపడుతుంది.
సేఫ్టీపిన్ కో ఫౌండర్ అయిన ఆశిష్ బాబు ఈ ఆప్ గురించి మాట్లాడుతూ, ‘‘ఈ ఆప్ వాడకందార్లు ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకోవచ్చు. రోడ్డు తేడాగా ఉందా, సర్కిల్లోని ఏదైనా ప్రదేశంలో ఇబ్బందులున్నాయా, వీధి దీపాలు పగిలిపోయాయా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఎలా ఉంది... వంటివి తెలుసుకుని, అవి అనువుగా లేనప్పుడు ఆ దారిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ ఆప్ ఉపయోగపడుతుంది’ అన్నారు.
యూజర్లు తమకు నచ్చిన చిత్రాలను ఈ అప్లోడ్ చేయవచ్చు. ఏవైనా ప్రదేశాలు చూసి వచ్చినప్పుడు అక్కడ కలిగే అనుభూతులను, వారి భావాలను విశదపరచవచ్చు. ఇవి ఆ సర్కిల్లో వారికి షేర్ చేయవచ్చు. అది చూసి ఆ సర్కిల్లోని వారంతా వారి కామెంట్లు పొందుపరచవచ్చు. వీటికితోడు, అతి సమీపంగా ఉండే ఫార్మశీ, పోలీస్ స్టేషన్ గురించి కూడా పొందుపరచవచ్చు.
‘సేఫ్టీ పిన్’ తన వాడకందార్లకు ఒక మ్యాప్‌ను ఇచ్చి, నగరంలోని ప్రాంతాలను చూపుతుంది. ప్రమాదకరమైన ప్రాంతాలు వచ్చినప్పుడు రెడ్ కలర్, రక్షణ మధ్యస్థంగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ కలర్తోను, క్షేమకరమైన ప్రాంతాలను ఆకుపచ్చరంగుతోను సూచిస్తుంది. ఈ ఆప్ వాడకందార్లు, అప్పటికప్పుడు పడుతున్న చిత్రహింసను, రక్షణ లోపాలను, అంటే వీధి దీపాలు పగిలిపోయినా, డ్రైనేజీ మూతలు ఓపెన్ అయిపోయి ఉండటం వంటివి తెలుస్తాయి.
‘సేఫ్టీ పిన్ ద్వారా ప్రజలు సమాజరక్షణ విషయంలో పాలుపంచుకోవచ్చు. రోడ్డు మీద ఎవరైనా ఎవరినైనా హింసిస్తున్నా, స్త్రీలు దాడులకు గురవుతున్నా ఆ సర్కిల్లోని వారికి సమాచారం అందుతుంది’ అని కో ఫౌండర్ అయిన కల్పనా విశ్వనాథ్ తెలిపారు. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ మీద దొరుకుతుంది.